Wednesday, May 8, 2024

హద్దులు తేలాయి, మైనింగ్ చేసుకోనివ్వండి : సుప్రీంకోర్టులో గాలి జనార్థన్ రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఓబుళాపురం మైనింగ్ కంపెనీ తవ్వకాల్లో చెరిగిపోయిన సరిహద్దులను సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా గుర్తించి డీమార్కేషన్ చేసిందని, ఈ క్రమంలో తమకు మైనింగ్ జరుపుకునేందుకు అనుమతులు ఇవ్వాలని ఆ సంస్థ యజమాని గాలి జనార్థన్ రెడ్డి సుప్రీంకోర్టును కోరారు. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ వి. రామసుబ్రమణియన్‌తో కూడిన ధర్మాసనం ఎదుట ఈ కేసు మంగళవారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా గాలి జనార్థన్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. మైనింగ్ హక్కులు కల్గినప్పటికీ కోర్టు ఆదేశాలతో 13 ఏళ్లుగా మైనింగ్ జరుపుకోలేకపోతున్నామని తెలిపారు. మైనింగ్ లీజులు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండడంతో ఆ హద్దులను తేల్చాల్సిందిగా న్యాయస్థానం సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియాను ఆదేశించిందని, 2010 నుంచి 2018 మధ్యకాలంలో సర్వే పూర్తిచేసి హద్దులను గుర్తించడం పూర్తయిందని వెల్లడించారు.

- Advertisement -

మైనింగ్ నిర్వహించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించిందని ముకుల్ రోహత్గి తెలిపారు. అయితే ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న ధర్మాసనం, ఒక్క ఏపీ మాత్రమే అంగీకరిస్తే సరిపోదని, కర్ణాటక కూడా అంగీకరించాలని వ్యాఖ్యానించింది. సరిహద్దులు దాటి మైనింగ్ జరిగిందని గుర్తుచేసింది. భూగర్భ మైనింగ్‌లో తవ్వకాలు ఎక్కడివరకు వెళ్తాయో చెప్పలేమంటూ ఆస్ట్రేలియా ఉదంతాన్ని ఉదహరించింది. అయితే ఓబుళాపురం మైనింగ్ కంపెనీ లీజులు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ పరిధిలోనే ఉన్నాయని, వాటికి కర్ణాటకతో సంబంధం లేదని రోహత్గి వాదించారు. కర్ణాటక నుంచి అభ్యంతరాలు కూడా ఏమీ లేవని వెల్లడించారు. అయితే ఈ కేసు విచారణ గ్రీన్ బెంచ్ చేపడుతుందని ధర్మాసనం వెల్లడించింది. సుప్రీంకోర్టు గ్రీన్ బెంచ్ ప్రతి బుధవారం విచారణ జరుపుతున్న నేపథ్యంలో మర్నాడు జరిగే విచారణకే ఈ కేసును చేపట్టాలని ముకుల్ రోహత్గి కోరగా, ఇప్పటికే విచారణ జాబితా సిద్ధమై ఉంటుందని, ఈ పరిస్థితుల్లో వచ్చే బుధవారం జరిగే గ్రీన్ బెంచ్ విచారణ జాబితాలో ఈ కేసును చేర్చుతామని ధర్మాసనం తెలిపింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement