Saturday, April 27, 2024

Delhi | ఈ స్పీడు సరిపోదు మరింత వేగం కావాలి.. తెలంగాణలో అధికారం చేజిక్కించుకునే దిశలో బీజేపీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకునే దిశలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర నాయకత్వం చేస్తున్న ప్రయత్నాలను మెచ్చుకుంటూనే.. ఈ వేగం సరిపోదని అధిష్టానం తేల్చి చెప్పింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరింత ఉత్సాహంతో, మరింత దూకుడుగా పనిచేయాలని దిశానిర్దేశం చేసింది. మంగళవారం పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరిగిన కీలక సమావేశంలో అధిష్టానం పెద్దలైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) బీఎల్ సంతోష్, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ తదితరులు కూడా హాజరయ్యారు. తెలంగాణకు చెందిన బీజేపీ ముఖ్య నేతలు 15 మంది సమావేశానికి రావాల్సిందిగా అధిష్టానం నుంచి పిలుపు అందింది. వారిలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు డా. కే. లక్ష్మణ్, జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్‌తో పాటు సీనియర్ నేతలు జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, విజయశాంతి, వివేక్ వెంకటస్వామి, ధర్మపురి అరవింద్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి హాజరయ్యారు.

తొలుత కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలోనే ఈ సమావేశం జరుగుతుందని చెప్పినప్పటికీ, ఆ తర్వాత వేదికను జేపీ నడ్డా నివాసానికి మార్చారు. తెలంగాణ నేతలు చేరుకోక ముందే అమిత్ షా, బీఎల్ సంతోష్ తదితరులు నడ్డా నివాసానికి చేరుకున్నారు. మధ్యాహ్నం గం. 11.30 నుంచి ఒక్కొక్కొరుగా తెలంగాణ నేతలు చేరుకున్నారు. సాయంత్రం గం. 3.30 వరకు సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. మధ్యలో జేపీ నడ్డా, అమిత్ షా బయటికొచ్చి వేరే గదిలో విడివిడిగా ఒక అర గంట పాటు చర్చించుకున్నారు. అనంతరం మళ్లీ సమావేశాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా ప్రజా సంగ్రామ యాత్ర, ప్రజా గోస – బీజేపీ భరోసా, స్ట్రీట్ కార్నర్ మీటింగులు, పార్లమెంట్ ప్రవాస్ వంటి కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు.

- Advertisement -

వీటిపై సంతృప్తి వ్యక్తం చేస్తూనే.. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరింత దూకుడుగా దూసుకెళ్లాలని, ఈ క్రమంలో భారీస్థాయిలో నిరసనలు, ఆందోళనలు, పోరాటాలకు శ్రీకారం చూట్టాలని అధిష్టానం సూచించింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ వైఫల్యాలను, తప్పిదాలను విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించింది. కేసీఆర్ ప్రభుత్వ అవినీతినే అస్త్రంగా మలచుకోవాలని చెప్పినట్టు తెలిసింది. అదే సమయంలో రాష్ట్ర నాయకత్వంలో గ్రూపులుగా చీలికలు, వర్గ విబేధాల గురించి చర్చించినట్టు తెలిసింది. అందరూ కలసికట్టుగా పనిచేయాలని అధిష్టానం ఆదేశించింది. 

అయితే ఉన్నఫలంగా ముందే నిర్ణయించుకున్న కార్యక్రమాలను పక్కనపెట్టి మరీ ముఖ్యనేతలను ఢిల్లీకి పిలిపించడంపై తొలుత అనేక ఊహాగానాలు చెలరేగాయి. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను అరెస్టు జరిగిన సమయంలోనే ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఇదే కుంభకోణం కేసులో తెలంగాణకు చెందిన కొందరు రాజకీయ ప్రముఖుల పాత్రపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేతలను పిలిచి చర్చిస్తున్నారని అందరూ భావించారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై కొందరు సీనియర్లలో అసంతృప్తి ఉందని, దానిపైనే చర్చించేందుకు పిలిపించి ఉంటారని కూడా కథనాలు వెలువడ్డాయి. సమావేశం ప్రారంభమయ్యే ముందే తరుణ్ చుగ్ మీడియాతో మాట్లాడుతూ సంస్థాగత అంశాల గురించి చర్చించడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు.

‘హర్ ఘర్ కమల్’ – పొంగులేటి

తెలంగాణ రాష్ట్రంలో పార్టీ నేతలు చేపట్టిన కార్యక్రమాల తీరును జాతీయ నాయకత్వం మెచ్చుకుందని, అయితే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని  అధిష్టానం సూచించినట్టు చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు తీరు, అహంకార ధోరణి, అవినీతి, కుటుంబ పాలన, సొంత రాజ్యాంగం అమలు వంటి అంశాల గురించి చర్చించినట్టు చెప్పారు. తెలంగాణకు చంద్రగ్రహణం పట్టిందని, ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని పొంగులేటి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పార్టీ గుర్తు ‘కమలం’ను ప్రతి ఇంటికీ తీసుకెళ్లే లక్ష్యంతో ‘హర్ ఘర్ కమల్’ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు చెప్పారు. ప్రజా తెలంగాణ నిర్మాణం కోసం పనిచేస్తామని, రాష్ట్రంలో రాజకీయంగా బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని ప్రజలందరూ విశ్వసిస్తున్నారని చెప్పారు.

ప్రజలు విముక్తి కోరుతున్నారు అది బీజేపీతోనే సాధ్యం – తరుణ్ చుగ్

తెలంగాణ సీఎం కేసీఆర్ అవినీతి, అహంకార, కుటుంబ పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్ అన్నారు. ఈ విముక్తి బీజేపీతోనే సాధ్యమని కూడా అనుకుంటున్నారని ఆయన చెప్పారు. ఈ క్రమంలో తగిన ప్రణాళికలు, వ్యూహాలతో ముందుకెళ్తున్నామని చుగ్ తెలిపారు. ఇప్పటికే 11 వేల వీధి సమావేశాలు లక్ష్యంగా పెట్టుకోగా, మంగళవారంతో ఆ లక్ష్యం పూర్తయిందని అన్నారు. ఇలాంటి పార్టీ సంస్థాగత అంశాలపై చర్చించడం కోసమే అధిష్టానం సమావేశం ఏర్పాటు చేసిందని వెల్లడించారు.

పోరాటమే మార్గం విజయమే లక్ష్యం – బండి సంజయ్

తెలంగాణలో బీజేపీని మరింత బలోపేతం చేసే దిశగా అధిష్టానం పెద్దలతో జరిగిన సమావేశంలో చర్చ జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఆ మార్పు బీజేపీతోనే సాధ్యం అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్‌కు ప్రతికూలంగా వస్తున్న ఫలితాలే ఇందుకు నిదర్శనమని సూత్రీకరించారు. రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నా తొలుత స్పందించేది బీజేపీయేనని అన్నారు. తాము చేపట్టిన కార్యక్రమాలపై జాతీయ నాయకత్వం సంతృప్తిగా ఉందని వెల్లడించారు. అదే సమయంలో తమ ఆలోచనలు కూడా అధిష్టానంతో పంచుకున్నామని చెప్పారు.

ఈ క్రమంలో ప్రజా సమస్యలపై పోరాటం మరింత ఉధృతం చేయాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు పెట్టాలని ఇదివరకే నిర్ణయించుకున్నామని, వాటితో పాటు ఇతర పోరాట కార్యక్రమాలను కూడా రూపొందించుకుంటామని చెప్పారు. బీజేపీకి నేతలు లేరంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని, వారికి అనుకూలంగా ఉండే మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయని బండి సంజయ్ అసహనం వ్యక్తం చేశారు.

మద్యం కుంభకోణం కేసు గురించి చర్చ జరిగిందా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. మద్యం కుంభకోణమా, భూ కుంభకోణమా, నయీం డైరీ కేసులా అన్నది తమకు సంబంధం లేదని, కేసుల్లో సాక్ష్యాధారాల ప్రకారం దర్యాప్తు సంస్థలు వాటిపని అవి చేసుకుంటాయని బండి సంజయ్ అన్నారు. ఆ కేసులతో బీజేపీకి సంబంధం లేదని, మంగళవారం జరిగిన మీటింగులో వాటి గురించి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. అయితే మద్యం కుంభకోణం కేసులో మనీశ్ సిసోడియాను అరెస్టు చేస్తే స్పందించిన తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన కుమార్తె కవితకు నోటీసులు ఇస్తే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. సీబీఐ, ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్లు, రిమాండ్ రిపోర్టుల్లో కవిత పేరును పలుమార్లు ప్రస్తావించిన విషయాన్ని బండి సంజయ్ గుర్తుచేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement