Tuesday, May 14, 2024

జీనోమ్‌వ్యాలీలో జీవవైవిధ్య పరిశోధనా కేంద్రం.. ఏప్రిల్‌ 2న ప్రారంభం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : జంతు సంబంధిత పరిశోధనల కోసం హైదరాబాద్‌ శివారు జీనోమ్‌ వ్యాలీలో జీవ వైవిధ్య పరిశోధనా సంస్థను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. కేంద్ర వైద్యశాఖా మంత్రి మన్సూక్‌ మాండవీయ ఏప్రిల్‌ 2న స్టేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ పేరుతో ఈ ‘నేషనల్‌ యానిమల్‌ రీసెర్చ్‌ ఫెసిలిటీ ఫర్‌ బయో మెడికల్‌ రీసెర్చ్‌’ సంస్థను ప్రారంభిస్తారని వెల్లడించారు. జంతు సంబంధిత పరిశోధన కోసం దేశంలోనే కాకుండా దక్షిణాసియాలోనే ఏర్పాటు చేసిన తొలి సంస్థ అని పేర్కొన్నారు. దాదాపు 100 ఎకరాల స్థలంలో రూ.400 కోట్ల వ్యయంతో ఈ సంస్థను కేంద్ర ప్రభుత్వం నిర్మించిందని చెప్పారు. ఫార్మా రాజధానిగా అభివృద్ధి చెందిన హైదరాబాద్‌లో ఈ పరిశోధనా సంస్థ రావటం ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) ఆధ్వర్యంలో ఈ పరిశోధనా కేంద్రం పనిచేయనుందన్నారు. 4లక్షల అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సంస్థలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో జంతువులను పెంచుతామని వివరించారు. ఈ సంస్థలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో జరిగే పరిశోధనలతో హైదరాబాద్‌కు మంచి గుర్తింపు రానుందన్నారు.

కాగా… తెలంగాణకు సైన్స్‌ సిటీ, గిరిజన మ్యూజియం సహా ఎన్నో అభివృద్ధి ప్రాజెక్టులను మంజూరు చేశామన్నారు. రాష్ట్రీయ సాంస్కృతిక మహోత్సవాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఏప్రిల్‌ 1 నుంచి 3 వరకు హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ స్టేడీయంలోనూ సాంస్కృతిక మహోత్సవాలను నిర్వహిస్తామన్నారు. హైదరాబాద్‌లో వేడుకలను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభిస్తారని చెప్పారు. సీఎం కేసీఆర్‌ యాదాద్రికి ఆహ్వానించకపోయినా తర్వాత వెళ్లి దర్శించుకుంటామని చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement