Saturday, December 2, 2023

Big Story : రాజ్‌భవన్‌లో బిల్లు పెండింగ్‌.. అటవీ కళాశాల పరిశోధనా సంస్థకు మోక్షం లభించేనా?

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఐదు విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం అటవీ విశ్వవిద్యాలయం కూడా ఒక ఏర్పాటు చేసేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ములుగులోని అటవీ కళాశాలలు, పరిశోధనా సంస్థను అటవీ విశ్వవిద్యాలయంగా అప్‌గ్రేడ్‌ చేయాలని యోచిస్తున్న ప్రభుత్వం ప్రభుత్వ పరంగా చేయాల్సిన లాంఛనాలన్నీ పూర్తి చేసింది. ముఖ్యంగా అటవీ విశ్వవిద్యాలయానికి శాసనసభ, శాసన మండలి ఆమోదం పొంది ఆ బిల్లును రాష్ట్ర గవర్నర్‌ తమిళి సై సౌందర రాజన్‌ వద్దకు పంపించింది. అయితే రాజ్‌భవన్‌లో మాత్రం ఈ బిల్లు గడచిన ఆరు వారాల నుండి పెండింగ్‌లోనే ఉంది.

- Advertisement -
   

ముఖ్యమంత్రి కెసిఆర్‌ విశ్వవిద్యాలయానికి ఛాన్స్‌లర్‌గా ఉండి వైస్‌ ఛాన్స్‌లర్‌ను ఛాన్సలరే నియమిస్తారన్న ఏకైక కారణంతో ఈ బిల్లు పెండింగ్‌లో ఉన్నట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఉభయ సభలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన సుమారు ఎనిమిది బిల్లులు రాజ్‌భవన్‌లోనే పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇతర బిల్లులతో పాటు వర్సిటీ బిల్లుకు ఆమోదం తెలిపితే అటవీ విశ్వవిద్యాలయంతోనే పర్యావరణానికి చక్కని భవిత ఇచ్చినట్టు అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

వర్సిటీ వస్తే లాభాలు ఎన్నో..

అటవీ కళాశాల మరియు పరిశోధనా సంస్థను యూనివర్సిటీగా రూపొందించిన తరువాత అదనంగా పిహెచ్‌డి కోర్సులు , పట్టణ అటవీ వనాలు, నర్సరీ మేనేజ్‌మెంట్‌, ఆగ్రో ఫారెస్ట్రీ , గిరిజన జీవనోపాధి పెంపుదల, ఫారెస్టు ఎంట్రప్రెన్సూర్‌షిప్‌ , క్లైమెట్‌ స్మార్ట్‌ ఫారెస్ట్రీ అలాగే ఫారెస్టు ఫార్మ్సు మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులు ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తున్నదని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఇలాంటి బృహత్కార్యానికి సర్కారు సిద్దం కావడం హర్షించాల్సిన విషయం అంటున్నారు.

కాగా హరిత హారం కార్యక్రమం ద్వారా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం బహుముఖ విధానాల ద్వారా హరిత వనాలను పెంచే కార్యక్రమాన్ని చేపట్టిందని, ఇంత మంచి కార్యకలాపాలు చేపట్టిన తెలంగాణ సర్కారును రాజకీయ కోణంలో కాకుండా అటవీ, పర్యావరణ మేలు కోరుకునే విధంగా గవర్నర్‌ ముందుకు రావాలని ప్రభుత్వ వర్గాలు, అటవీశాఖ ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. అటవీ విశ్వవిద్యాలయం తెలంగాణ చట్టం 2022 దేశంలోనే మొదటిదని ప్రపంచంలో మూడు అటవీ యూనివర్సిటీలు ఉన్నాయని రష్యా, చైనా తరువాత మూడోది భారత దేశంలో మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదని చెబుతున్నారు.

తెలంగాణ ప్రభుత్వం అటవీ కళాశాల, మరియు పరిశోధనా సంస్థను ప్రపంచ స్థాయి సంస్థగా తీర్చిదిద్దేందుకు యత్నిస్తున్నదని గుర్తు చేస్తున్నారు. కొత్తగా అటవీ వర్సీటీ గనుక తెలంగాణ రాష్ట్రానికి గనుక వస్తే అటవీ వనరుల సంరక్షణ స్థిరమైన నిర్వహణ సాధ్యం అవుతుందంటున్నారు. అర్హత కలిగిన అటవీ నిపుణులను తయారు చేయడం ఈ వర్సిటీ లక్ష్యంగా పెట్టుకునే ఛాన్స్‌ ఉంటుందంటున్నారు. అటవీ పరిశోధనలు ప్రొత్సహించడం, మొక్కలు, చెట్ల పెంపకానికి తగిన పద్దతులను అభివృద్ధి చేయడం ద్వారా పరిశ్రమలు అలాగే ప్రజల అవసరాలను తీర్చడం వీలు కల్గుతుందని వారు గుర్తు చేస్తున్నారు.

వివిధ వ్యవసాయ పర్యావరణ పరిస్థితులకు అనువైన వ్యవసాయ అటవీ నమూనాలను అభివృద్ధి చేయడం ద్వారా ప్రజల అవసరాలను తీర్చేందుకు వీలు కలుగుతుందని చెబుతున్నారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమం కింద ఇప్పటి వరకు 268.68 కోట్ల మొక్కలు నాటిన నేపథ్యంలో వీటి సంరక్షణ, భద్రత వంటి అంశాలపై గట్టి చర్యలు తీసుకునేందుకు వర్సిటీ కూడా ఉపకరిస్తుందంటున్నారు. గత ఎనిమది సంవత్సరాలుగా ప్రభుత్వం యొక్క నిరంతర కృషి కారణంగానే రాష్ట్రంలో పచ్చదనం 7.7 శాతం, అటవీ విస్తీర్ణం 6.65 శాతం పెరిగిన విషయాన్ని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement