Monday, May 20, 2024

Big Story: ఐటీలో కొత్తగా 80వేల జాబ్స్‌.. నాచారం, ఉప్పల్‌, శంషాబాద్‌లో కొత్త ఐటీ టవర్లు, క్లస్టర్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో 80వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని అసెంబ్లిd వేదికగా ప్రకటించిన సీఎం కేసీఆర్‌ తాజాగా ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) రంగంలో కొత్తగా 80వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. బడ్జెట్‌లోనే ఇదే అంశాన్ని ప్రస్తావించింది. 2020-21లో ఐటీ ఎగుమతులు రూ.1,45,522 కోట్లు చేసినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆ ఏడాదిలో 46వేల మందికి ఉపాధి అవకాశాలు లభ్యమయ్యాయి. దేశ వ్యాప్తంగా లక్షా 38వేల మందికి ఐటీ ఉద్యోగాలు వచ్చాయని ఒక్క తెలంగాణలోనే 33శాతం ఉద్యోగాలను ఇక్కడి యువత చేజిక్కించుకుందని తెలిపారు. ప్రభుత్వం వరంగల్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌, తాజాగా ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఐటీ హబ్‌లలో స్థానిక యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభ్యమవుతున్నాయని దీంతో వారున్న సొంత ఊర్లోనే ఉద్యోగాలు రావడంతో ఆ ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందేందుకు దోహద పడుతున్నాయని చెబుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ఈ సంఖ్యను రెట్టింపు చేయాలన్న పట్టుదలతో ఉన్నట్టు ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో ఇప్పటి దాకా ఐటీ రంగంలో ఆరు లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించినట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి.

శంషాబాద్‌ పరిసరాల్లో కొత్త ఐటీ టవర్లు..

ఐటీ రంగాన్ని కేవలం గచ్చిబౌలి, ఫైనాన్షియల్‌ జిల్లాకే పరిమితం చేయకుండా హైదరాబాద్‌ నలు దిక్కులా ఐటీ టవర్లు ఏర్పాటు చేసేందుకు సంబంధిత శాఖ మంత్రి కేటీ రామారావు దృష్టి సారించారు. కొంపల్లిలో కొత్త ఐటీ టవర్‌ ఏర్పాటుతో పాటు కొల్లూరు, ఉస్మాన్‌సాగర్‌, దక్షిణ హైదరాబాద్‌ ప్రాంతాలైన చాంద్రాయణగుట్ట, శంషాబాద్‌ పరిసరాల్లో ఐటీ టవర్లు, క్లస్టర్లను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేసింది. వచ్చే నాలుగేళ్లలో దశల వారీగా ఐటీ టవర్లు, క్లస్టర్లు ప్రారంభించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఉప్పల్‌, పోచారం ప్రాంతాల్లో కూడా ఐటీని విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఔటర్‌ రింగ్‌రోడ్డు సమీపాన ఐటీ టవర్లు, క్లస్టర్లను ఏర్పాటు చేయడం ద్వారా ఉద్యోగులు ఎటువంటి ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా కార్యాయాలకు చేరుకోవచ్చని దీనివల్ల శివారు ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చినట్టు సమాచారం. ఐటీ టవర్లకు ఏర్పాటుకు అవసరమైన ప్రాంతాన్ని ఎంపిక చేసి ఇందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని మంత్రి రామారావు ఇప్పటికే ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ను కోరినట్టు సమాచారం.

యువతకు ప్రత్యేక శిక్షణ..

ఇంజనీరింగ్‌తో పాటు ఎంబీఏ, ఎంసీఏ, ఇతర వృత్తి విద్యా కోర్సులను పూర్తి చేసుకుని బయటికి వస్తున్న విద్యార్థుల సంఖ్య ఏటా 80వేల వరకు ఉంటుందని, ఇందులో 10 నుంచి 20శాతం మంది ఉన్నత చదువులకు ఇతర దేశాలకు వెళ్తుండగా మిగతా వారంతా ఉపాధి కోసం స్థానికంగా ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారని ప్రభుత్వ గణాంకాలను బట్టి తెలుస్తోంది. వీరందరికీ బహుళజాతి సంస్థల్లో ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం ఆయా సంస్థల యాజమాన్యాలతో సంప్రదింపులు జరపాలని నిర్ణయించింది. ఆ సంస్థలకు ఏ తరహా విద్యార్థులు కావాలో దాన్ని బట్టి శిక్షణ కల్పించాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ యువతకు ఉద్యోగాలిచ్చే సంస్థలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చే ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు త్వరలోనే మంత్రి కేటీ రామారావు ఆయా సంస్థల ప్రతినిధులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

ఉస్మానియా, జేఎన్‌టీయూతో ఒప్పందాలు..

ఇండస్ట్రీతో విద్యార్థులకు అనుసంధానం కల్పించేందుకు ప్రభుత్వం కొన్ని ఐటీ పరిశ్రమలను ఎంపిక చేసి వారితో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఇంజనీరింగ్‌, ఎంబీఏ, ఎంసీఏతో పాటు ఫార్మసీ, ఆర్కిటెక్చర్‌ కళాశాలలు అత్యధికంగా ఉస్మానియా, జేఎన్‌టీయూ విశ్వవిద్యాలయాల పరిధిలో ఉన్నాయి. విద్యార్థులు తమ చదువుతో పాటు స్థానిక ఐటీ పరిశ్రమల్లో కనీసం ఆరు నెలల పాటు శిక్షణ పొందేలా చేయాలని ఇందుకు పరిశ్రమల యాజమాన్యాలను ఒప్పించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ రెండు విశ్వవిద్యాలయాలతో ఒప్పందం కుదుర్చుకుని విద్యార్థులను ఆయా పరిశ్రమలకు పంపి శిక్షణ పొందేలా చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ మేరకు అవసరమైన చర్యలను చేపట్టాలని ఉన్నత విద్యామండలిని ఆదేశించినట్టు సమాచారం. ఈ ఒప్పందం ఖరారైతే వచ్చే రెండు, మూడు నెలల్లో విద్యార్థులు ఆయా ఐటీ కంపెనీలకు వెళ్లి శిక్షణ పొందే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement