Friday, May 10, 2024

వచ్చె నెల నుంచి కొత్త పింఛన్లు.. అర్హులైన వారందరికీ ఇచ్చేందుకు నిర్ణయం

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ: తెలంగాణలో వచ్చే నెల నుంచి కొత్త పింఛన్లను ఇవ్వబోతున్నామని, ఈ మేరకు అర్హులైన వారందరినీ గుర్తిస్తున్నామని, అర్హులైన వారందరికీ కొత్త పింఛను ఏప్రిల్‌ నుంచి వస్తుందని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం శాసనసభలో బడ్జెట్‌ పద్దుపై చర్చ సందర్భంగా మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్‌ నుంచి కొత్తగా ఆసరా పింఛన్లు రానున్నాయని పేర్కొన్నారు. మంత్రి ప్రకటనతో రాష్ట్రంలో సుమారు 7.5లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. అనంతరం పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల పద్దుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలోని గ్రామాల అభివృద్ధికి కేంద్రం మెచ్చి మోయలేనన్ని అవార్డులను ఇస్తుందని అన్నారు. ఇప్పటికే 2014 నుంచి 2018వరకు 7 అవార్డులను ఇచ్చిందని పేర్కొన్నారు. కాగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పలు పథకాలను కేంద్రం దేశ వ్యాప్తంగా అమలుచేస్తుందని గుర్తుచేశారు.

స్వరాష్ట్రంలో గ్రామాలు బాగుపడ్డయ్‌, బలపడ్డయ్‌..
రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వం ఏర్పడిన తరువాత గ్రామాల్లోని పారిశుధ్యం బాగుపడగా, పల్లెప్రకృతి వనం, పల్లె ప్రగతి కార్యక్రమాలతో గ్రామాలన్నీ ఆర్ధికంగా కూడా బలపడ్డాయని తెలిపారు. వీటిలో ప్రధానంగా పంచాయతీలకు అందించిన ట్రాక్టర్లతోనే సుమారు రూ.180కోట్ల ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. ఉపాధి హామీలోనూ పనిదినాలను పెంచుకోవడంతో పాటు కూలీ గిట్టుబాటు అయ్యేలా చేసామన్నారు. కానీ కేంద్రం మాత్రం ఈ సారి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఉపాధి హామీ బడ్జెట్‌ను తగ్గించిందని విమర్శించారు. కాంగ్రెస్‌ హాయాంలో 3లక్షల పనిదినాలను కేటాయిస్తే రాష్ట్రం ఏర్పడిన తరువాత 11లక్షల 70వేల పనిదినాలను ఇవ్వడంతో పాటు 2021లో 15కోట్లు, ప్రస్తుత ఏడాదిలో 14కోట్ల పనిదినాలను ఇచ్చామన్నారు. దీంతో పాటు మహిళలకు వడ్డీ లేని రుణాలు, స్త్రీ నిధి ద్వారా రూ.3లక్షల రుణాలను అందిస్తున్నామని, ఎవరైనా రుణం తీసుకున్న తరువాత దురదృష్టవశాత్తు మరణిస్తే ఆ రుణం మొత్తాన్ని మాఫీ చేస్తున్నామని తెలిపారు. మిషన్‌ భగీరధ ద్వారా ఇంటింటికీ మంచినీటిని అందించి ప్రస్తుతం రాష్ట్రంలో ఫ్లోరైడ్‌ మహమ్మారిని పారద్రోలామన్నారు.

గతంలో 5, 6 గ్రామాలకు కలిపి ఒక్క విలేజ్‌ అసిస్టింట్‌ ఉండేవారని కానీ ఇపుడు గ్రామానికొక విలేజ్‌ అసిస్టెంట్‌ను ఏర్పాటుచేసుకుని గ్రామాలను ఆర్ధికంగా బలపడడంతో పాటు, పారిశుధ్యంలోనూ ముందంజలో ఉండేలా చేసుకుంటున్నామన్నారు. వైకుంఠధామాల ద్వారా ఎలాంటి బేధాలు లేకుండా చివరి మజిలీకి ప్రశాంత వాతావరణానన్ని కల్పించామన్నారు. హరితహారం ద్వారా రాష్ట్రం మొత్తం పచ్చగా దర్శనమిస్తుండగా, నాటిన మొక్కల్లో 96శాతం బతికించామని అన్నారు. కాగా ప్రస్తుతం ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారికి చెట్లు కనబడగానే తెలంగాణ వచ్చిందన్న భావనలోకి వెళ్తున్నారని వీటిని ప్రతిపక్షాలు పరిగణలోకి తీసుకోకుండా విమర్శలు చేస్తున్నాయంటూ చురకలు అంటించారు.

కేసీఆర్‌ వచ్చాకే పింఛన్లు, ప్రజాప్రతినిధుల జీతాలు పెరిగినయి..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, కేసీఆర్‌ ప్రభుత్వం వచ్చిన తరువాతే రాష్ట్రంలోని పింఛన్‌ దారులకు పెన్షన్‌ పెరగడంతో పాటు ప్రజాప్రతినిధులకు జీతాలు పెరిగాయని మంత్రి ఎర్రబెల్లి సభలో స్పష్టంచేశారు. కాంగ్రెస్‌ హాయాంలో ఎంపిటీసీ, జడ్పిటీసీల అధికారాలను హరించిందని దుయ్యబట్టారు. కాగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులకు అధికారాలను ఇవ్వడంతోపాటు జడ్పీ ఛైర్మన్ల జీతం గతంలో రూ.7,500 ఉంటే దాన్ని రూ.లక్షకు పెంచామని, జడ్పీటీసీలకు గతంలో రూ.2,250 ఉంటే రూ.13వేలకు, ఎంపిపిలకు రూ.1500 నుంచి రూ.10వేలు, ఎంపిటీసీలకు రూ.750 నుంచి రూ.5,650కు, సర్పంచ్‌లకు రూ.1000 నుంచి రూ.6,500కు పెంచుకున్నామని తెలిపారు. కాగా ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులకు ఇస్తున్న గౌరవ వేతనాల గురించి కూడా ప్రస్తావించారు. బీజేపీ ప్రభుత్వం ఉన్న మధ్యప్రదేశ్‌లో సర్పంచ్‌లకు రూ.1,750, కర్ణాటకలో రూ.3వేలు, ఉత్తర్‌ప్రదేశ్‌లో రూ.3,500లను మాత్రమే ఇస్తున్నారని విమర్శించారు. కాగా తెలంగాణలో సఫాయి కార్మికులకు కూడా వేతనాన్ని రూ.8,500 చేశామన్నారు.

సీఎం కేసీఆర్‌ మనసున్న మారాజు..
సీఎం కేసీఆర్‌ మనసున్న మారాజంటూ ఎర్రబెల్లి కొనియాడారు. పేదల సమస్యలను అర్ధం చేసుకునే మనుసుంది కాబట్టే రాష్ట్రం ఏర్పడగానే పింఛన్లపై దృష్టి కేంద్రీకరించి రూ.200గా ఉన్న పింఛన్లను రూ.2,116లకు పెంచుకున్నామని, వికలాంగులతో పాటు ఇతర వారికి కూడా పింఛన్లను ఇస్తున్నామన్నారు. కాగా బీజేపీ పాలిత ప్రాంతాల్లో పింఛన్లు చాలా తక్కువ ఉన్నాయంటూ మణిపూర్‌లో రూ.200, యూపీలో రూ.500, గుజరాత్‌లో రూ.750 మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. కాగా సీపిఎం అధికారంలో ఉన్న కేరళలో మాత్రం రూ.1,400 ఇస్తున్నారని, తమిళనాడులోనూ రూ.1000 ఇస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పాలిత ప్రాంతాల్లో మాత్రం వృద్ధాప్య పింఛన్‌ను 68ఏళ్లకు పైబడిన వారికే ఇస్తుండగా అది కూడా ఛత్తీస్‌ఘడ్‌లో రూ.350ను మాత్రమే ఇస్తున్నారన్నారు. కానీ ఇరు జాతీయ పార్టీ నాయకులు మాత్రం ఇక్కడ ఏదేదో మాట్లాడుతారని, ముందు వారు పాలిస్తున్న రాష్ట్రాల్లో వీటిని చక్కదిద్దిన తరువాత మాట్లాడాలని హితవు పలికారు.

హరీషన్నా..భట్టన్నా అంటూ సభలో సరదాగా..
సభలో బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి కాసేపు నవ్వులు పూయించారు. ఆయన మాట్లాడుతున్న సమయంలో ప్రభుత్వ పథకాలను ‘పొగడకున్నా పర్లేదు..తిట్టకురే’ అంటూ భట్టిని, కాంగ్రెస్‌ను ఉద్దేశించి అనడంతో సభలో నవ్వులు పూసాయి. అవార్డుల గురించిమాట్లాడుతూ..సిద్ధిపేటకుమస్తుగా అవార్డులొచ్చినయ్‌..హరిషన్న ఉండంటే అవి ఎట్లైనా వస్తయ్‌..అన్నారు. అనంతరం సమయం మించిపోతుందన్నప్పుడు.. హరిషన్న మాట్లాడమంటవానే..పరిమిషన్‌ ఇస్తవా అనగానే సభ్యులంతా హస్యభరితులయ్యారు. కాగా కాంగ్రెస్‌ హాయాంలో సభ నడిచినపుడు బిందెలు, వరి కంకులు, దీపాలతోనే వచ్చేవారమన్నారు. అపుడు మేము తెలుగుదేశంలో ఉండేనని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement