Sunday, April 28, 2024

గంగా తరహాలో మూసీ ప్రక్షాళన చేప‌ట్టాలే: ప్రధానితో కోమటిరెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : హైదరాబాద్ నుంచి విజయవాడ 6 లైన్ హైవే నిర్మాణం వ్యవహారంపై జోక్యం చేసుకోవాల్సినదిగా తాను చేసిన విజ్ఞప్తిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సానుకూలంగా స్పందించారని కాంగ్రెస్ భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. సోమవారం ప్రధానిని కలిసిన అనంతరం ఆయన తెలంగాణా భవన్ వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రధానితో చర్చించిన అంశాలను వెల్లడించారు. తాను అడిగిన అరగంటలో అపాయింట్‌మెంట్ ఇచ్చిన మోదీ తెలంగాణ రాష్ట్ర సమస్యలను అడిగి తెలుసుకున్నారని కోమటిరెడ్డి చెప్పారు. మూసీ నది నీరు శుద్ధి చేయకుండా దిగువ ప్రాంతాలకు వెళితే నల్గొండ జిల్లా ప్రజలు లక్షలాది మంది చనిపోతారని, నమామి గంగే తరహాలో మూసీ నది ప్రక్షాళన చేయాలని ప్రధానిని కోరానన్నారు. మూసీ గురించి తాను చెప్పిన అంశాలు విని ప్రధాని ఆశ్చర్యం వ్యక్తం చేశారని ఆయన వెల్లడించారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభం కావాల్సిన హైదరాబాద్ టు విజయవాడ హైవే నిర్మాణం చేపట్టకుండా జీఎంఆర్ సంస్థ ఆర్బిట్రేషన్‌కు వెళ్లి మొండిగా వ్యవహరిస్తోందని కోమటిరెడ్డి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లారు.

2025లో నిర్మాణం చేపడతామంటున్న జీఎంఆర్ వ్యవహారంపై ఇప్పటికే గడ్కరీ దృష్టికి తీసుకెళ్లానని కోమటిరెడ్డి తెలిపారు. జీఎంఆర్ నిర్మాణం చేపట్టకపోతే కొత్త సంస్థతో అయినా పనులు పూర్తి చేయిస్తామని గడ్కరీ హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. అవసరమైతే కోర్టుకు కూడా వెళ్లేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. అలాగే నల్గొండ, మల్లెపల్లి, భువనగిరి, చిట్యాల రోడ్డు గురించి ప్రధానితో చర్చించగా ఆయన సానుకూలంగా స్పందించారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. తెలంగాణాలో భారీ మైనింగ్ అక్రమాలకు తెర లేవబోతోందని, సింగరేణికి కేటాయించిన గనులతో 50 వేల కోట్ల కుంభకోణం జరగబోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి విషయంలో కోల్ ఇండియా మార్గదర్శకాలను పక్కనపెట్టి కేసీఆర్ కుటుంబ సభ్యులకు మైన్ టెండర్ అప్పగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఈ విషయంలో తప్పకుండా చర్యలు చేపడతామని ప్రధాని అన్నారని ఎంపీ తెలిపారు. దేశంలో అనేక కోల్ ఫీల్డ్స్‌లో జాయింట్ వెంచర్ ఉన్నపుడు తెలంగాణలో ఎందుకు ఉండదని ప్రశ్నించారు. రాష్ట్రంలో పరిస్థితులెలా ఉన్నాయో, ఏయో రంగాల్లో అవినీతి జరుగుతోందో ఆధారాలతో సహా ప్రధానికి వివరించానని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు. తెలంగాణాపై దృష్టి పెడతానని ప్రధాని హామీ ఇచ్చారన్న ఆయన… తాను చెప్పిన అంశాలపై కూడా మోడీ చర్యలు చేపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement