Friday, May 10, 2024

అమిత్‌ షాతో బండి సంజయ్ భేటీ, పాదయాత్రకు రావాలని ఆహ్వానం.. ముగింపు సభకు వస్తానన్న షా..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రకు హాజరుకావాల్సిందిగా తెలంగాణా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేసిన విజ్ఞప్తిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సానుకూలత వ్యక్తం చేశారు. ముగింపు సభకు వస్తానని హామీ ఇచ్చారు. బండి సంజయ్ మంగళవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. ఆయన వెంట ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, పార్లమెంటరీ కార్యాలయ కార్యదర్శి కామర్సు బాలసుబ్రమణ్యం, పార్టీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ ఉన్నారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితి, టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ చేపడుతున్న కార్యక్రమాలతో పాటు ప్రజా సంగ్రామ యాత్రపై ప్రత్యేకంగా చర్చించారు. ఏప్రిల్ 14 నుంచి రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేపడుతున్నందున రాష్ట్రానికి రావాలని అమిత్ షాను ఆహ్వానించారు.

ఏయే జిల్లాల్లో, ఎన్ని రోజులు పాదయాత్ర చేస్తున్నారనే ప్రజా సంగ్రామ యాత్ర షెడ్యూల్‌ను అమిత్ అడిగి తెలుసుకున్నారు. రెండో విడత పాదయాత్ర ముగింపు సభ ఎక్కడా ఏర్పాటు చేశారని అడిగారు. పాదయాత్ర ముగింపు సభ హైదరాబాద్ శివారులోని మహేశ్వరం నియోజకవర్గంలో ప్లాన్ చేస్తున్నామని సంజయ్ పేర్కొనడంతో తప్పకుండా ఆరోజు రాష్ట్రానికి వస్తానని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ పాలనలో ప్రజలు పడుతున్న బాధలను, వేసవి కాలంలో వివిధ వర్గాలు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు పాదయాత్ర చేపట్టడం మంచి పరిణామమని సంజయ్‌ను అమిత్ షా అభినందించారు.

తెలంగాణలో రాజకీయ పరిస్థితి, కేంద్రాన్ని బదనాం చేసేందుకు టీఆర్ఎస్ చేస్తున్న డ్రామాలపైనా సంజయ్ హోంమంత్రికి వివరించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని, ఈ తరుణంలో బీజేపీ రాష్ట్ర శాఖ చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు.ఈ తరుణంలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నందున టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలను ఉద్ధృతం చేయాలని సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement