Friday, May 3, 2024

Delhi | రైల్వే ప్రయాణికుల సంప్రదింపుల కమిటీ సభ్యుడిగా ఎంపీ జీవీఎల్.. సౌకర్యాలు మెరుగుపరుస్తామని హామీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : వాల్తేరు డివిజన్‌లో రైల్వే కనెక్టివిటీ, ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరుస్తామని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్ వినియోగదారుల సంప్రదింపుల కమిటీ సభ్యుడిగా కేంద్ర ప్రభుత్వం ఆయనను నియమించింది. మంగళవారం రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నుంచి జీవీఎల్ నరసింహారావు నియామక పత్రం అందుకున్నారు. భువనేశ్వర్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్‌లో వాల్తేరు డివిజన్‌ ఒకటి. ఈస్ట్ కోస్ట్ జోన్ నుంచి ఐదుగురు లోక్‌సభ, ముగ్గురు రాజ్యసభ ఎంపీలు రైల్వే జోనల్ కన్సల్టేటివ్ కమిటీలకు నామినేట్ అయ్యారు.

ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్‌లోని వాల్తేరు డివిజన్‌లో ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జీవీఎల్ నరసింహారావు నామినేట్ అయ్యారు. కమిటీ సభ్యుడిగా నియమితులైన అనంతరం జీవీఎల్ మీడియాతో మాట్లాడుతూ వాల్తేరు డివిజన్‌లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలతో పాటు కార్గో రవాణాకు ఉన్న అడ్డంకులు తొలగించడానికి తన వంతుగా ప్రయత్నిస్తానని తెలిపారు. వాల్తేరు డివిజన్‌లోని రైల్వే ఉద్యోగుల సంఘాలు, మెరుగైన రైలు సేవల కోసం కృషి చేస్తున్న వివిధ సంఘాల సభ్యులు, పరిశ్రమల ప్రతినిధులు జీవీఎల్ నియామకంపై సంతోషం వ్యక్తం చేశారు.

ఉత్తరాంధ్ర ప్రాంత రైల్వే వినియోగదారుల ప్రయోజనాలతో పాటు సికింద్రాబాద్-విజయవాడ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను విశాఖపట్నం వరకు పొడిగించడానికి జీవీఎల్ ఎంతో కృషి చేశారు. గంగా పుష్కరాలతో పాటు వేసవిలో విశాఖపట్నం, గుంటూరు నుంచి వారణాసికి ప్రత్యేక రైళ్లను మంజూరు చేయించడంలోనూ ఆయన ప్రయత్నం ఎంతో ఉంది. విశాఖపట్నం కేంద్రంగా కొత్త సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌ను త్వరగా ఏర్పాటు చేయాలని, విశాఖ రైల్వే స్టేషన్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించాల్సిన అవసరం ఉందని జీవీఎల్ నరసింహారావు పార్లమెంట్‌లో అనేకసార్లు గళమెత్తారు. విశాఖపట్నం నుంచి వారణాసి, లక్నో, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌లకు సాధారణ రైళ్లను ప్రారంభించాలని ఆయన పార్లమెంట్‌లో డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో ప్రారంభమై బెంగళూరు వెళ్లే విధంగా రెగ్యులర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసును ప్రారంభించాలనీ ఆయన రైల్వే మంత్రిని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement