Saturday, May 4, 2024

బీసీ స్టడీ సర్కిళ్లలో ఫ్రీ కోచింగ్‌కు దరఖాస్తుల వెల్లువ.. రేపు ఆన్‌లైన్‌లో అర్హత పరీక్ష

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ద్వారా వివిధ రకాల పోటీ పరీక్షలకు అందించే ఉచిత కోచింగ్‌కు నిరుద్యోగ యువత నుంచి అనువ్యూహా స్పందన లభిస్తోంది. ఇప్పటికే 80 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లుగా తెలిసింది. దరఖాస్తు గడువు శనివారం ఉదయం 10 గంటల వరకు ఉండటంతో.. వాటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే దరఖాస్తు గడువు ముగిసిన గంట వ్యవధిలోనే అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తుండటంతో ఫలితాలు కూడా అదే రోజు వెల్లడించనున్నారు. ఈ నెల 21 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.

ఉచిత శిక్షణ కోసం రూ.50 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. బీసీ స్టడీ సర్కిళ్లు ఉమ్మడి జిల్లా కేంద్రంలో ఒకటి చొప్పున 10 స్టడీ సర్కిళ్లు ఉన్నాయి. ప్రస్తుతం ఒక్కో స్టడీ సర్కిల్‌లో 300 మందికి కోచింగ్‌ ఇచ్చేందుకు సౌకర్యం ఉండగా.. అదనపు సౌకర్యం పెంచి 1000 మందికి పైగా కోచింగ్‌ ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. అదనంగా మరో ఐదు స్టడీ సర్కిళ్లను పెంచి దాదాపు 20 వేల మంది వరకు ఉచిత కోచింగ్‌ ఇవ్వాలనే ఆలోచనతో బీసీ సంక్షేమ శాఖ అధికారులు ఉన్నారు. వీటితో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అసెంబ్లిd నియోజక వర్గ కేంద్రంలో ఒక్కో స్టడీ సెంటర్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దం చేశారు. ఈ స్టడీ సెంటర్ల ద్వారా దాదాపు లక్ష మంది వరకు ఉచిత కోచింగ్‌ ఇప్పించనున్నారు. ఆఫ్‌లైన్‌ ద్వారా 50 వేలు, ఆన్‌లైన్‌ ద్వారా మిగతా 50 వేల మందికి ఉచిత కోచింగ్‌ తీసుకోనున్నారు. ఈ స్టడీ సెంటర్లు, సర్కిళ్ల ద్వారా గ్రూప్‌ 1, 2, 3, 4తో పాటు పోలీసు ఉద్యోగాలకు కూడా కోచింగ్‌ ఇవ్వనున్నారు. ఈ సర్కిళ్లు, సెంటర్లలో బీసీలకు 75శాతం, ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 5శాతం, ఈబీసీలకు 5 శాతం, మైనార్టీలకు 5శాతం చొప్పున రిజర్వేషన్లు అమలు చేస్తారు.

18 వరకు ఎస్సీ స్టడీ సెంటర్లకు దరఖాస్తు గడువు..

ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్‌ ఇచ్చేందుకు ఎస్సీ అభివృద్ధి శాఖ, గిరిజన సంక్షేమ శాఖలు కూడా సన్నద్ధం అవుతున్నాయి. ఎస్సీ అభ్యర్థులకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 33 సెంటర్ల ద్వారా శిక్షణ ఇచ్చేందుకు సంబంధిత శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అర్హత పరీక్ష కోసం ఈ నెల 18వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నెల 19న మెరిట్‌ జాబితాను రూపొందించి, 20 నుంచి అభ్యర్థులకు సమాచారం ఇవ్వనున్నారు. 22న సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ పూర్తి చేసి, 25 నుంచి శిక్షణ ప్రారంభించనున్నారు. ఎస్టీ అభ్యర్థుల కోసం ఊట్నూర్‌, ఏటూరునాగారం, భద్రాచలం ఐటీడీఏల పరిధిలోని మూడు శిక్షణ కేంద్రాలు, మన్ననూర్‌, హైదరాబాద్‌లో ఒకటి చొప్పున శిక్షణ కేంద్రాలున్నాయి. వీటి ద్వారా 10 వేల మందికి శిక్షణ ఇవ్వనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement