Saturday, April 27, 2024

Big Story : సీజన్‌ ఏదైనా చీర్స్ కొట్టాల్సిందే.. పెరుగుతున్నబీర్ల‌ విక్రయాలు

(ప్రభన్యూస్‌బ్యూరో, ఉమ్మడిరంగారెడ్డి) : ఎండాకాలంలో చల్లటి బీర్లను తాగేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తుంటారు. వానాకాలం… చలికాలం మాత్రం బీర్లను తాగేందుకు పెద్దగా ఆసక్తి చూపించరు. ఇది చాలా ప్రాంతాల్లో జరుగుతుంది. కానీ రంగారెడ్డి జిల్లాలో మాత్రం సీజన్‌ ఏదైనా బీర్ల విక్రయాలే ఎక్కువగా జరుగుతున్నాయి. మద్యం అమ్మకాలతో పోలిస్తే బీర్ల అమ్మకాలే ఎక్కువగా జరుగుతున్నాయి. వర్షాకాలంలో బీర్లు తాగడం ద్వారా జలుబు చేస్తుందనే మాట చాలామంది నోట వింటుంటాం. కానీ అమ్మకాల విషయంలో మాత్రం జిల్లాలో బీర్ల అమ్మకాలు మూడు బీర్లు ఆరు బాక్స్‌లుగా కొనసాగుతోంది. వర్షాకాలంలో వీటి అమ్మకాలు ఏమాత్రం తగ్గలేదు.

మద్యం అమ్మకాలతో పోలిస్తే బీర్ల అమ్మకాలు పెరిగాయి. ప్రతినెల జిల్లాలో బీర్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. కారణం యువత ఎక్కువగా బీర్లు తాగేందుకు ఆసక్తి చూపిస్తుండటమే. రంగారెడ్డి జిల్లా పరిధిలో రెండు ఎక్సైజ్‌ డివిజన్లు ఉన్నాయి. ఇందులో శంషాబాద్‌ ఎక్సైజ్‌ డివిజన్‌ పరిధిలో 100 మద్యం దుకాణాలుండగా సరూర్‌నగర్‌ ఎక్సైజ్‌ డివిజన్‌ పరిధిలో 134 మద్యం దుకాణాలున్నాయి. జిల్లా వ్యాప్తంగా 134 మద్యం దుకాణాలున్నాయి.

ప్రతినెల పెరుగుతున్న అమ్మకాలు..

జిల్లాలో మద్యంతో పోలిస్తే బీర్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. అన్నీ సీజన్ల పరిధిలో వీటి విక్రయాలే ఎక్కువ. గత వర్షాకాలంలోను బీర్ల అమ్మకాలు పెద్దఎత్తున జరిగాయి. జూలై మాసంలో 7.08లక్షల మద్యం కేసులు అమ్మకాలు జరిగాయి. బీర్ల అమ్మకాలు మాత్రం 7.39లక్షల కేసుల విక్రయాలు జరిగాయి. ఆగస్టు మాసంలో మద్యం అమ్మకాలు 6.73లక్షలు కేసులు విక్రయించగా 8.43లక్షల బీర్ల కేసులు అమ్మారు. సెప్టెంబర్‌ మాసంలో 6.22లక్షల కేసుల మద్యం విక్రయాలు చేశారు. 7.76లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి. అక్టోబర్‌ మాసంలో 6.85లక్షల కేసుల మద్యం విక్రయాలు జిల్లా వ్యాప్తంగా జరగ్గా 8.50లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి. వేసవికాలంలో మద్యంతో పోలిస్తే బీర్ల అమ్మకాలు ఎక్కువగా జరుగుతాయి. కానీ ఈసారి మాత్రం సీజన్‌ రివర్స్‌ అయ్యింది. వర్షాకాలంలో కూడా బీర్ల అమ్మకాలు మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగాయి.

బీర్ల వైపు యువత మొగ్గు..

- Advertisement -

గతంతో పోలిస్తే నేడు యువత మద్యం తాగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మద్యం తాగే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అందులో బీర్లు తాగేందుకు యువత ఆసక్తి చూపిస్తున్నారు. చాలామంది యువతులు నేరుగా మద్యం మాల్స్‌కు వచ్చి నేరుగా బీర్లు కొనుగోలు చేసి వెళ్తున్నారంటే పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు. కొత్తగా మద్యం తాగేవాళ్లు కూడా ముందుగా బీర్లతో అలవాటు చేసుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది. బీర్లలో ఎక్కువమంది సాప్ట్‌ బీర్లు తాగేందుకు మొగ్గు చూపుతున్నారని ఎక్సైజ్‌ పోలీసులు చెబుతున్నారు.

ఆదాయంలోనూ మనమే టాప్‌..

మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి దండిగా ఆదాయం సమకూరుతోంది. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా రంగారెడ్డి జిల్లా ద్వారా ఎక్కువ ఆదాయం సమకూరుతోంది. ఆదాయం సమకూర్చడంలో రంగారెడ్డి జిల్లా ముందు వరుసలో నిలబడుతోంది. ప్రతినెల దాదాపుగా రూ. 650కోట్లమేర ఆదాయం సమకూరుతుండటం గమనార్హం. రంగారెడ్డి జిల్లాలో 134 మద్యం దుకాణాలున్నాయి. ఇందులో సగం దుకాణాలు శివార్ల పరిధిలో ఉండగా మిగతా సగం మండలాల పరిధిలో ఉన్నాయి. జూలై మాసంలో మద్యం- బీర్ల అమ్మకాల ద్వారా రూ. 716.18కోట్లమేర ఆదాయం సమకూరింది.

ఆగస్టు మాసంలో రూ. 699.06కోట్లు, సెప్టెంబర్‌లో రూ. 647.09కోట్లు, అక్టోబర్‌ మాసంలో 705.85కోట్ల మేర ఆదాయం వచ్చింది. ఆ మాసంలో దసరా పండగ ఉండటంతో అనుకున్న దానికంటే ఎక్కువ ఆదాయమే సమకూరింది. రాష్ట్రంలో ఎక్కువ ఆదాయం రంగారెడ్డి జిల్లా నుండే సమకూరుతుండటంతో మరింతమేర ఆదాయం సేకరించే పనిలో ఎక్సైజ్‌ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. ప్రతినెల మద్యం దుకాణాలకు టార్గెట్లు ఇస్తూ అమ్మకాలు పెంచుతున్నారు. అనుకున్న మేర మద్యం అమ్మకాలు ఉండటంతో వ్యాపారులు కూడా ప్రతినెల అనుకున్నమేర మద్యం లిప్ట్‌ చేస్తున్నారు. మొత్తం మీద రంగారెడ్డి జిల్లా ద్వారా మద్యం విక్రయాల ద్వారా దండిగా ఆదాయం సమకూరుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement