Tuesday, May 14, 2024

10న తెలంగాణకు అమిత్ షా.. ఆదిలాబాద్‌, హైదరాబాద్‌లో పర్యటన

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నగారా మరికొద్ది రోజుల్లో మోగనున్న నేపథ్యంలో తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా బీజేపీ దూకుడు పెంచుతోంది. వరుస పర్యటనలతో పార్టీ అగ్రనేతల తెలంగాణ బీజేపీ క్యాడర్‌లో జోష్‌ నింపుతున్నారు. ఈ నెల 10న తెలంగాణకు రానున్న అమిత్‌ షా ఒకే రోజు రెండు సభల్లో పాల్గొనబోతున్నారు. ప్రధాని మోడీతోపాటు పార్టీ అగ్రనేతలు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌సింగ్‌, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వరుస బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రచార పర్వాన్ని హోరెత్తించేలా వ్యూహాలు రచిస్తోంది.

- Advertisement -

ఉమ్మడి పది జిల్లాల్లో ప్రధాని మోదీ, అమిత్‌ షా, జేపీ నడ్డా పార్టీ నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఎన్నికల ప్రచారం ముగిసేవరకు తెలంగాణలో బీజేపీ అగ్రనేతలు వరుస బహిరంగసభలు కొనసాగనున్నాయని బీజేపీ ముఖ్యనేతలు చెబుతున్నారు. ఇందులో భాగంగా ఈనెల 10వ తేదీ నుంచి 27వ తేదీ లోపు రెండు సభల్లో ప్రధాని మోదీ, జేపీ నడ్డా, అగ్ర నేతలు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌సింగ్‌ పాల్గొననున్నారు. గులాబీ తోటలో కమల వికాసమే లక్ష్యంగా అధికార బీఆర్‌ఎస్‌కు ధీటుగా ఈ సభలు, సమావేశాలను బీజేపీ నిర్వహించబోతోంది.

ఇప్పటికే మూడు రోజుల వ్యవధిలో అక్టోబరు 1న మహబూబ్‌నగర్‌కు, 3న నిజామాబాద్‌కు వచ్చిన ప్రధాని మోదీ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా రెండు రోజులుగా హైదరాబాద్‌లో మకాం వేసి బీజేపీ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఎన్నికల సమాయత్తంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశంలోనే ఎన్నికల రూట్‌ మ్యాప్‌ ఖరారుపై నేతలకు పార్టీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ఎల్‌.సంతోష్‌, సునీల్‌ బన్సల్‌ దిశానిర్దేశం చేశారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ నెల 10న తెలంగాణకు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలంగాణకు రానున్నారు. ఒకేరోజు ఆయన రెండు సభల్లో పాల్గొంటారు. మొదటగా అమిత్‌ షా ఆదిలాబాద్‌లో పర్యటించి అక్కడ బీజేపీ నిర్వహించే బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఆదిలాబాద్‌ సభ అనంతరం అదేరోజు సాయంత్రం రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభకు బీజేపీ ప్లాన్‌ చేసింది. ఈ సభకు అమిత్‌ షా హాజరుకానున్నారు. అమిత్‌షా పాల్గొనే బహిరంగ సభకు బండ్లగూడ పరిధిలో ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement