Thursday, May 16, 2024

అగ్నిపథ్’ ఉపసంహరించాలి, పార్లమెంటులో చర్చ జరపాలి.. రాష్ట్రపతికి మూడు అంశాలపై వినతి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ‘అగ్నిపథ్’ పథకాన్ని ఉపసంహరించాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ నేతలు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ‘అగ్నిపథ్’తో పాటు కక్షసాధింపు రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోకి దూసుకొచ్చిన ఢిల్లీ పోలీసుల ఉదంతం అంశాలపై కూడా వినతిపత్రాలు అందజేశారు. కేంద్ర ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ వారం రోజులుగా ఆందోళనలు చేస్తున్న కాంగ్రెస్, గత రెండు రోజులుగా ‘అగ్నిపథ్’ అంశాన్ని తమ ఎజెండాలో చేర్చుకుంది. సోమవారం ఉదయం న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ నేతలు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు జారీ చేసి విచారణకు పిలవడాన్ని నిరసిస్తూ ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. అలాగే ‘అగ్నిపథ్’ పథకానికి వ్యతిరేకంగానూ గళమెత్తారు. ఈ క్రమంలో పరిమిత సంఖ్యలో నేతలు, కార్యకర్తలు ధర్నాలో పాల్గొంటారని పోలీసుల వద్ద అనుమతి తీసుకోగా, అంతకంటే ఎక్కువ మంది జంతర్ మంతర్ చేరుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అందరినీ ధర్నా ప్రదేశానికి పోలీసులు అనుమతించకపోవడంతో పోలీసులకు, కార్యాకర్తలకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఇక్కడ జరిగిన నిరసన ప్రదర్శనకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సహా సీనియర్ నేతలు, పార్టీ ఎంపీలు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు జేడీ శీలం, వంశీచంద్ రెడ్డి తదితరులు ధర్నాలో పాల్గొన్నారు. శ్రీలంకలో పవర్ ప్రాజెక్టు వ్యవహారంలో ప్రధానిపై వచ్చిన ఆరోపణల నుంచి దృష్టి మళ్లించేందుకే లేని కేసు తిరగదోడి రాహుల్ గాంధీని ఈడీ విచారణ పేరుతో వేధిస్తున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. మరోవైపు ‘అగ్నిపథ్’ పథకం ద్వారా దేశ యువతను బీజేపీ వంచిస్తోందని, నాలుగేళ్ల తర్వాత వారంతా సెక్యూరిటీ గార్డులుగా, వంటవాళ్లుగా పనిచేస్తారంటూ సైన్యాన్ని అవమానిస్తోందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.

పార్లమెంటు టూ రాష్ట్రపతి భవన్!

- Advertisement -

జంతర్ మంతర్ ధర్నా అనంతరం సాయంత్రం గం. 4.00 సమయంలో పార్లమెంటు భవనంలోని కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ కార్యాలయంలో ఎంపీలందరూ సమావేశమయ్యారు. మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో రాష్ట్రపతిని కలిసి నివేదించబోయే అంశాలపై చర్చించారు. అనంతరం అక్కణ్ణుంచి రాష్ట్రపతి భవన్ వరకు విజయ్ చౌక్ మీదుగా కాలినడక వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ పార్లమెంటు ప్రాంగణం దాటి విజయ్ చౌక్ చేరుకోగానే, పోలీసులు వారిని అడ్డుకున్నారు. రాష్ట్రపతిని కలిసే నేతల బృందం మాత్రమే కార్లలో వెళ్లాలని, మిగతావారంతా అక్కడే ఆగిపోవాలని సూచించారు. పోలీసుల తీరును నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు విజయ్ చౌక్ వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. రాష్ట్రపతి భవన చేరుకున్న నేతల బృందం ఆయనకు మూడు అంశాలపై వినతి పత్రాలను అందజేసింది. రాహుల్ గాంధీపై ఈడీ విచారణను దర్యాప్తు సంస్థల దుర్వినియోగంగా పేర్కొంటూ తక్షణమే ఈ వేధింపులు ఆపేలా చర్యలు చేపట్టాలని కోరుతూ ఒక వినతి పత్రాన్ని నేతలు అందజేశారు. అలాగే కాంగ్రెస్ ఎంపీలపై దిల్లీ పోలీసుల దురుసు ప్రవర్తన, దాడులపై రాష్ట్రపతికి విడిగా ఫిర్యాదు చేశారు. ‘అగ్నిపథ్’ వల్ల యువతకు, దేశ భద్రతకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ.. త్రివిధ దళాలకు అధిపతైన రాష్ట్రపతి ఈ పథకాన్ని తక్షణమే వెనక్కి తీసుకునేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, లోక్సభలో కాంగ్రెస్ పక్షనేత అధీర్ రంజన్ చౌదరి, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్, ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘేల్, సీనియర్ నేతలు చిదంబరం, జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్ తదితరులు రాష్ట్రపతిని కలిసిన బృందంలో ఉన్నారు.

బీజేపీలో ఉంటే నీతివంతులు, వ్యతిరేకిస్తే అవినీతిపరులు!

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తన రాజకీయ ప్రత్యర్థులపై సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖ, ఎన్సీబీ, ఎన్ఐఏ వంటి దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తూ కక్షసాధింపు చర్యలకు, బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతోందని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ విమర్శించారు. ఎన్ని అవినీతి ఆరోపణలున్నా సరే, ఆ నేత బీజేపీలో ఉంటే ఒక్కసారిగా నీతిమంతులవుతున్నారని ఎద్దేవా చేశారు. యెడ్యూరప్ప, నారాయణ రాణే వంటి నేతలపై ఈడీ కేసులు నమోదు చేయలేదని, చివరకు ముకుల్ రాయ్ వంటి నేత బీజేపీలో చేరగానే పాతకేసులన్నీ మరుగునపడ్డాయని ఆరోపించారు. రాహుల్ గాంధీని తొలి మూడు రోజుల్లో 30 గంటల పాటు ప్రశ్నించారని, తద్వారా కాంగ్రెస్పై ఒత్తిడి పెంచి, తమ గొంతుల్ని అణచివేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. మొత్తం 5,422 కేసుల్లో 5,310 కేసులు ఈడీ వద్ద పెండింగ్లో ఉన్నాయని, ఇవన్నీ గత ఎనిమిదేళ్లలో నమోదు చేసినవేనని గణాంకాలు వెల్లడించారు. దీన్నిబట్టి ప్రభుత్వం విపక్షాలపై ఎలా ఒత్తిడి పెంచుతుందో అర్థం చేసుకోవచ్చు అంటూ మాకెన్ వ్యాఖ్యానించారు.

ఆందోళనల ప్రభావం అడుగడుగునా ట్రాఫిక్ జాం..

త్రివిధ దళాల నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘అగ్నిపథ్’ పథకాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం కొన్ని సంఘాలు దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో దేశరాజధాని ఢిల్లీ సహా పరిసర పట్టణ ప్రాంతాలు నోయిడా, గురుగాంలలో ఆయా రాష్ట్రాల పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధాన రహదారులపై సరిహద్దుల వద్ద బ్యారికేడ్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. దీంతో ఢిల్లీలో ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. వేలకొద్ది వాహనాలు కొన్ని గంటలపాటు ట్రాఫిక్ జాం లో ఇరుక్కున్నాయి. ఢిల్లీ నోయిడా ఫ్లైవే, మీరట్ ఎక్స్ప్రెస్వే, ఆనంద్ విహార్, ప్రగతిమైదాన్తో పాటు పలు ప్రాంతాల్లో వాహనాలు భారీగా నిలిచిపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement