Friday, May 3, 2024

Follow up : ప్రేమను నిరాకరించిన యువతిపై అత్యాచారం, హత్య.. వనపర్తి జిల్లాలో అమానుష ఘటన

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ప్రేమిస్తున్నాని వెంటపడిన ఆకతాయి నమ్మించి అమాయకురాలిపై అత్యాచారం జరిపి అంతమొందించిన ఘటన సంచలనం సృష్టించింది. ప్రేమను నిరాకరించడంతో చివరిసారి కలుద్దామని నమ్మించి అఘాయిత్యానికి ఒడిగట్టి ఆ తర్వాత హత్య చేసిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రేమను నిరాకరించిందని యువతిని ఉన్మాది నిర్ధాక్షిణ్యంగా హతమార్చిన ఘటన వనపర్తి జిల్లా ఖిల్లా గణపురం మండలం మానాజీపేటలో వెలుగు చూసింది. గుట్టుచప్పుడు కాకుండా ప్రియురాలిని హతమార్చిన వ్యక్తి మరొకరి సాయంతో ఆ మృతదేహాన్ని పూడ్చిపెట్టిన ఘటన సంచలనంగా మారింది. మానాజీపేటకు చెందిన బత్తిని శ్రీశైలం హైదరాబాద్‌లో డిగ్రీ చదువుకునే సమయంలో కాటేదాన్‌ ఎన్‌జీవోస్‌ కాలనీకి చెందిన సాయి ప్రియ (19)తో పరిచయం ఏర్పడింది.

2017లో చదువుకుంటున్న సమయం నుంచి ఆమెను ప్రేమిస్తున్నానని వెంటపడుతూ శ్రీశై లం వేధింపులకు గురి చేస్తున్నాడు. అయితే అతని ప్రేమను నిరాకరిస్తూ రావడంతో నిందితుడు సాయిప్రియను హతమార్చేందుకు పలు రకాలుగా ప్రయత్నాలు చేశాడు. శ్రీశైలం వేధింపులపై సాయిప్రియ తన కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు అతడిని హెచ్చరించి వదిలేశారు. ఇదిలా ఉండగా ఈ నెల 5న సాయిప్రియకు ఫోన్‌ చేసిన శ్రీశైలం ఒకసారి తనతో మాట్లాడేందుకు మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూరుకు రావాలని పిలిచాడు. అతని మాటలు నమ్మిన సాయిప్రియ అక్కడికి వెళ్లగా మాయమాటలు చెప్పిన శ్రీశైలం బైక్‌పై ఎక్కించుకుని మానాజీపేట శివారులోని మబ్బుగుట్టల్లోకి తీసుకెళ్లి నిర్మానుష ప్రదేశంలో తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా హెచ్చరించాడు.

సాయిప్రియ అంగీకరించకపోవడంతో ఆగ్రహోదగ్రుడైన శ్రీశైలం ఆమె మెడకు చున్నీని బిగించి హతమార్చాడు. అనంతరం సమీప బంధువు శివకు సమాచారం అందించి అతని సహకారంతో ఇద్దరు కలిసి కేఎల్‌ఐ కాలువ పక్కన నిర్మానుష ప్రదేశంలో సాయి ప్రియ మృతదేహాన్ని పూడ్చి పెట్టారు. కాగా విషయం తెలియని మృతురాలి కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని కాటేదాన్‌ పోలీస్‌ స్టేషన్‌లో సాయి ప్రియ కనిపించడం లేదని, శ్రీశైలంపై తమకు అనుమానం ఉందంటూ ఫిర్యాదు చేశారు. సాయిప్రియ తల్లిదండ్రులు వెంకటేష్‌, లక్ష్మీ ఫిర్యాదు మేరకు ఈ నెల 6న నిందితుడు శ్రీశైలంను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ జరపడంతో రెండు రోజుల అనంతరం నేరం అంగీకరించాడు.

దీంతో వనపర్తి జిల్లా పోలీసులు గురువారం మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఘటనలో అనేక సంచలన విషయాలు బయటపడ్డాయి. హత్యకు ముందు సాయిప్రియను శ్రీశైలం అత్యాచారం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ నెల 5న ఆమె కళాశాలకు వెళుతున్నానని చెప్పి మైలార్‌దేవులపల్లి నుంచి బయల్దేరి వనపర్తి జిల్లాలోని శ్రీశైలం పిలిచిన ప్రాంతానికి వెళ్లినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు నిందితులిద్దరిపై పోలీసులు పలు సెక్షన్ల కింద అత్యాచారం, హత్య కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement