Thursday, May 16, 2024

Delhi | పార్లమెంటులో మహిళా బిల్లు పెట్టాలి : ఆర్.కృష్ణయ్య డిమాండ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మహిళా బిల్లు ప్రవేశపెట్టి వెనుకబడిన వర్గాల మహిళలకు సబ్ కోటా కల్పించాలని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. జాతీయ బీసీ మహిళా సంఘం అధ్యక్షురాలు డా. ఏ. పద్మలత అధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ, కర్ణాటక నుంచి తరలివచ్చిన వారితో పార్లమెంట్ వద్ద సోమవారం భారీ ధర్నా నిర్వహించారు. ఈ నిరసన ప్రదర్శనకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి, ఢిల్లీ ఇంఛార్జి కర్రి వేణుమాధవ్ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల మహిళలకు ప్రాతినిథ్యం కల్పించకపోతే మహిళా బిల్లుకు సార్థకత లేదన్నారు. జనాభాలో సగం ఉన్నబీసీ మహిళలకు కోటా ఇవ్వకుండా ఆడవారి రక్షణ, భద్రత గురించి మాట్లాడటం అన్యాయమని అభిప్రాయపడ్డారు. మహిళా బిల్లులో రాజకీయ రిజర్వేషన్లతో పాటు విద్యా, ఉద్యోగాలలో కూడా 50 శాతం రిజర్వేషన్ల ను ప్రవేశపెట్టాలని కోరారు. రాజకీయ రిజర్వేషన్లు అమలు చేస్తే 180 మంది మహిళలు పార్లమెంట్ సభ్యులవుతారని చెప్పుకొచ్చారు.

- Advertisement -

ఉద్యోగాలలో రిజర్వేషన్లు పెంచితే కేంద్రప్రభుత్వంలోని 54 లక్షల్లో 27 లక్షల ఉద్యోగాలు, 29 రాష్ట్రాలలో కలిపి ఒక కోటి 80 లక్షల ఉద్యోగాలలో 90 లక్షల ఉద్యోగాలు మహిళలకు దక్కుతాయని అన్నారు. మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాల తెచ్చినా వారిపై హింస మాత్రం తగ్గట్లేదని కృష్ణయ్య వాపోయారు. మహిళలను చైతన్య పరిచి అధికారంలో వాటా ఇవ్వాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

మద్యపాన నిషేధాన్ని జాతీయ స్థాయిలో అమలు చేయాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎప్పుడు లేనంతగా మద్యం విచ్చలవిడిగా అమ్ముతున్నారని, జనం బహిరంగంగా రోడ్ల మీదే తాగుతూ తూగుతున్నారని కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పరిస్థితిని అదుపులోకి తీసుకురాకపోతే శాంతి-భద్రతల సమస్య తలెత్తుతుందని చెప్పారు. సంపూర్ణ మద్యపాన నిషేధానికి మహిళలు ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement