Friday, April 26, 2024

అయ్యన్నపాత్రుడికి సుప్రీంలో ఎదురుదెబ్బ.. ఫోర్జరీ కేసు దర్యాప్తు జరపాలని ఆదేశం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయనపై నమోదైన ఫోర్జరీ కేసు దర్యాప్తు జరపడానికి సుప్రీంకోర్టు అనుమతించింది. ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించి తప్పుడు పత్రాలు సృష్టించిన కేసులో అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారు రాజేశ్‌పై ఫోర్జరీ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాచపల్లి రిజర్వాయర్ పంట కాలువపై రెండు సెంట్ల మేర స్థలంలో అక్రమంగా ప్రహరి నిర్మించినట్టు అభియోగాలున్నాయి. ప్రభుత్వ భూములను కాపాడే ఉద్దేశంతో రాష్ట్ర రెవెన్యూ యంత్రాంగం చేపట్టిన సర్వేలో పంటకాలువను ఆక్రమించి ప్రహారీ గోడ నిర్మించిన వ్యవహారం వెలుగుచూసింది. ఈ మేరకు రెవెన్యూ యంత్రాంగం చర్యలకు ఉపక్రమించగా అయ్యన్నపాత్రుడు, ఆయన కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. ప్రహారీ గోడ అక్రమ నిర్మాణం కాదంటూ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) ఇచ్చారు.

అయితే ఈ సర్టిఫికెట్‌పై ఉన్న సంతకం తనది కాదని, ఫోర్జరీ సంతకాలతో సృష్టించారని జలవనరుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మల్లికార్జున రావు సిఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు అయ్యన్నపాత్రుడిని అరెస్టు చేసింది. అయితే నమోదైన కేసులో ఐపీసీ సెక్షన్ 467 వర్తించదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పేర్కొంది. సోమవారం జరిగిన విచారణలో కేసు దర్యాప్తు జరుగుతుండగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఫోర్జరీ సెక్షన్లు ఐపీసీ 467 ప్రకారం విచారణ కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. కేసును మెరిట్ ఆధారంగా విచారణ జరపాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. సీఆర్పీసీ 41 ప్రకారం నోటీసులిచ్చి విచారణ జరపవచ్చని కూడా ఆదేశాల్లో పేర్కొంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement