Sunday, May 19, 2024

ఏపీకి 8.04 లక్షలు, తెలంగాణకు 17.86 లక్షల మెట్రిక్ టన్నుల ఫుడ్​ గ్రెయిన్స్​.. కేశినేని ప్ర‌శ్న‌కు కేంద్రం జ‌వాబు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : జూన్ 2022 నాటికి దేశవ్యాప్తంగా 791 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద సరఫరా చేశామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. లోక్‌సభలో టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆహర, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ బుధవారం సమాధానమిచ్చారు. ఫేజ్-6లో ఆంధ్రప్రదేశ్‌కు 8.04 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు కేటాయించామని చెప్పారు. ఫేజ్-6 కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా పంపిణీ చేయాల్సి ఉందని తమ దృష్టికి వచ్చినట్టు ఆయన తెలిపారు.

జులై 14న అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో ఫేజ్-6 పంపిణీ గురించి నిర్వహించిన సమావేశంలో కొన్ని కారణాల వల్ల తగినన్ని ఆహార ధాన్యాల నిల్వలు లేవని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పడం వల్ల జాప్యం జరిగిందని, పంపిణీకి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్రమంత్రి వెల్లడించారు. పీఎంజీకేఏవై కింద ఆహార ధాన్యాల పంపిణీని కేంద్ర ఆహార పంపిణీ విభాగం రోజువారీ పద్ధతిలో పర్యవేక్షిస్తోందని జవాబులో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఫేజ్-6 కింద జరపాల్సిన ఆహార ధాన్యాల పంపిణీని త్వరగా చేపట్టాల్సిందిగా కోరుతూ ఏపీ ప్రభుత్వానికి లేఖలు రాశామని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పీఎంజీకేఏవై కింద ఇప్పటివరకు మొత్తం 23.75 లక్షల మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాలను కేటాయించినట్టు చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి పీఎంజీకేఏవై కింద ఇప్పటివరకు మొత్తం 17.86 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను కేటాయించామన్నారు. అత్యధికంగా ఆహార ధాన్యాలు అందుకున్న రాష్ట్రాల్లో యూపీ (147 లక్షల మెట్రిక్ టన్నులు), బిహార్ (84.14 లక్షల మెట్రిక్ టన్నులు), మహారాష్ట్ర (65.68 లక్షల మెట్రిక్ టన్నులు), పశ్చిమ బెంగాల్ (63.49 లక్షల మెట్రిక్ టన్నులు) ఉన్నాయని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement