Monday, May 6, 2024

Big story | అకాల వర్షం, అపార నష్టం.. ప్రాథమికంగా 7 వేల హెక్టార్లలో నష్టం అంచనా

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా గత మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు అన్నదాత ఆర్థికంగా కోలుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంట కళ్లముందే నీటిపాలవడం చూసి రైతులు తమ గుండె చెరువు చేసుకుంటున్నారు. ఇప్పటివరకూ కురిసిన వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 7 వేల హెక్టార్లలో వ్యవసాయం మరియు ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. అయితే, పంట నష్టం అంచనాలు ఇంకా రూపొందించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమై ఉంది. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పంట నష్టం అంచనాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

బుధవారం సాయంత్రానికి ఈ అంచనాలు పూర్తయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. పూర్తి అంచనాలు వచ్చేప్పటికి నష్టం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, వర్షాలు అదేపనిగా కురుస్తుండటంతో ఈ ఎన్యూమరేషన్‌ కార్యక్రమం మరికొంత ఆలస్యం అయ్యే అవకాశముందని అధికరులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా కనీసం రెండు రోజులపాటు తెరపిచ్చినా ఉన్న పంటను దక్కించుకోవచ్చన్న ఆశతో రైతులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు కాయగూరల తోటలు, ఆకు కూరల తోటలు కూడా దెబ్బతినడంతో మార్కెట్‌లో కూరగాయల కొరత కూడా ఏర్పడుతోంది.

- Advertisement -

భారీగా పంట నష్టం..

ప్రాథమిక అంచనా ప్రకారం రాయలసీమ, తూర్పుగోదావరి, కోనసీమ, కృష్ణా జిల్లాల్లో దాదాపు 5 వేల హెక్టార్లలో వరి, మొక్కజొన్న వంటి వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయి. ఇక పలు జిల్లాల్లో అరటి, మామిడి తదితర ఉద్యాన పంటలు సుమారు 2 వేల హెక్టార్లలో దెబ్బతిన్నాయి. మరోవైపు, ఉద్యానవన పంటలు ప్రధానంగా అరటి, మామిడి, బొప్పాయి, యాసిడ్‌ నిమ్మ, స్వీట్‌ ఆరెంజ్‌ మొదలైనవి దెబ్బతిన్నాయి. మరియు 1,396 మంది రైతులను ప్రభావితం చేసిన 11 జిల్లాల్లో సుమారు 1,217 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇందుకోసం రూ. 288 లక్షల ఇన్‌పుట్‌ సబ్సిడీ అవసరమని ప్రతిపాదించారు. మరోవైపు ప్రకృతి వైపరీత్యాల ప్రభావంతో 2019-20 నుంచి 2022-23 వరకు రాష్ట్రంలో 30.86 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు పేర్కొంటున్నారు. దాదాపు22.22 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు రూ.1,911.81 కోట్ల మేర ఇన్‌పుట్‌ సబ్సిడీని విడుదల చేసినట్లు- రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

వర్షాలు ఆగితే ఉన్న పంట కాపాడుకునే అవకాశం..

వర్షాలు కురవడం ఆగితే పంటలను కాపాడుకోవచ్చని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే, రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. మరో మూడు, నాలుగు రోజుల్లో వర్షాలు ఆగి పగటి ఉష్ణోగ్రతలు పెరిగితే రైతులు తడిసిన పంటలను కాపాడుకోవచ్చని ఎదురుచూస్తున్నారు. వ్యవసాయ శాఖ పంట నష్టం గణన ప్రారంభించిందని, ఒకటి రెండు రోజుల్లోప్రాథమిక అంచనాలు పూర్తవుతాయన వ్యవసాయ అధికారి ఒకరు తెలిపారు. వర్షపాతం ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చని, మేలో వేసవిలో రోజు ఉష్ణోగ్రత పెరగడం ప్రారంభించిన తర్వాత రైతులు తమ పంటలను కాపాడుకోవచ్చని ఆయన తెలిపారు.

కొనుగోళ్ల నిబంధనల్లో సడలింపునివ్వాలి..

రాష్ట్ర ప్రభుత్వ కొనుగోళ్ల కోసం పొలాల్లో పండించిన వరిని నిల్వ చేసుకున్నామని, అయితే అకస్మాత్తుగా కురిసిన వర్షానికి ధాన్యం తడిసిపోయిందని రైతులు చెబుతున్నారు. కొందరు రైతులు వర్షంలో తడిసిపోకుండా టార్పలిన్‌ పట్టాలతో కప్పుకున్నా..అవి కూడా తడిసిపోయాయని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా కొనుగోళ్ల నిబంధనలను సడలించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఆర్‌బీకేల ద్వారా కొన్ని ప్రాంతాల్లో ధాన్యం కొనుగోళ్లలో కొంత జాప్యం జరగడంతో నిల్వ ఉన్న వరి ధాన్యం తడిసి ముద్దయ్యిందని కొన్నిచోట్ల రైతులు ఆరోపిస్తున్నారు. ఈపరిస్థితుల్లో కొనుగోళ్లలో తమకు కొంత సడలింపు ఇవ్వడం ద్వారా అనుమతించదగిన తేమ శాతానికి మించి కొంత తేమ ఉన్నప్పటికీ ధాన్యాన్ని కొనుగోలు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తమకు అండగా నిలవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

రాయలసీమలో ఉద్యాన పంటలకు నష్టం..

గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాయలసీమలోని పలు ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అనంతపురం, కడప ప్రాంతాల్లో మామిడి, బొప్పాయి, అరటి తోటలు తీవ్ర నష్టాన్ని చవిచూడగా, కర్నూలు, నంద్యాల, సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో వరి పంట దశలోనే దెబ్బతింది. అన్నమయ్య, అనంతపురం జిల్లాల్లో నీటి ఎద్దడితో రైతులు టమోటాలను పొలాల్లోనే వదిలేశారు. ఇప్పటికే ఇతర ప్రాంతాల్లో అధికంగా ఈపంట మార్కెట్‌లోకి రావడంతో మదనపల్లె టమాటా మార్కెట్‌లో ధరలు తగ్గుముఖం పట్టాయని, కోత కూలీ కూడా తిరిగి రావడం లేదని రైతులు వాపోయారు. ఈదురు గాలుల కారణంగా మామిడి పంటలు భారీగా దెబ్బతిన్నాయి. వందల ఎకరాల్లో మామిడి నేలరాలింది. కడప జిల్లాలో 10 వేల ఎకరాలకు పైగా మామిడి తోటలు ఉన్నాయి మరియు కడప, అన్నమయ్య మరియు కర్నూలు ప్రాంతాలలో మామిడి పంట పూర్తిగా దెబ్బతింది. ఇక నూజివీడు, ఏలూరు ప్రాంతాల్లోనూ మామిడి రైతులు నేల రాలిన మామిడి చూసి కంటతడిపెడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement