Wednesday, May 15, 2024

నేడు దేశవ్యాప్తంగా నీట్‌ పరీక్ష.. హాజరు కానున్న 20 లక్షల మంది విద్యార్థులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా వైద్య, విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ యూజీ పరీక్ష ఆదివారం జరుగనుంది. దేశవ్యాప్తంగా 499 నగరాలు, పట్టణాలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 వరకు పరీక్ష జరుగుతుంది. తెలుగుతో పాటు 13 భాషల్లో నిర్వహించే ఈ పరీక్షకు దాదాపు 18 లక్షల మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. నీట్‌ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు నిబంధనలు విధించారు. పరీక్ష సమయం కంటే గంట ముందుగా పరీక్షా కేంద్రానికి హాజరు కావాలనీ, పరీక్ష కేంద్రాన్ని చెక్‌ చేసుకోవాలనీ, సూచించారు. పెన్ను, పేపర్‌ ఆధారంగా నిర్వహించే ఈ పరీక్షలో మధ్యాహ్నం 1.30 గంటల తరువాత పరీక్ష హాల్‌లోకి ఎవరినీ అనుమతించరు.

1.45 గంటలకు ప్రశ్నపత్రం బుక్‌లెట్‌ ఇస్తారు. మద్యాహ్నం 1.50 నుంచి 2 గంటల వరకు అభ్యర్థులు తమకు అవసరమైన వివరాలను బుక్‌లెట్‌లో నింపాల్సి ఉంటుంది. 2 గంటలకు పేపర్‌ ఇస్తారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అడ్మిట్‌ కార్డుతో పాటు ఏదైనా ఆధార్‌, పాన్‌, ఓటరు కార్డులలో ఏదో ఒక గుర్తింపు కార్డు తీసుకుని రావాలి. పాస్‌పోర్టు సైజ్‌ ఫోటోను తీసుకు వెళ్లాలి. అభ్యర్థులు డ్రస్‌ కోడ్‌ను తప్పనిసరిగా పాటించాలి. పొడవు చేతులున్న డ్రెస్సులు, షూలు, నగలు, మెటల్‌ వస్తువులను లోనికి అనుమతించరు. చేతికి వాచ్‌లు, వాలెట్లు, హాండ్‌బ్యాగ్‌లు, బెల్ట్‌లు, టోపీలు వంటివి ధరించరాదు. మొబైల్‌ ఫోన్లు, బ్లూటూత్‌, ఇయర్‌ ఫోన్లు, పేజర్స్‌, హెల్త్‌ బ్యాండ్లు, స్మార్ట్‌ వాచ్‌లు వంటి కమ్యూనికేషన్‌ డివై స్‌లను, ఎలాంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులను లోనికి అనుమతించరు. అభ్యర్థులు పరీక్ష రాసేందుకు అవసరమైన బాల్‌ పాయింట్‌ పెన్నును పరీక్ష గదిలోనే ఇస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement