Sunday, May 5, 2024

హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లోకి రాజన్న బిడ్డ…ఎవరి’కి‘ బాణం

తెలంగాణ పాలిటిక్స్‌లోకి వైఎస్‌ షర్మిళ ఎంట్రీ ఇస్తున్నారు. కొత్త రాజకీయ పార్టీ ప్రకటించబోతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి తనయగా, వైసీపీ అధినేత జగన్‌ జైలులో ఉన్న సమయంలో మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నిర్వహించి తెలంగాణ ప్రజలకు షర్మిళ చిరపరిచితులుగా ఉన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి వివాహ దినోత్సవం ఫిబ్రవరి 9 కాగా, అదే రోజు షర్మిళ తెలంగాణ ప్రాంతంలోని వైఎస్సార్‌ అభిమానులు అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయడం, హైదరాబాద్‌ లోటస్‌ పాండ్‌ కేంద్రంగా కీలక భేటీకి పూనుకోవడం చర్చనీయాంశంగా మారింది.

ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి కుమార్తె, తెలంగాణాలో మరో ప్రస్థానం పాదయాత్ర నిర్వహించిన వైఎస్‌ షర్మిళ తెలంగాణ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు. ఇందులో భాగంగానే రాజకీయ పార్టీ ఏర్పాటుకే లోటస్‌ పాండ్‌లో నేడు సమావేశం నిర్వహిస్తున్నారని ప్రచారం జరుగు తోంది. వివిధ జిల్లాలకు చెందిన వైఎస్‌ఆర్‌ సన్నిహితులకు, అభిమానులకు షర్మిళ గత కొద్దిరోజులుగా ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. మంగళవారం నిర్వహించే తొలి భేటీ.. వైఎస్‌ఆర్‌ తెలంగాణ ప్రాంత అభిమానుల భేటీగానే ఉంటుందా? రేపే పార్టీ ఏర్పాటు ప్రకటన చేస్తారా? కేవలం అభిప్రాయ సేకరణతోనే సరిపెడతారా? అన్న అంశాలపై మంగళవారం స్పష్టత రానుంది. మంగళవారం ఉదయం 10గంటలకు ఈ సమావేశం జరగనుండగా, అనంతరం వైఎస్‌ షర్మిళ మీడియా సమావేశం కూడా నిర్వహించే అవకాశం ఉంది.
గత కొద్దిరోజులుగా కీలక భేటీలు
వైఎస్‌ షర్మిళ గత కొద్దిరోజులుగా.. తెలంగాణ ప్రాంతానికి చెందిన వైసీపీ అభిమానులతో కీలకభేటీలు నిర్వహిస్తున్నారు. ఆదివారం శంషాబాద్‌ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ఒక హోటల్‌లో షర్మిళ తెలంగాణ ప్రాంతానికి చెందిన పలువురు నేతలతో సమావేశమైనట్లు తెలిసింది. టీటీడీ చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్లు సమాచారం. తెలంగాణకు చెందిన ఒక మాజీ ఎంపీ, ఒక మాజీ మంత్రి కుటుంబ సభ్యులు, ఒక ఎంపీ షర్మిళకు మద్దతుగా నిలుస్తామని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అటు కాంగ్రెస్‌లో, ఇటు టీఆర్‌ఎస్‌లో వైఎస్‌ఆర్‌కు సన్నిహితంగా మెలిగిన, వైఎస్‌తో మేలుపొందిన, వైఎస్‌ అంటే అభిమానం ఉన్న నేతలను సమీకరించడమే లక్ష్యంగా ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.
వైఎస్సార్‌ సంక్షేమం.. షర్మిళమ్మతోనే సాధ్యం
వైఎస్సార్‌ సంక్షేమం షర్మిళమ్మతోనే సాధ్యం, తెలంగాణ అభివృద్ధికై ఆలోచించండి.. షర్మిలమ్మ నాయకత్వాన్ని బలపరచండి అన్న నినాదాలు సామాజిక మాధ్యమాల్లో మార్మోగుతున్నాయి. కష్టం తెలుసు.. కన్నీళ్ళు తెలుసు.. మన బతుకులు మార్చే దారి షర్మిళక్కకు తెలుసు అంటూ అభిమానులు అపుడే నినదిస్తున్నారు. రెడ్డి, క్రిస్టియన్‌, ఎస్సీలలో షర్మిళ పార్టీకి మంచి ఆదరణ లభిస్తుందని, తెలంగాణలోనూ రాజన్న రాజ్యం స్థాపించడం ఖాయమని షర్మిళ సన్నిహిత వర్గాల అంచనాగా ఉంది. అన్నివర్గాలకు వైఎస్సార్‌ సంక్షేమ పథకాలు చేరాయని, తెలంగాణలోని ప్రతి గుండెలో వైఎస్‌ఆర్‌ ఇంకా ఉన్నారని.. షర్మిళను రాజన్నబిడ్డగా అక్కున చేర్చుకుంటారని చెబుతున్నారు.
చేవెళ్ళ నుండి పాదయాత్ర
త్వరలో చేవెళ్ళ నుండి మహా పాదయాత్ర నిర్వహించాలని వైఎస్‌ షర్మిళ భావిస్తున్నారు. గతంలో నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నిర్వహించిన షర్మిళ.. తండ్రి బాటలో తెలంగాణ మొత్తం చుట్టేసే ప్రణాళికను తయారు చేసుకున్నట్లు సమాచారం. పక్కా ప్రణాళికతోనే షర్మిళ తెలంగాణ రాజకీయాల్లోకి గ్రాండ్‌ ఎంట్రీ ఇస్తుండగా, ఏఏ రాజకీయ పార్టీల్లో ప్రకంపనలు రానున్నాయి.. అసలు ఈ పార్టీ ప్రభావం ఎంత అనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది. షర్మిళ పార్టీ ప్రకటన అనంతరం త్వరలో ఢిల్లిdలో పర్యటిస్తారని, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కూడా కలవబోతున్నారని ప్రచారం జరుగుతోంది.
ప్రాంతీయ పార్టీ గురించి సీఎం వ్యాఖ్యలు షర్మిళ గురించేనా?
పార్టీ పెట్టడమంటే పాన్‌షాప్‌ పెట్టడమంత తేలిక కాదని, రాష్ట్రంలో పార్టీలు పెట్టి.. ఎన్టీఆర్‌ తర్వాత తాను మాత్రమే సక్సెస్‌ అయ్యామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు షర్మిళ పార్టీని ఉద్దేశించి చేసినవేనని విశ్లేషణలు వినబడుతున్నాయి. సీఎంకు ముందస్తు సమాచారంతోనే.. కొత్తపార్టీలపై వ్యాఖ్యలు చేయడంతో పాటు నేతలు గీత దాటకుండా క్రమశిక్షణపై కఠినంగా మాట్లాడారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రాజన్నరాజ్యంపై చర్చ
షర్మిళ పార్టీ పేరుపై కూడా అభిమానుల్లో, సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది. రాజన్న రాజ్యం లేదా వైఎస్సార్‌ తెలంగాణ పేరుతో పార్టీని షర్మిళ ప్రకటించబోతున్నారని సమాచారం. పార్టీ ఏర్పాటులో బ్రదర్‌ అనిల్‌కుమార్‌ కూడా క్రియాశీలకంగా పనిచేస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికే పార్టీ రిజిస్ట్రేషన్‌ కోసం దరఖాస్తు చేసినట్లు కూడా వైఎస్‌ అభిమానుల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణ రాజకీయాల్లో షర్మిళ పార్టీ సరికొత్త సంచలనానికి కారణమవుతుందా.. లేక ఏ స్థాయి ప్రభావం చూపుతుంది అన్నది ముందుముందు తేలనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement