Monday, April 29, 2024

సుప్రీంకోర్టుకు తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న పెండింగ్ కేసుల వివరాలు!

తెలంగాణకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగులో ఉన్న కేసుల వివరాలు సుప్రీంకోర్టుకు చేరాయి. వీరిపై మొత్తం 147 కేసులు పెండింగులో ఉండగా ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరుపుతోంది. హైకోర్టు అనుమతి లేకుండా ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసుల ఎత్తివేత కుదరదని ఈ నెల 10న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం తేల్చి చెబుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక కోర్టుల న్యాయమూర్తుల పేర్లు, పనిచేస్తున్న స్థలం, పదవి చేపట్టిన తేదీ, ఎన్ని కేసులు పరిష్కరించారు, ఇంకా ఎన్ని పెండింగులో ఉన్నాయి.. తదితర వివరాలతో కూడిన పూర్తి వివరాలు అందించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా.. తెలంగాణలో ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన కేసుల్లో 147 పెండింగులో ఉన్నట్టు పేర్కొంటూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఎ.వెంకటేశ్వరరెడ్డి అఫిడవిట్ సమర్పించారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలతో ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన 14 కేసులను గతేడాది అక్టోబరు, ఈ ఏడాది ఆగస్టు మధ్య ఉపసంహరించారు. ఈ నెల 15 నాటికి ఇంకా ఎంపీలు, ఎమ్మెల్యేలపై 147 కేసులు పెండింగులో ఉన్నాయి. సీబీఐ కేసులకు సంబంధించి ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి ఎదుట 21 కేసులు, ఏసీబీ ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి ఎదుట 4 కేసులు.. ఇలా పలు కేసులు పెండింగులో ఉన్నాయి. అయితే, గతేడాది సెప్టెంబరు 9 నుంచి ఇప్పటి వరకు సీబీఐ కోర్టులో ఒక్క కేసును కూడా ఉపసంహరించలేదు.

ఇది కూడా చదవండి: అమ్మ సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాములు నాయక్..

Advertisement

తాజా వార్తలు

Advertisement