Friday, April 26, 2024

రైలు టికెట్‌ రద్దు చేసుకున్నా జీఎస్టీ బాదుడు.. సెకండ్‌ క్లాస్‌ స్లీపర్‌కు మినహాయింపు

సాధారణంగా రైలు ప్రయాణాలు అంటేనే ముందుగానే టికెట్‌ బుక్‌ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా పండుగల సీజన్‌ వస్తుంటే మాత్రం చాలా ముందుగానే టికెట్‌ బుక్‌ చేసుకుంటారు. చాలా మంది ఏదో కారణాల వల్ల చివరి క్షణంలో టికెట్లు కాన్సిల్‌ చేసుకుంటారు. ఇలా టికెట్‌ రద్దు చేసుకుంటే రైల్వే శాఖ కొంత మొత్తాన్ని రుసుంగా తీసుకుంటుంది. ఇక నుంచి ఇలా టికెట్‌ రద్దు చేసుకుంటే ప్రయాణీకులు మరింత ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. టికెట్‌ రద్దు చేసుకుంటే చెల్లించే మొత్తంతో పాటు జీఎస్టీ కూడా చెల్లించాలని తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రైలు టికెట్లతో పాటు హోటల్‌ బుకింగ్స్‌ రద్దు చేసుకున్నా జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.

ఆర్థిక శాఖ ఉత్తర్వుల ప్రకారం ప్రయాణికుడికి కావాల్సిన సేవలు అందిస్తానని సర్వీస్‌ ప్రొవైడర్‌ అంగీకరిస్తూ చేసుకున్న ఒప్పందమే రైలు టికెట్‌ అని , అందు వల్ల టికెట్‌ రద్దు చేసుకుంటే ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లే, దానికి ప్రత్యేకంగా రుసుము వసూలు చేస్తున్నారు. దీన్ని టికెట్‌ క్యాన్సిలేషన్‌ ఛార్జీగా వ్యవహరిస్తున్నారు. ఇది చెల్లింపుల పరిధిలోకి వస్తున్నందున దీనిపై జీఎస్టీ కూడా వర్తిస్తుందని పేర్కొంది. రైల్వే ఫస్ట్‌ క్లాస్‌ ఏసీ టికెట్‌ను 48 గంటల ముందు రద్దు చేసుకుంటే క్యాన్సిలేషన్‌ ఛార్జీగా 240 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. టికెట్‌ తీసుకున్నప్పుడు 5 శాతం జీఎస్టీ కలిపి చెల్లిస్తారు. రద్దు ఛార్జీలకు కూడా ఇదే వర్తిస్తుందని, దీని ప్రకారం ప్రయాణీకులు 12

రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. టికెట్‌ రద్దు ఛార్జీ 240 ప్లస్‌ 12 కలిపి 252 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణీకులు ఎప్పుడు టికెట్‌ రద్దు చేసుకున్నా చెల్లించే రుసుంతో పాటు 5 శాతం జీఎస్టీ కట్టాల్సి ఉంటుంది. సెకండ్‌ క్లాస్‌ స్లీపర్‌ టికెట్‌ రద్దు చేసుకుంటే మాత్రం జీఎస్టీ చెల్లించాల్సిన అవసరంలేదని ఆర్థిక శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement