Monday, May 13, 2024

భారత్ నుంచి విమాన రాకపోకలపై కెనడా నిషేధం

కరోనా కేసుల సంఖ్య ఊహించ‌ని రీతిలో పెరిగిపోతోన్న నేప‌థ్యంలో ఇప్ప‌టికే ప‌లు దేశాలు భార‌త్ నుంచి వ‌చ్చే విమానాల‌పై నిషేధం విధించిన విష‌యం తెలిసిందే. తాజాగా కెనడా కూడా అదే ప‌ని చేసింది. ప్యాసింజ‌ర్, క‌మ‌ర్షియ‌ల్ విమానాల‌ను 30 రోజుల‌పాటు నిషేధిస్తున్న‌ట్లు కెన‌డా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. భార‌త్ నుంచి త‌మ దేశానికి వ‌స్తున్న విమాన ప్ర‌యాణికుల్లో చాలా మందికి క‌రోనా నిర్ధారణ అవుతుండ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని వివ‌రించింది. అటు పాకిస్థాన్ నుంచి వ‌చ్చే విమానాల‌నూ నిషేధిస్తున్న‌ట్లు పేర్కొంది.

కార్గో విమానాలతో పాటు వ్యాక్సిన్ల వంటి అత్య‌వ‌స‌ర స‌రుకుల‌ను ర‌వాణా చేసే విమానాలు మాత్ర‌మే న‌డుస్తాయ‌ని కెనడా ప్రభుత్వం చెప్పింది. ఇటీవ‌ల ఢిల్లీ నుంచి 18, లాహోర్ నుంచి రెండు విమానాలు రాగా వాటిలో వ‌చ్చిన కొంద‌రు ప్ర‌యాణికులు అనారోగ్యంతో బాధ‌పడుతున్నట్లు గుర్తించామ‌ని చెప్పారు. మ‌రోవైపు, కెన‌డాకు వ‌చ్చే ప్ర‌యాణికులు క్వారంటైన్ లో ఉండాల్సిందేన‌ని ఇప్ప‌టికే ఆ దేశ ప్ర‌భుత్వం చెప్పింది. కెన‌డా‌లో రోజుకు దాదాపు 9 వేల కొత్త క‌రోనా కేసులు నిర్ధార‌ణ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement