Saturday, April 27, 2024

న్యూఢిల్లీ : లబ్ డబ్బే

  • ఆంధ్రప్రభ దినపత్రిక పేజ్ వన్ స్పెషల్ స్టోరీ
  • భారంగా ఆస్పత్రుల నిర్వహణ
  • బ్యాంక్ కిస్తీలపైనే ఆందోళన
  • ఖరీదైన పరికరాలకు రుణాలు
  • విదేశాల నుంచి దిగుమతి
  • ఆస్పత్రుల మధ్య తీవ్ర పోటీ
  • రోగిపై కంటే బిల్లుపైనే దృష్టి
  • బీమా కార్డులకు పరిమితులు
  • ప్రాణాధార పరికరాలను కేంద్రమే దిగుమతి చేసుకోవాలి
  • స్థాయిని బట్టి ఆస్పత్రులకు ఉచితంగా ఇవ్వాలి
  • వైద్యసేవలకు నిర్ణీత ధరలను నిర్దేశించాలి
  • ఆస్పత్రులపై ఆర్థిక ఒత్తిడి తగ్గించాలి
  • అప్పుడే సేవలపై వైద్యుల దృష్టి
  • సామాజిక నిపుణుల సూచనలు

దేశంలో వైద్యరంగంపై ఒత్తిడి పెరిగింది. వైద్యులు తమ వృత్తి నిర్వహణ కంటే ఆస్పత్రుల నిర్వహణపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాల్సి వస్తోంది. రోగుల స్వస్తత కంటే నెలవారీ బ్యాంకుల ఈఎంఐల చెల్లింపుపైనే ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి స్పష్టమౌతోంది. వైద్య ఆరోగ్య రంగంపై ప్రభుత్వం అధిక శ్రద్ధ చూపడమే పరోక్షంగా ఇందుకు కారణమైంది. దేశంలో వైద్యఆరోగ్య సదుపాయాల మెరుగుదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడ్డాయి. ఇందుకోసం ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఆస్పత్రుల సంఖ్యను పెంచాయి. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అత్యాధునిక సదుపాయాలతో కూడిన ఎయిమ్స్‌ను 14 శాఖలుగా కేంద్రం విస్తరించింది. అలాగే రాష్ట్రాలు కూడా అత్యాధునిక వైద్య సదుపాయాలతో కూడిన ఆస్పత్రుల నిర్మాణాన్ని చేపట్టాయి. వీటికి తోడుగా ప్రైవేటు, కార్పొరేట్‌ రంగంలో వైద్య సేవలకు కేంద్రం ఇతోధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఆస్పత్రుల నిర్మాణంతో పాటు ప్రాణాల్ని నిలబెట్టడంలో కీలకంగా పనిచేసే పరికరాల కొనుగోలుకు ఆరు శాతం వార్షిక వడ్డీపై బ్యాంకుల నుంచి భారీ మొత్తాల్లో రుణాల్ని మంజూరు చేస్తోంది. దీంతో ప్రైవేటు, కార్పొరేట్‌ రంగంలో పెద్దపెద్ద ఆస్పత్రులు ఏర్పాటయ్యాయి. ఆధునిక, సాంకేతిక పరికరాల్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నాయి. ఈ విషయంలో ఆస్పత్రుల మధ్య కూడా అనూహ్య పోటీ ఏర్పడింది. దీంతో ఆస్పత్రుల నిర్వహణ భారంగా మారింది. వైద్యులు రోగులకు అందించే సేవల్ని పక్కనపెట్టి నెలవారీ బ్యాంక్‌ ఈఎంఐలు, కరెంట్‌ బిల్లులు, ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపులపైనే ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. దేశంలో అత్యున్నత వైద్య ప్రమాణాలు కలిగిన వేలాదిమంది డాక్టర్లు సొంతంగా కార్పొరేట్‌ ఆస్పత్రుల్ని నెలకొల్పారు. ఇందుకోసం వందల కోట్లు బ్యాంకుల్ని రుణాలుగా తెచ్చారు. ఓ వైపు వైద్య ఆరోగ్య రంగంలో స్పష్టమైన వృద్ధి నమోదౌతోంది. అయినప్పటికీ విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ప్రాణాధార పరికరాల విలువ ఎక్కువగా ఉండడంతో బ్యాంకుల నుంచి తెస్తున్న రుణాల భారం అధికమైంది.
ఈ నేపథ్యంలో ఆస్పత్రుల పనితీరులో స్పష్టమైన మార్పులొచ్చేశాయి. రోగి ఐసీయూలో ఉంటే ముందుగా అతనికి సంబంధించిన చెల్లింపులపైనే ఆస్పత్రి వర్గాలు దృష్టిపెడుతున్నాయి. రోగి మరణిస్తే తమకు బిల్లులు వసూలు కావన్న భయం తప్ప రోగి ఆరోగ్య పరిస్థితిపై దృష్టి పెట్టలేక పోతున్నారు. రోగికి సంబంధించిన బంధువుల్ని ఆస్పత్రుల్లో అందుబాటులో ఉండనివ్వరు. అలాగని ఇంటికెళ్తే గంటకోసారి ఆస్పత్రి నుంచి ఫోన్‌ వస్తుంది. వెంటనే బయలుదేరి రండి మాట్లాడాలంటూ కబురు పెడతారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువుల్లో కలకలం, అభద్రతాభావం చోటు చేసుకుంటాయి. భయం భయంగానే ఆస్పత్రికి పరుగులు తీస్తున్నారు. తీరా వస్తే ఐసీయూలో ఉన్న రోగికి సంబంధించి అడ్వాన్స్‌ చెల్లించండంటూ బిల్లులు చేతిలో పెడుతున్నారు. ఆస్పత్రిలో ఉన్న ప్రతి రోగికి సంబంధించి గంట గంటకు ఆర్థిక వివరాల్ని మాత్రమే ఆస్పత్రులు ఖచ్చితంగా నమోదు చేస్తున్నాయి. ఆరోగ్య ప్రగతి కంటే రోగి నుంచి రావాల్సిన మొత్తాలు, ఇంతవరకు జరిపిన చెల్లింపులు, ఇంకా తమకు కట్టాల్సిన అడ్వాన్స్‌లపైనే దృష్టి పెడుతున్నారు. ఈ పరిస్థితి అటు రోగులతో పాటు ఇటు ఆస్పత్రి నిర్వాహక వర్గాలకు తీవ్ర ఇబ్బందిగా పరిణమిస్తోంది.
అమెరికా వంటి దేశాల్లో ప్రజలందరికీ ప్రభుత్వమే ఆరోగ్య బీమా చెల్లిస్తోంది. కానీ భారత్‌లో ఆరోగ్య బీమా పథకాలు పెద్దగా విస్తృతిలోకి రాలేదు. కొన్ని సంస్థలు ఈ బీమా పథకాలు చేస్తున్నా సకాలంలో రోగుల బిల్లుల్ని ఆస్పత్రులకు చెల్లించడంలేదు. చెల్లింపుల్లో కూడా సవాలక్ష నిబంధనలు విధిస్తున్నాయి. దీంతో కార్పొరేట్‌ ఆస్పత్రులేవీ ఈ బీమా సంస్థల కార్డుల్ని ఆమోదించడం లేదు. ముందుగా తమకు నగదు జమ చేసి తామిచ్చిన బిల్లుల్ని బీమా సంస్థలకు పంపి వారి నుంచి సొమ్ము పొందాలంటూ సూచిస్తున్నారు. వాస్తవానికి బీమా కార్డులపైనే రోగుల్ని ఆస్పత్రుల్లో చేర్చుకోవాలి. కానీ దేశంలో అందుకు భిన్నమైన పరిస్థితి ఉంది. ఓ వైపు వేలకు వేలు బీమా ప్రీమియంలు చెల్లిస్తున్నా అడ్వాన్స్‌ పేమెంట్‌లు కడితే తప్ప రోగిని ఆస్పత్రిలో చేర్చుకోడం లేదు. అప్పో సప్పో చేసి లేదా ఆస్తులమ్మి రోగులకు సంబంధించిన బిల్లులన్నీ జమ చేసి బయటపడాల్సి వస్తోంది. బీమా కార్డుంటే ఈ బిల్లుల్ని వారికి పంపినప్పటికీ ఫలితం ఉండడం లేదు. ఆస్పత్రిలో జరిపిన చెల్లింపుల్లో 30నుంచి 40శాతం మాత్రమే బీమా సంస్థలు రోగికి తిరిగిస్తున్నాయి. దీంతో దేశంలో ఆరోగ్య బీమా రంగంపై అటు ఆస్పత్రులు, ఇటు రోగుల్లోనూ విశ్వాసం కొరవడుతోంది.
సుదీర్ఘకాలం ఎంతో నిబద్దతతో వైద్య విద్య అభ్యసించిన ఓ డాక్టర్‌ ఎంతో సేవా దృక్పథంతో ఈరంగంలోకొస్తాడు. దేవుడి తర్వాత ప్రజలు విశ్వసించేది.. గౌరవించేది డాక్టర్‌నే. ఆ గౌరవాన్ని సమాజంలో నిలబెట్టుకోవాలని ప్రతి డాక్టర్‌ తొలిరోజుల్లో ఆశిస్తాడు. కానీ అందుకు ప్రస్తుత పరిస్థితులు అనుకూలించడం లేదు. వైద్యరంగంలోకి కార్పొరేట్‌ విధానాలు ప్రవేశంచాయి. భారీ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వాలే ప్రోత్సహించి రుణాలివ్వడం మొదలెట్టాయి. దీంతో ఆస్పత్రుల ఏర్పాటు పూర్తిగా ఆర్థిక అంశాలతో ముడిపడిపోతోంది. రోగులకు సేవకంటే ఇది వ్యాపార దృక్పథంగా మారుతోంది. ఒకప్పుడు ప్రభుత్వ రంగంలోనే పెద్దపెద్ద ఆస్పత్రులు ఉండేవి. లేదా మిషనరీలు సేవా దృక్పథంతో ఆస్పత్రులు నిర్వహించేవారు. కొన్ని సామాజిక సేవా సంస్థలు కూడా ఉచిత వైద్య సేవల కోసం ఆస్పత్రులు పెట్టేవి. ఈ రంగాన్ని విస్తృతపర్చాలన్న ప్రభుత్వ లక్ష్యం ఇప్పుడు పక్కదారులు పట్టింది. ఆశించిన లక్ష్యం నెరవేరకపోగా అది రోగుల పాలిట శాపంగా తయారైంది. దీని నుంచి రోగులకు ఉపశమనం లభించాలంటే ప్రైవేటు కార్పొరేట్‌ రంగానికి కూడా ప్రభుత్వం చేయూతనివ్వాలి. ప్రాణాధార పరికరాల విలువ చాలా ఎక్కువ. వీటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి. వీటిపై కేంద్రం విధించే సుంకాలు కూడా భారీగానే ఉంటాయి. ఈ పరికరాల్ని నేరుగా కేంద్రమే దిగుమతి చేసుకోవాలి. ఆస్పత్రుల స్థాయి, అందులో అందుబాటులో ఉన్న వైద్యుల అర్హతల్ని బట్టి ఆ పరికరాల్ని ఉచితంగా ఆస్పత్రులకు ఇవ్వాలి. నిర్ణీత ధరపైనే రోగులకు సేవలందించాలని నిర్దేశించాలి. తద్వారా ఆస్పత్రులపై ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. పరోక్షంగా ఇది రోగులకు మేలు చేస్తుంది. వైద్యులు ప్రతిరోజు బ్యాంక్‌ ఈఎంఐల లెక్కల్ని పక్కనపెట్టి వైద్య సేవలపై దృష్టిపెట్టే అవకాశం కల్పిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement