Friday, December 6, 2024

నేటి సంపాద‌కీయం – ద‌డపుట్టిస్తున్న ద్ర‌వ్యోల్బ‌ణం..!

టోకు ధరల ద్రవ్యోల్బణ ప్రభావం ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం వరుసగా 11వ మాసం కూడా పెరగడంతో వినియోగదారులపై మోయలేని భారంపడింది.గత నెల12.96 శాతం ఉన్న టోకు ద్రవ్యోల్బణం, ఈ నెల 13.11 శాతంఉంది. ఆహార ధాన్యాలు, పప్పు దినుసులు, నూనెలు, ఖనిజ తైలాల ధరలు పెరగడం వల్లనే ద్రవ్యోల్బణం పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు. ఎన్నికల వేళ ధరలను అదుపులో ఉంచేందుకు ప్రయత్నించినప్పటికీ అవి ఆయా రాష్ట్రాలకే పరిమితం అయ్యాయి. ప్రభుత్వం ప్రకటించిన టోకు ధరల సూచి దేశంలో వాస్తవ పరిస్థితికి అద్దం పట్టడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. ప్రజల ఆక్రందనలను గుర్తించే పరిస్థితి లో ప్రభుత్వం లేనట్టుగా కనిపిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరల హెచ్చు తగ్గులను బట్టే సామాన్యుల జీవన పరిస్థిితులు ఆధార పడి ఉంటాయి. ఉక్రెయిన్‌ యుద్ధం ప్రభావం వల్ల చమురు ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలను పురస్కరించుకుని రిటైల్‌ మార్కెట్‌లో అదిగో పులి అంటే ఇదిగోతోక అన్న చందంగా ధరలు పెంచేస్తున్నారు. వంటనూనెల ధరలను తగ్గిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్వయంగా ప్రకటించారు.

కానీ, జంటనగరాల్లో వంటనూనెలను లీటరుకు 50 రూపాయిలు పైన పెంచేసి విక్రయిస్తున్నా రు. ఇతర చోట్ల కూడా వంటనూనెల ధరలు బాగా పెరిగి పోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. టోకు ధరల ద్రవ్యోల్బణం పెరిగితే దాని ప్రభావం రిటైల్‌ ద్రవ్యోల్బణంపై ఉంటుంది. క్రూడ్‌ పెట్రోలియం ధర 55.17 శాతం పెరిగింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే వంట గ్యాస్‌ ధర సిలిండర్‌కి 105 రూపాయిలు పెంచినట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించగా, వంటగ్యాస్‌ ధర కూడా అనధికారికంగా పెంచేశారు. అలాగే, ఇళ్లకు కేటాయించే సిలిండర్లను రెస్టారెంట్లు, రోడ్డు పక్క హోటళ్లకు కేటాయిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ విధంగా కూడా వంటగ్యాస్‌ ధరను లోపాయికారీగా పెంచేస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. కూరగాయలు, పండ్ల ధరలు కూడా ఊర్ధ్వ ముఖంలోనే ఉన్నాయి. వేసవి ఎండలు ఇంకాముదరకపోయినా కూరలు, పండ్ల ధరలను పెంచేస్తున్నట్టు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఎంత లేదన్నా ఉక్రెయిన్‌ యుద్ధం ప్రభావం వినియోగవస్తువులపై ప్రత్యక్షంగానో, పరోక్షం గానో ఉంటోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎన్నికలకే ప్రాధాన్యం ఇచ్చిందనీ, ధరల పెరుగుదల గురించి పట్టించుకోలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

అయితే, ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ధరల పెరుగుదల ఇదే రీతిలో ఉందని బీజేపీ వర్గాలు తిప్పికొడుతున్నాయి. రాజకీయ పార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణల సంగతి అలా ఉంచితే, ధరల పెరుగుదలను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన రీతిలో తగిన చర్యలు తీసుకోవడం లేదన్నది నిపుణుల అభిప్రాయం. ధాన్యం కొనేవారు లేరంటారు. పేదలు వినియోగించే వరి బియ్యం ధర అందుబాటులో ఉండటం లేదు. రైతులు పండించే ధాన్యం దళారుల వద్ద ఉంటోంది. ప్రభుత్వం ఆహార ధాన్యాలను సేకరించే విషయంలోగతంలో మాదిరిగా క్రమపద్దతిలోవ్యవహరించడం లేదు. భారత ఆహార సంస్థ తగినన్నినిల్వలను కొనుగోలు చేయకపోవడం వల్లనే దళారులు మార్కెట్‌లో ప్రవేశిస్తున్నారు. నిత్యావసర ధరలను అదుపు చేయడానికి అవసరమైన నిధులను కేటాయిస్తామని ఎన్నికల ముందు వాగ్దానం చేసే పార్టీలు రాజకీయ పరమైన ఒత్తిళ్ల కారణంగా నిశ్చేత నమవుతున్నాయి. ఆహార ధాన్యాలు, పప్పు దినుసులు, నూనె ధరలను అదుపులో ఉంచితేనే ప్రజలకు సరసమైన ధరలకు అవి లభిస్తాయి.

కేంద్రం, రాష్ట్రాల మధ్య ఈ విషయంలోసమన్వయం ఉండాలి. రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. వినియోగ దారులకు సరసమైన ధరలకు నిత్యావసరాలు లభించడం లేదు. పెరుగుతున్న ధరల సొమ్ము అంతా దళారుల పాలవుతున్నది. కుటుంబ ఖర్చులు పెరిగిపోవడంతో మధ్యతరగతి జనం విలవిలలాడుతున్నారు.ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలపై దృష్టిని కేంద్రీకరించాలి. అప్పుడే సామాన్యుల కు న్యాయం జరుగుతుంది. పట్టణాలు, నగరాల్లో ధరలు పెరగడాన్ని ఒక విధంగా అర్థం చేసుకోవచ్చు. గ్రామాల్లో ఆహార ధాన్యాలు. పప్పు దినుసుల ధరలు పెరగడాన్ని ఏవిధంగా సమర్ధించగలం? చౌక ధరల డిపోలను నిర్వీర్యం చేసేశారు. ఇప్పుడు అవి అక్కడక్కడ పని చేస్తున్నా నామమాత్రమే. దుకాణా లు తెరిచి ఉంచి, స్టాకు లేదనే బోర్డు పెడుతుంటారు. పౌరసరఫరా శాఖ పర్యవేక్షణ ఉందా అనే అనుమానం కలుగుతూ ఉంటుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement