Saturday, May 18, 2024

తస్లీమా వాదన.. వాస్తవాలు!

బంగ్లాదేశ్‌ వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ మళ్లీ గళం విప్పారు. టెహరాన్‌లో హిజాబ్‌కి వ్యతిరేకంగా మహిళల నిరసన ప్రదర్శనలపై ఆమె స్పందించారు. ఇరాన్‌ మహిళలు తమ స్వేచ్ఛ కోసం, వాక్‌ స్వాతంత్ర్యాన్ని నిలబెట్టుకోవడం కోసం వీధుల్లోకి రావడం మంచి పరిణామమని ఆమె వ్యాఖ్యానించారు. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు మళ్లీ రాజ్యాధికారాన్ని చేపట్టి క్రమంగా మహిళలపై ఆంక్షల విధిస్తున్న తరుణంలో తస్లీమా ముస్లిం మహిళా సమాజంలో సంస్కరణల కోసం ముందుకురావడం చెప్పుకోదగిన పరిణామం. ప్రపంచ దేశాలలో కానవస్తున్న మార్పులను చూసైనా ముస్లిం మహిళలు దశాబ్దాలుగా తమ పట్ల పురుషాధిక్య సమాజం చూపుతున్న వివక్షను ఎదిరించడం ఆధునిక నాగరికత సమాజంలో సహజమే.

ఇరాన్‌లో ఆయతుల్లా ఖమానీ నేతృత్వంలోని ప్రభుత్వంలో రివల్యూషనరీ గార్డ్స్‌ జరుపుతున్న ఏకపక్ష దాడులను మహిళలే కాకుండా పురుషులు కూడా వ్యతిరేకిస్తున్నారు. అంతర్జాలం, ప్రసారమాధ్యమాల ప్రభావం ఇరాన్‌లోనూ కనిపిస్తోందనడానికి ఈ నిరసన ప్రదర్శనలే నిదర్శనం. షరియా ముస్లిం సంప్రదాయానికి అనుగుణంగా హిజాబ్‌ ధరించలేదన్న ఆరోపణతో 22 ఏళ్ల మహ్‌షా అమిని అనే యువతిని ఇరాన్‌ మొరాలిటీ పోలీసులు అదుపులోకి తీసుకోవడం, ఆమె గుండెపోటుతో మర ణించిన నేపథ్యంలో దేశమంతటా ఆందోళనలు మొదలైన విషయం తెలిసిందే. ఏడేళ్ల వయస్సు వచ్చినప్పటి నుంచి నఖశిఖపర్యంంతం దుస్తులు ధరించాలన్న నిబంధనపై ఈ ఉదంతం తరువాత ముస్లిం మహిళల్లో ఆగ్రహం పెల్లుబికుతోంది.

తాజాగా శిరోజాలను కత్తిరిం చుకుని, హిజాబ్‌ను దగ్ధం చేస్తూ నిరసనలు వ్యక్తం చేస్తుండటంతో వివాదం మరింత ముదురుతున్నది. కట్టు, బొట్టు, ఆహార్యంలో భారతీయ సంప్రదాయాల పట్ల ఆకర్షితురాలైన తస్లీమా దశాబ్దాల క్రితమే ఛాందసభావాలపై తిరుగుబాటు చేశారు. దాంతో ముస్లిం పెద్దలు ఆమెను బహిష్కరించారు. అయినా తాను నమ్మిన భావాలను స్వేచ్ఛగా ప్రచారం చేస్తున్నారు. హిజాబ్‌పై మన దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న కర్నాటకలో అనుకూల, ప్రతి కూల ఆందోళనలు సాగుతున్నాయి. కర్నాటకలో కాంగ్రెస్‌, జనతాదళ్‌ (ఎస్‌) పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఆందోళనలు లేవు. కర్నాటకలో అధికార బీజేపీ, విద్యార్థి విభాగమైన అఖిల భారత విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ)ని హిజాబ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలకు ఉసిగొల్పగా, అందుకు ప్రతిగా శ్రీరామసేన పేరిట ముత్తా లిక్‌ ఆందోళనలు నడుపుతున్నారు.

ఈ ఆందోళనలను రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టులు సమర్థించలేదు సరికదా, సమాజంలో ప్రశాంత వాతావరణాన్ని కలుషితం చేస్తు న్న వర్గాలపట్ల కఠినంగా వ్యవహరించాల్సిందిగా ప్రభు త్వాన్ని ఆదేశించారు. ఈ దేశంలో పౌరులంతా భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని న్యాయస్థానాలు ఆదేశించాయి. ఇప్పుడు తస్లీమా నస్రీన్‌ కూడా అదే మాట అంటున్నారు. ఎవరు ఏ భాష మాట్లాడాలో, ఎటువంటి దుస్తులు ధరించాలో వారి ఇష్టాయిష్టాలను బట్టే ఉంటుందని, వ్యక్తి స్వేచ్ఛను, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించే హక్కు, అధికారం ఏ ఒక్కరికీ ఉండదని ఆమె స్పష్టం చేస్తున్నారు. హిజాబ్‌ ధరించి తీరాలని ఇస్లాం ఆదేశించడం లేదనీ, రాజకీయ వాదులు మాత్రమే దీని కోసం పోట్లాడుతున్నారన్నది తస్లీమా వాదన.

హిందువుల్లో ఉర్దూ పండితులు అనేకమంది ఉన్నట్లే, ముస్లింలలో హిందీ పండితులున్నారు. కబీర్‌దాస్‌ ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. నేటి కాలంలో కూడా రామాయణాన్ని ఉర్దూలోకి అనువదించి ప్రచారం చేసినవారున్నారు. వారినుండి స్ఫూర్తి పొంది కాన్పూర్‌కి చెందిన ముస్లిం టీచర్‌ మహా తలత్‌ సిద్ధిఖీ ప్రసిద్ధులు. ఆమె రామాయణాన్ని లోతుగా అధ్యయనం చేయడమేకాక పరిశోధన పత్రాలు సమర్పించారు. చరణ్‌సింగ్‌ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ ఒకరు రామాయణాన్ని ఉర్దూలోకి అనువదిం చారు. హైదరాబాద్‌ నిజాం పాలనకు వ్యతిరేకంగా ఉర్దూ దినపత్రికను నడిపిన షోయుబుల్లాఖాన్‌ను ఇప్పటికీ గుర్తుచేసుకుంటూ ఉంటారు.

- Advertisement -

నిజాం పంపిన దండు దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఇలా ఎందరో కవులు, రచయితలు, పత్రికా సంపాదకులు మత సామర స్యం కోసం, భాషాభిమానంతో హిందీతో సమానంగా ఉర్దూని ప్రోత్సహించారు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డా.సి.నారాయణ రెడ్డి తెలుగులో ఎంత ప్రావీణ్యులో ఉర్దూలోనూ అంత ప్రావీణ్యులు. అందువల్ల కళా, సాంస్కృతిక, భాషా వికాసానికి మతం అడ్డుగోడ కాదని ఎంతోమంది మహనీయులు నిరూపించారు. హిజాబ్‌ వివాదం రాజకీయ నాయకులు సృష్టించిందే తప్ప వేరొకటి కాదని స్పష్టం చేయడానికి ఎన్నో ఉదాహరణ లున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement