Sunday, May 19, 2024

మీట‌ర్ లో పొర‌పాటు – వాచ్ మెన్ ఇంటికి రూ.13ల‌క్ష‌ల క‌రెంట్ బిల్లు

అత‌ను ఒక వాచ్ మెన్. మ‌రి వాచ్ మెన్ ఇంటికి క‌రెంట్ బిల్లు ఎంత వ‌స్తుంది..మ‌హా అయితే 200 లేదా 300. అయితే ఇక్క‌డ ఏకంగా ఓ సామాన్యుడి ఇంటికి రూ.13ల‌క్ష‌ల క‌రెంట్ బిల్లు వ‌చ్చింది.ఈ సంఘ‌ట‌న పుదుచ్చేరిలో చోటు చేసుకుంది.ఆ బిల్లు చూసి అత‌డి గుండె గుభేల్‌మంది. పుదుచ్చేరిలోని విశ్వ‌నాధ‌న్ న‌గ‌ర్‌లో టీవీ మెకానిక్‌గా ప‌నిచేస్తూ రాత్రిళ్లు వాచ్‌మెన్‌గా విధులు నిర్వ‌ర్తించి పొట్ట‌పోసుకునే శ‌ర‌వ‌ణ‌న్‌కు ఇంత పెద్ద‌మొత్తంలో క‌రెంటు బిల్లు రావ‌డంతో అత‌డు షాక్ తిన్నాడు. ఆపై సాంకేతిక పొర‌పాటుగా గుర్తించిన అధికారులు త‌ప్పిదాన్ని స‌వ‌రించ‌డంతో శ‌ర‌వ‌ణ‌న్ ఊపిరిపీల్చుకున్నాడు.

గ‌తంలో అత‌డి విద్యుత్ మీట‌ర్ రీడింగ్ 20,630 కాగా జులై మాసంలో ఇచ్చిన బిల్లులో 2,11,150 యూనిట్ల‌ను చూపి అత‌డు 1,90,520 యూనిట్లు వాడిన‌ట్టు బిల్లులో చూపారు. అద్దె ఇంట్లో ఉండే శ‌ర‌వ‌ణ‌న్ ప్ర‌తినెలా రూ 600-700 మ‌ధ్య క‌రెంట్ బిల్లు క‌డుతుండేవాడు. అస‌లు రీడింగ్ మెషీన్‌లో 5 అంకెలే చూపాల‌ని 6 అంకెలు ఎలా న‌మోదైందో తెలియ‌లేదంటూ బిల్లులో పొర‌పాటును చ‌క్క‌దిద్దేందుకు శ‌ర‌వ‌ణ‌న్ క‌రెంట్ ఆఫీస్ చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేశాడు. మొత్తం మీద సాంకేతిక పొర‌పాటును గుర్తించిన అధికారులు దాన్ని స‌వ‌రించారు. మీట‌ర్‌లో పొర‌పాటున రీడింగ్ చివ‌రిలో అద‌నంగా సున్నా క‌లిసింద‌ని, దీన్ని గుర్తించి పొర‌పాటును చ‌క్క‌దిద్దామ‌న్నారు అధికారులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement