Thursday, April 25, 2024

తల్లి బాధకు విముక్తి!

మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్యకేసులో కీలక నిందితుడు పెరారి వాలన్‌ను విడుదల చేయమంటూ సుప్రీంకోర్టు బుధవారం కేంద్రానికి ఆదేశాలు జారీ చేయడం ముమ్మాటికీ సంచలనాత్మకమే. కోర్టు రాజ్యాంగంలోని 142వ అధికరణంలో తనకు గల అసాధారణ అధికారాలను వినియోగించి ఈ ఆదేశాలు జారీ చేసింది. రాజీవ్‌ 31వ వర్ధంతికి మూడు రోజుల ముందు ఈ తీర్పు వెలువడటం కాంగ్రెస్‌ వర్గాలకే కాక, రాజీవ్‌ అభిమానులకు బాధ కలిగించింది. ఇది వ్యక్తులకు సంబంధించిన అంశంగా కాకుండా, రాజ్యాంగ పరమైన అంశంగా రూపుదిద్దుకుంది. అందువల్ల ఈ తీర్పుపై మీడియాలోనూ, బయటా చర్చోపచర్చలు జరగవచ్చు. రాజ్యాంగంలోని 161వ అధికరణం కింద అతడు దాఖలు చేసిన అభ్యర్ధనపై తమిళనాడు గవర్నర్‌ నిర్ణయం తీసుకోవడంలోజాప్యం చేసినట్టు సుప్రీంకోర్టు పేర్కొంది. పెరారి వాలన్‌ విడుదల కోసం తమిళనాడు మంత్రివర్గం ఇంతకుముందే నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో 142 అధికరణం కింద తమకు గల విశేష అధికారాలను పురస్కరించుకుని విడుదల చేయడం సమంజసమే అవుతుందని సుప్రీంకోర్టు పెర్కొంది. సాధారణంగా క్షమాభిక్షలు రాష్ట్రపతి ప్రసాదిస్తారు. ఈ కేసులో నిందితులు ముందు నుంచి కోర్టులను ఆశ్రయిస్తున్నారు.

ఈ కేసులో పెరారివాలన్‌కి ఉరిశిక్ష పడింది. శ్రీ పెరంబదూరులో ఎన్నికల ప్రచార సభలో పాల్గొనేందుకు వెళ్ళగా, మానవ బాంబు అయిన థాను రాజీవ్‌కి అతి దగ్గరగా తనను తాను పేల్చుకోవడం వల్ల భారత చరిత్రలో అత్యంత విషాదాన్ని సృష్టించిన ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్టు అయ్యే సమయానికి పెరారివాలన్‌ వయసు 19 ఏళ్ళు. పేలుడు వస్తువులు సరఫరా చేశాడన్న అభియోగం రుజువు కావడంతో కింది కోర్టు అతడికి మరణశిక్ష విధించింది. ఇదే కేసులో నిందితురాలు నళిని ముందే విడుదల చేశారు. అతడికి కూడా మరణశిక్షను సుప్రీంకోర్టు జీవిత కాల శిక్షగా మార్చింది. అప్పటి నుంచి విడుదల కోసం అతడు న్యాయపోరాటం చేస్తూనే ఉన్నాడు. కోర్టు కేసుల పరిభాషలో హై ప్రొఫైల్‌ అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇది అలాంటిది కావడం వల్ల పలు స్థాయిల్లో జాప్యం జరిగింది. ఇలాంటి కేసుల్లో నిందితులు పెరోల్‌, బెయిల్‌పై విడుదలైనప్పుడు వారి కదలికల నూ, ప్రవర్తనను పరిగణనలోకి తీసుకుంటారు. పెరారి వాలన్‌ పై ఎటువంటి ఫిర్యాదులు రానందున అసాధారణ అధికారాలు ఉపయోగించి అతడిని విడుదల చేయడం సబబేనని కోర్టు అభిప్రాయ పడినట్టు తెలుస్తోంది. తమిళనాడు రాజకీయాలను తీవ్ర ప్రభావితం చేసిన ఈ కేసులో ఉభయ డీఎంకే పార్టీలూ ముందు నుంచి నింది తుల విడుదల కోసం ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నాయి. కాంగ్రెస్‌ తరఫున ఆ పార్టీ ప్రస్తుత ప్రధానకార్యదర్శి, రాజీవ్‌ కుమార్తె ప్రియాంకా వాద్రే కొన్నేళ్ళ క్రిందట తమిళనాడు సందర్శించి నిందితులను కలుసుకున్నారు. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు ఈ కేసులో నిందితులను విడుదల చేయడానికి రాజీవ్‌ సతీమణి సోనియాగాంధీ కూడా సుముఖంగా ఉన్నారన్న వార్తలు వచ్చాయి. ఈ కేసులో భావోద్వేగాలు తీవ్రంగా ఉన్నాయి.

మామూలు కేసుల్లో అయితే, జీవిత ఖైదీలను 31 ఏళ్ళ శిక్షను అనుభవించిన ఖైదీలను విడుదల చేయడంలో ఎవరికీ ఎటువంటి అభ్యంతరం ఉండేది కాదేమో! రాజీవ్‌ ప్రధానమంత్రిగానే కాకుండా, నెహ్రూ కుటుంబ వారసునిగా ప్రజలందరి ప్రేమాభిమానాలను చూరగొన్న నాయకుడు. అంతేకాకుండా, ఈ కేసులో ఉగ్రవాద కోణం కూడా ఉంది. ఆయన హత్య జరిగిన సంవత్సరం నుంచి ఏటా మే19వ తేదీన ఉగ్రవాద వ్యతిరేకదినాన్ని జరుపుకోవడం, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతామని దేశ ప్రజలు ఆరోజున ప్రతిన చేయడం జరుగుతోంది. తమిళ టైగర్ల ఉగ్రవాదం అది పుట్టిన శ్రీలంకలో పూర్తిగా మటుమాయమైన ప్పటికీ, ఇతర ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఇంకా కొన సాగుతున్నాయి. అందువల్ల ఒక ఉగ్రవాది విడుదలయ్యాడంటే దానిపై అన్ని స్థాయిల్లోనూ చర్చజరుగు తుంది. కాందహార్‌కి విమానాన్ని దారి మళ్ళించిన ఉగ్రవాదుల్లో ఒకడైన మసూద్‌ అజార్‌ అదే విమానంలో ప్రయాణీకులను విడిపించడం కోసం విడుదల చేశారు. అతడు తర్వాత పాకిస్తాన్‌లో తలదాల్చుకుని జైష్‌ ఎ మహ్మద్‌ అనే ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. ఆ సంస్థ కు చెందిన జిహాదీలు మన దేశంలోఎన్ని దాడులు జరిపారో ఇంకా మనస్మృతి పథంలోనే ఉంది. అందువల్ల ఉగ్రవాద కేసులో నిందితునికి విముక్తి లభించిందంటే పూర్వపు అనుభవాల భయాలు వెంటాడుతూనే ఉంటాయి. పెరారి వాలన్‌ విడుదలతో వృద్ధు రాలైన అతడి తల్లి సంతోషానికి అవధులు లేవు. ఈ తీర్పు వల్ల అతడి తల్లి బాధకు విముక్తి లభించినట్టయింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement