Monday, May 6, 2024

ముర్ము గెలుపు.. మేలు మలుపు!

భారత దేశ చరిత్రలో తొలిసారిగా ఒక గిరిజన మహిళ అత్యున్నతమైన రాష్ట్రపతి పదవిని అలంకరించడం ముమ్మాటికీ చరిత్రాత్మకమే. భారత ప్రజాస్వామ్యం ఎంత పటిష్టమైనదో, పారదర్శకమైనదో ఈ ఎన్నిక ద్వారా రుజువు అయింది. ముర్ము విజయం దేశంలో వెనుకబడిన ప్రజలవిజయం. సాధికారత కోసం దశాబ్దా లుగా పోరాడుతున్న మహిళల విజయం. ప్రధాన మంత్రిగా ఎనిమిదేళ్ళ క్రితం నరేంద్ర మోడీ ప్రధానమం త్రి పదవిని చేపట్టినప్పుడు ఒక సామాన్యుడు అత్యున్నత పదవిని అధిష్టించినప్పుడు భారత దేశంలో కాబట్టి సాధ్యమైందనీ, ఇదే భారత ప్రజాస్వామ్యం గొప్పదనమని యావత్‌ ప్రపంచ దేశాలూ ప్రశంసించాయి. ఒక గిరిజ న మహిళ రాష్ట్రపతి కావడానికి ఆయనే కారకుడు కావడం ఇంకా గొప్ప విషయం. ఒక చాయ్‌వాలా ప్రధాన మంత్రి కావడం భారత దేశంలోనే సాధ్యమైందని మోడీయే స్వయంగా పలు సందర్భాల్లో చెప్పుకున్నారు. అలాగే, ఇప్పుడు రాష్ట్రపతి పదవీ బాధ్యతలను స్వీకరిం చబోతున్న ద్రౌపది ముర్ము బాగా వెనుకబడిన ప్రాంతంలో ఒక స్కూల్‌ టీచర్‌గా జీవితం ప్రారంభించారు. ఆమె స్వయం కృషితో విద్యా, ఉద్యోగ రంగాల్లో అంచలంచెలుగా ఎదిగారు.

ఆమె ప్రతిభను గుర్తించి ఆమె గూడెం ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. గిరిజన సమస్యలపై ఆమెకు ఉన్న అవగాహన అపూర్వం. రాజకీయాల్లో కూడా ఆమె తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఒడిషాలో బిజూ జనతాదళ్‌-బీజేపీ సంకీర్ణమంత్రివర్గంలో మంత్రి పదవిని నిర్వహించి తమ ప్రాంతంలో గిరిజనుల విద్యా, ఉద్యోగాభివృద్దికి ఎంతో కృషి చేశారు. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న మయూర్‌ భంజ్‌ జిల్లా రాష్ట్రం లో బాగా వెనుకబడిన జిల్లా, ఒడిషాలోనే కాకుండా, ఉత్త రాంధ్ర, తెలంగాణ, జార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌లకు విస్తరించి ఉన్న గిరిజన ప్రాంతాల ప్రతినిధిగా ఆమె తరచు కేంద్రానికి తమ ప్రాంత సమస్యలను నివేదించేవారు. ఆ విధంగా ఆమె ప్రధానమంత్రి నరేంద్రమోడీ దృష్టిని ఆకర్షించారు. ఆమె జార్ఖండ్‌ గవర్నర్‌గా పని చేసినప్పుడు అక్కడి గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేసి వారి అభిమానాన్ని చూరగొన్నారు. ఆమె బీజేడీ నేతృత్వం లోని సంకీర్ణ మంత్రివర్గంలో పని చేసిన బీజేపీ నాయకు రాలైనా, ఆ ప్రాంతంలో అన్ని వర్గాలతో సన్నిహిత సంబంధాలను ఏర్పరుచుకున్నారు. గిరిజన సమస్యలపై నే కాకుండా వెనుకబడిన వర్గాల సమస్యలపై సంపూర్ణ అవగాహన కలిగిఉండటం వల్లనే ఆమెను రాష్ట్రపతి పదవికి ఎన్‌డిఏ అభ్యర్ధిగా ఎంపిక చేయగానే అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తం అయింది.

మహిళా సమస్య లపై కూడా ఆమె పోరాడారు. మహిళలు విద్య ద్వారానే రాణించగలరని ఆమె గట్టిగా విశ్వసించారు. ఆడపిల్లల చదువు విషయంలో గిరిజన ప్రాంతాల్లో ఉన్న కట్టుబాట్లు, ఆచారాలను ఎదిరించి బాలికల విద్యాభ్యాసానికి ఎంతోతోడ్పడ్డారు. ఆమె రాష్ట్రపతి కావడంతో తమ ప్రాంతంలో సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఆనందంలో సంతాల్‌ ప్రాంత గిరిజనులు పండుగ జరుపుకుంటున్నారు. గిరిజనులంతా వెనుకబడిన వారు కారు. వారిలో తరతరాలుగా మూలికావైద్యం చేసే వారున్నారు. అలాగే, తమ ప్రాంతంలో పాలనా వ్యవహారాల గురించి విశేషంగా ఆసక్తి, అధ్యయనం చేసినవారున్నారు. తెలంగాణ ప్రాంతంలో ఆదిలాబాద్‌ జిల్లాలో గోండులు రాజ్యాధికారాన్ని వందల సంవత్సరాల పాటు సాగించారు. అయితే, ప్రజాస్వామ్య విధానాల ద్వారా కాకుండా సాయుధ పోరాటం ద్వారానే సమస్యలను పరిష్కరించుకోగలమని నమ్మినవారున్నారు. అలాంటి వారిని వామపక్ష తీవ్రవాదులు ఆకర్షించి హింసా మార్గం వైపు మళ్ళించారు. నిజానికి గిరిజనులు హింసాయుత విధానం కలవారు కాదు. అడవులలో క్రూర మృగాలు, జంతువుల బారి నుంచి ఆత్మరక్షణ కోసం విల్లంబులు కలిగి ఉంటారు.

గిరిజన ప్రాంతంలో ఆదివాసుల అమా యకత్వాన్ని ఆసరాగా తీసుకుని మైదాన ప్రాంతం నుంచి వెళ్ళిన వారు, కాంట్రాక్టర్లు, భూస్వాములు వారిని దోపిడీ చేయడంతోవారు వామపక్ష తీవ్రవాదుల వలలో పడ్డారు. ఆదివాసులన్నా, గిరిజనులన్నా ఒక్కటే. అయితే, వారిలో తెగలున్నాయి. వారిలో అవిద్య కారణంగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకపోవడం వల్ల, ఏళ్ళుగా దోపిడీకి గురి అవుతున్నందున ఇతర ప్రాంతాల నుంచి వెళ్ళినవారిని ఓ పట్టాన నమ్మరు. వారికి పటిష్ట మైన నాయకత్వం ఉంటే వారిలో కూడా ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం పెరుగుతుంది. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించనున్న ద్రౌపది ముర్ము గిరిజనుల్లో ప్రజాస్వామ్య భావవీచికలను ప్రసరింపజేయడానికి కృషి చేస్తారని ప్రధానమంత్రి గట్టిగా విశ్వసిస్తున్నారు. గిరిజన ప్రాంతా ల సమగ్రాభివృద్ధి సంస్థల ద్వారా కేంద్రం కేటాయించే నిధులు గిరిజనులకు నేరుగా చేరేట్టు చేయగలిగితే ముర్మును ఎంపిక చేసిన పరమార్ధం నెరవేరినట్టే.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement