Tuesday, May 21, 2024

నేటి సంపాద‌కీయం – హ‌ద్దులు దాటుతున్న ప్ర‌చారం…

ఎన్నికల ప్రచారంలో వివిధ పార్టీల అభ్యర్ధులు, వారి తరఫునాయకుల మాటలు కోటలు దాటడం సర్వసాధారణమే. అలవి కాని వాగ్దానాలు చేయడమూ కొత్త విషయం కాదు. కానీ, ఇటీవల ఎన్నికల ప్రచారంలో వ్యక్తిగత దూషణలు, ద్వంద్వార్ధాలతో, నర్మగర్భమైన వ్యాఖ్యలు వినాల్సి రావడం భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి కోణం. ఇప్పుడు నాలుగు రాష్ట్రాల శాసనసభలకూ,పుదుచ్చేరి అసెంబ్లికీ జరుగుతున్న ఎన్నికలకు ప్రచారంలో తమిళనాడులో అభ్యర్ధులు చేస్తు న్న వాగ్దానాలు ప్రజలను కోటీశ్వరులను చేస్తున్నాయి. చంద్రమండలంలోకి తీసు కుని వెళ్తున్నాయి. అవి ఉత్తుత్తి వాగ్దానలన్న సంగతి ఓటర్లకూ తెలుసు. అందుకే, వాటిని వారు సీరియస్‌గా తీసుకోవడం లేదు. జోక్‌లుగా పరిగణిస్తున్నారు. పశ్చిమబెంగాల్‌ ప్రచారంలో అన్ని పార్టీల నాయకులు చేసుకుంటున్న విమర్శలు సూదంటు రాళ్ళలా ఉన్నాయి. ఈ ఎన్నికల్లోమరోసారి హ్యాట్రిక్‌ సాధించాలని ప్రస్తుత ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మమతాబెనర్జీ ప్రచార సరళిలో అతిని ప్రదర్శిస్తున్న మాట నిజమే, ఆమెపై విమర్శలు చేయడంలో ప్రత్యర్ధులు సంయమనాన్ని కోల్పోతున్నా రేమోననిపిస్తోంది. తనను రెచ్చగొట్టడం వల్లనే ఆమె బీజేపీ నాయకులపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు.నిజానికి బెంగాల్‌ ఎన్నికల షెడ్యూలు ప్రకటన ముందు నుంచి కేంద్రంలో దర్యాప్తు సంస్థలుఆమె ప్రభుత్వంలో ప్రముఖుల పై కేసులు నమోదు చేయడం, లొంగిన వారిని తమ పార్టీలోకి ఆహ్వానించడం ప్రారంభించారు. కాంగ్రెస్‌ హయాంలో జరిగిందే ఇప్పుడు జరుగుతోందని జనం అనుకున్నారు. అంతటితో ఆగకుండా నామినేషన్‌ వేసిన సందర్భంగా కాలుకి తగిలిన గాయాన్ని సానుభూతి కోసం ఉపయోగించుకోవాలని ఆమె ప్రయత్నిస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. అలా ప్రయత్నించిన రాజకీయ నేతలు గతంలోనూ ఉన్నారు.వారిలో ప్రముఖులు కూడా ఉన్నారు. అవన్నీ ఏకరవు పెట్టడం కన్నా, ప్రస్తుత పరిస్థితిని గురించి మాట్లాడుకోవడం మంచిది. మమతా బెనర్జీ చక్రాల కుర్చీలో ప్రచారం సాగిస్తున్నారు. ఆమె కాలికి తగిలిన గాయం పెద్దదా, చిన్నదా అనేది వైద్యులు నిర్ణయిస్తారు తప్ప ప్రత్యర్ధులు కాదు. అయితే, ఆమె తన గాయం గురించి ఆమె రాద్ధాంతం చేస్తున్నారంటూ ప్రత్యర్ధులు ఆరోపిస్తున్నారు. ఇందులోఅసహజమేమీ లేదు.ఆమె కూడా అంతకు రెట్టింపైన స్థాయిలో విమర్శలుచేస్తున్నారు. నందిగ్రామ్‌లో పోటీ చేసేందుకు నామి నేషన్‌ వేసినప్పుడు ఆమె స్థానికురాలు కాదనే వివాదాన్ని ఒకప్పటి ఆమె సహచరుడు, ప్రస్తుత ప్రత్యర్థి సువేందు అధికారి లేవనెత్తారు. దాంతో ఆమె తనను గద్దె దించడానికి బయటి నుంచి నాయకులంతా కట్టకట్టుకుని వస్తున్నారంటూ ఆమె ప్రత్యారోపణ చేశారు. ఎన్నికల ప్రచారంలో దేశంలో బయటవారెవరూ ఉండరంటూ ప్రధాని మోడీ బదులు ఇచ్చారు. ఇది సబబుగానే ఉంది. కానీ, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ చేసిన వ్యాఖ్యమాత్రం ఆమెను అవమానించే రీతిలోనే ఉంది. సంస్కృతి, సంప్రదాయాలను గౌర వించే మన దేశంలో ఒక మహిళపై వ్యాఖ్య చేసేటప్పుడు చాలా జాగ్రత్త పాటించాలన్న విషయాన్ని ఆయన విస్మరించారు. ఆమె తన కాలు గాయం పూర్తిగా తగ్గేవరకూ చీరకు బదులు నిక్కర్లు వేసుకోవాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలో దురుద్దేశ్యం లేకపోవచ్చు కానీ, వ్యంగ్యం ఉంది.అది పెడర్ధానికి దారి తీస్తుంది. అలాగే, బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా బెంగాల్‌లో తొలిసారి పర్యటించిన సందర్భంగా ఆమె, చెడ్డా, ఫడ్డా, నడ్డా వస్తూ, పోతుంటా రంటూ చేసిన వ్యాఖ్యలో వ్యంగ్యం కన్నా అవమానం ఎక్కువగా ఉంది. ఎన్నికల సందర్భం గా ఇలాంటివన్నీఎవరూ పట్టించుకోరని జనం వాదించవచ్చు. కానీ, ప్రచారంలో హద్దులు మీరకూడదనే సంప్రదాయాన్ని ఇరువర్గాలూ మీరుతున్నాయని చెప్పడానికి ఈ ఉదాహర ణలు చాలు.నాయకులు ఏం మాట్లాడినా తమకు మేలు ఏం చేశారనే దానిని బేరీజు వేసుకుని ఓటర్లు తీర్పు ఇస్తారు.అంతమాత్రాన పరిధులు దాటడం మంచిది కాదు. అది తాము ప్రాతి నిధ్యం వహిస్తున్న పార్టీలకూ మంచిది కాదు. ఇచ్చిన వాగ్దానాలను ఎవరెంతవరకూ అమ లు జేశారనే అంశాన్నే ప్రజలు పరిగణనలోకి తీసుకుంటారు.విశ్వసనీయత అంటే అదే. విశ్వసనీయతను పొందిన వారే ప్రజల తీర్పులో గెలుపొందుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement