Sunday, April 28, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం

111. దురమున్ దుర్గము రాయబారము మదిన్ దొంగర్కమున్ వైద్యమున్
నరనాథాశ్రయ మోడబేరమును పెన్మంత్రంబు సిద్ధించినన్
అరయం దొడ్డ ఫలంబు గల్గునది గాకా కార్యమె తప్పినన్
సిరియుం బోవును బ్రాణహానియు నగున్ శ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం: శ్రీకాళహస్తీశ్వరా!, అరయన్-విచారించి చూడగా, దురమున్- యుద్ధాన్ని, దుర్గము- కోటయు, రాయబారము- మధ్యవర్తిత్వం, మరి-ఇంకా, దొంగర్కము-దొంగతనమూ, వైద్యము-భేషజమూ, నరనాథ- ఆశ్రయము- రాజుల నాశ్రయించటం, ఓడబేరము- నౌకావ్యాపారం,పెన్ మంత్రంబు- గొప్పమంత్రం, సిద్ధించినన్-సఫలమైనట్లయితే, దొడ్డఫలంబు- గొప్పఫలితం, కల్గున్- కలుగుతుంది?, అదికాక-ఆ విధంగా కాక, ఆ కార్యము- ఆపని, తప్పినన్- సిద్ధించక పోయినట్లైతే/ లోపం జరిగితే, సిరియున్- ధనము కూడా, పోవున్- తొలగిపోతుంది, ప్రాణహానియున్- ప్రాణనష్టం కూడా, అగు- అవుతుంది.
తాత్పర్యం: శ్రీకాళహస్తీశ్వరా! యుద్ధం, కోట, మధ్యవర్తిత్వం, దొంగతనం, వైద్యవృత్తి, రాజాశ్రయం, నౌకావ్యాపారం, గొప్పమంత్రరాజం వంటివి సరిగా ఫలిస్తే, చాలా గొప్పగా ఉంటుంది ఫలితం. లేక ఏ మాత్రం తేడా వచ్చినా ఆ పని చెడిపోవటమే కాదు ధనహాని, ప్రాణహాని కూడా కలుగుతుంది. ధనార్జనకై చేసే ఈ పనులు ఎంత లాభదాయకాలో, అంతటి ప్రమాదకరాలు.
విశేషం: “మననాత్ త్రాయతే ఇతి మంత్రః” మననము చేయగా, చేయగా రక్షించేది అని అర్థం.
పైన చెప్పిన వన్ని వెంటనే సత్ఫలితాల నిస్తాయి. ఏ మాత్రం లోపం జరిగినా అంతటి దుష్ఫలితాలే ప్రాప్తిస్తాయి. శివారాధనలో ఎటువంటి తేడాలు వచ్చినా హాని ఏ మాత్రం ఉండదు. శివుడు తమోగుణప్రధాను డైనా భక్తుల పట్ల సాత్వికుడు. ఎందుకంటే భక్తి సాత్వికం కదా!

డాక్ట‌ర్ అనంత ల‌క్ష్మి
Advertisement

తాజా వార్తలు

Advertisement