Sunday, May 5, 2024

తెలుగు కవుల చింతనలో పరమాత్మ స్వరూపం!

కనుచూపు మేరలో ఎక్కడా పచ్చదనం అంటూ లేకుండా, కేవలం రాళ్ళూరప్పలతో నిండివున్న ప్రదేశంలో నడుస్తూ ఉండగా, అకస్మాత్తుగా రెండు రాళ్ళ మధ్యలో పేరుకుని వున్న మట్టిలోంచి ఒక చిన్న మొక్క ఎదిగి ఉండి పచ్చని ఆకులతో, చివరన, ఆకాశంలో సూర్యుని వైపు కృతజ్ఞతతో చూస్తున్నట్లుగా వున్న, పూవుతో కళకళలాడుతూ కనపడుతుంది. ఒక్క క్షణం అక్కడే నిలబడి ఆ మొక్క వైపుకు, పూవు వైపుకు ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోవడం అప్పుడు మనవంతౌతుంది. ఏమాత్రమూ నీటి చెమ్మ తగలని భూ భాగంలో నడుస్తున్నామనుకుంటూ ఉండగా కంటపడిన ఈ విచిత్రానికి ఏమని సమాధా నం చెప్పుకోవాలో అర్థంకాదు. సృష్టికి మూలకారణమైన ఆదిమ శక్తి రూపం కనుల ఎదుట కోరుకోకుండానే ప్రత్యక్షమైన అనుభూతి అప్పుడు కలుగుతుంది. ఈవిధమైన అనుభూతినే పరమాత్మ స్వరూపం దర్శించే అవకాశం దొరికినప్పుడు కలిగే అనుభూతిగా చెప్పుకోవ చ్చు. చాలా ఎక్కువ సార్లు ప్రకృతిలో ప్రత్యక్షమయ్యే చిన్నచిన్న మార్పులే పరమాత్మ స్వరూ పాన్ని కనుల ముందుపరుచుకునేలా చేసే సామర్ధ్యం కలిగినవిగా ఉంటాయి. ప్రకృతి ప్రసా దించే పరమాత్మ స్వరూపపు అనుభవాలను ఆధారం చేసుకునే పలువురు కవులు పరమాత్మ స్వరూపాన్ని తమ కావ్యాలలోని పద్యాలలో వర్ణించారు.

చం. అనలుని యందు నుష్ణగుణ మర్కునియందుఁ దగంజగత్ప్రకా
శనరుచి యిందునందు నతి శైత్యము నిత్యము గాఁగ వాయునం
దును బల ముర్వియం దరయ ధూర్వహనోన్నత శక్తి యేమహా
త్ముని కళలయ్యె నయ్యనుపముం బరమేశ్వరుఁడండ్రు పండితుల్‌. (ప్రథమాశ్వాసం 262వ పద్యం)

దంతులూరి బాపరాజు కవి రచించిన ‘మూర్తి త్రయోపాఖ్యానం’లోని పైపద్యంలో ”అగ్నియందు వేడిమి, సూర్యుని యందు స్వయం ప్రకాశత్వం, చంద్రుని యందు చల్లద నం, వాయువునందు బలము, భూమియందు ఎంత బరువునైనా మోసే శక్తి… ఇవన్నీ ఏ మహాత్ముని క్రియాశీలత వలన సాధ్యమైనాయో ఆయననే పరమేశ్వరుడు అని తెలిసిన వాళ్ళు పిలుస్తారు.” అని పరమాత్మ స్వరూపాన్ని నిర్వచించడం జరిగింది. ఇంచుమించుగా ఇదే భావాన్ని మడికి సింగన ‘వాసిష్ఠరామాయణం’ కావ్యంలో, చేతననే పరమాత్మ స్వరూ పంగా చెప్పడానికి ఉదా#హరణలుగా తీసుకుని చెప్పాడు.

తే.గీ. ఒనర దీపంబుననువెలుఁగున్నయట్లు,
పువ్వు గలుగంగఁ దావియుఁ బొలుచునట్లు,
సూర్యుఁ డుండంగఁ బగ లగుచున్నయట్లు,
చిత్తు గలుగంగ జగములు చెలగుచుండు.
(తృతీయాశ్వాసం, 56 పద్యం)

”ఒక దీపంలో వెలుగు ఎలా నిక్షిప్తమై ఉంటుందో, పువ్వుతోపాటుగా పరిమళం ఎలా గైతే అంటిపెట్టుకునే ఆవిర్భవిస్తుందో, సూర్యుడు ఉండగా ఎలాగైతే ప్రకృతిలో శక్తిని నింపే పగలు ప్రభావవంతమై ఉంటుందో, అలాగే జాగృతమైన చేతన ఎక్కడైతే ఉంటుందో అక్కడ జగత్తు కూడా జాగృతమై ఉంటుంది. కనుక జాగ్రదావస్థలో ఉన్న చేతనయే జగత్తు అన్నది ఇందులో సారాంశంగా చెప్పబడిన విషయం. ఈ ఆలోచనతోనే, పరమాత్మ తత్త్వాన్ని మని షికి గ్రహంపుకు తెచ్చే ఉద్దేశ్యంతో రచించబడే ప్రతి రచన కూడా సరైనదే అయివుండి మనిషి ని ఒకే వైపుకు, అంటే ఆ పరమపురుషుడైన శ్రీహరి వైపుకు, నడిపించేదిగా వుంటుంది” అని చెప్పాడు దంతులూరి బాపరాజ కవి ‘మూర్తిత్రయోపాఖ్యానము’ కావ్యంలోని ఈ క్రింది పద్యంలో-

- Advertisement -

తే.గీ. కృతుల చేత యథారుచి కృతములైన
యాగమంబు లభిన్నంబులగు ననేక
పథము లన్నియుఁ జెందు నా పరమపురుషు
నఖిల సలిలౌఘములు వార్ధి నంటు కరణి.
(ప్రథమాశ్వాసం, 263వ పద్యం)

”ఎలాగైతే, చిన్నదైనా పెద్దదైనా ప్రవ#హంచే ప్రతి నది కూడా ఆ సముద్రుని వైపుకు దారి తీసేదిగా ఉంటుందో అలా, పరమాత్మను గురించి తెలియజెప్పే వివిధ దృష్టాంతములతో కూర్చి చేయబడిన చిన్న పెద్ద రచనలనే బేధం లేకుండా అన్నీ ఆ పరమ పురుషునకే చెందుతా యి” అని భావం.
చదువు లేదా విద్య అనేది ఎందుకు? అంటే ప్రథమంగా ‘భుక్తి మార్గం వెదుక్కోవడా నికి!’ అని సమాధానం దొరుకుతుంది. ఒక ఉద్యోగం దొరికి సంపాదన మార్గం కనపడగానే చదువు మూలన పడిపోతుంది. ఆ విధమైన చదువుకు ‘ఒక ఉద్యోగం దొరకడం’ అనేది హద్దుగా ఉంటుందని చెప్పడం సమంజసమైనదిగా తోస్తుంది. కాని, ‘విజ్ఞాన సముపార్జన’ అనే చదువుకు ఏది హద్దు? అని ప్రశ్నించుకుంటే ‘ఇక్కడితో ఆపెయ్యొచ్చు’ అని చెప్పడానికి ఏమి సమాధానం దొరుకుతుంది? ఏమీ దొరకదు. విజ్ఞానం అనేది అనంతం. కనుపర్తి అబ్బ యామాత్యుడు రచించిన ‘అనిరుద్ధ చరిత్రము’ కావ్యంలో ఈ సంగతినె సరళమైన భాషలో చెప్పి, అనంతమైన జ్ఞాన తృష్ణతో సొంతంచేసుకున్న ప్రతిభతో రచించిన కావ్యాన్ని పరమా త్ముడైన హరికి అర్పించడం ఉత్తమం అంటాడు ఈ క్రింది పద్యంలో.

కం. చదువులకు మేర యెయ్యది
చదివిన మాత్రంబె చాలు సరసవచస్సం
పదఁ దా నేర్చిన కొలఁదిని
యదనఁగవితఁ జెప్పి హరికి నర్పింపఁదగున్‌.
(ప్రథమాశ్వాసం, 15వ పద్యం)

అలా చదువగా చదువగా బుద్ధికి అలవడే ‘సరసవచస్సంపద’ వలన కవిత్వం చెప్పడం అలవడితే అది ఒక భాగ్యమే అవుతుంది. ఆ భాగ్యంతో చేయబడిన ప్రతి రచన పరమాత్ము డైన #హరికి సమర్పించడానికి తగినదై వుంటుంది- అని పై పద్యం భావం.

Advertisement

తాజా వార్తలు

Advertisement