Monday, April 29, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 18, శ్లోకం 63
63.
ఇతి తే జ్ఞానమాఖ్యాతం
గుహ్యాద్గుహ్యతరం మయా |
విమృశ్యైతదశేషేణ
యథేచ్ఛసి తథా కురు ||

తాత్పర్యము : ఈ విధముగా గుహ్యతరమైన జ్ఞానమును నీకు నేను వివరించితిని. దీనిని సంపూర్ణముగా విమర్శన కావించి, పిదప తోచిన రీతి చేయుము.

భాష్యము : ఇంతకు ముందు ‘బ్ఱహ్మభూత’ స్థితిని గురించిన జ్ఞానమును తెలియజేయగా ఇప్పుడు ‘పరమాత్మ’ ను గురించిన జ్ఞానమును తెలియజేసి ఇది దాని కంటే గుహ్యతరమైనది అని శ్రీకృష్ణుడు తెలియజేయుచున్నాడు. అంతేకాక అర్జునున్ని ‘యథేచ్చసి తథా కురు’ అనగా ‘నీకు నచ్చిన విధముగా చేయుము’ అని స్వేచ్ఛను ఇచ్చెను. అనగా భగివంతుడు ఎప్పుడూ జీవరాశి యొక్క కొద్దిపాటి స్వేచ్ఛను అతిక్రమించడు. శ్రీ కృష్ణుడు భగవద్గీత అంతటా జీవుడు తన స్థితిని ఎలా మెరుగుపరచుకోవచ్చో వివరించి యున్నాడు. అందు పరమాత్మ సూచనలను పాటించటం ఉత్తమమని తెలియజేసినాడు. భగవంతుడే స్వయముగా అర్జునున్ని యుద్ధము చేయమనుచున్నాడు కాబట్టి అంతకు మించిన మార్గము ఉండదు. భగవంతుని సూచనలు మన మేలు కొరకే గాని, భగవంతుని స్వార్థము కొరకు కాదు. అయినప్పటికీ అటువంటి ఆదేశములను పాటించే మంఉదు తమ బుద్ధితో విచారణ చేసి నిర్ణయమును తీసుకొను అవకాశము అందరికీ ఇవ్వబడుతుంది. అటువంటి సూచనలు భగవంతుని ప్రతినిధి అయిన గురువు ద్వారా కూడా ఇవ్వబడతాయి.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement