Thursday, May 16, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 14, శ్లోకం 27
27.
బ్రహ్మణో హి ప్రతిష్ఠాహమ్‌
అమృతస్యావ్యయస్య చ |
శాశ్వతస్య చ ధర్మస్య
సుఖస్యైకాంతికస్య చ ||

తాత్పర్యము : అమృతమును, అనశ్వరమును, శాశ్వతమును, చరమసుఖపు సహజస్థితియును అగు నిరాకాబ్రహ్మమునకు నేను మూలాధారమును.

భాష్యము : బ్రహ్మము, ఎప్పటికీ తరిగిపోనిదై, అమృతత్త్వాన్ని, శాశ్తతత్త్వాన్ని మరియు అత్యున్నత ఆనందమయ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఆత్మ సాక్షాత్కారములో మొదటి మెట్టు కాగా, పరమాత్మానుభూతి, భగవదానుభూతి పరమ సత్యాన్ని అర్థము చేసుకోవటంలో ఉన్నత స్థాయిలై ఉన్నాయి. భగవంతుని వివిధ శక్తులలో నిమ్న శక్తియైన భౌతిక ప్రక ృతిలో, ఉన్నత శక్తి అయిన జీవరాశులను ప్రవేశపెట్టుట ద్వారా ఈ సృష్టి ఆరంభమవుతుంది. జీవుడు భౌతిక ప్రకృతిని అనుభవించాలనుకోవటం వలన బంధీ అవుతాడు. ఆధ్యాత్మిక జ్ఞానమును అభ్యసించుట ద్వారా చైతన్యము ఉద్ధరింపబడి ‘బ్రహ్మ’ స్థితికి చేరుకుంటాడు. ఇది భౌతిక స్థితికి అతీతమైన ఆధ్యాత్మిక స్థితి అయినప్పటికీ ఇది కేవలము మొదటి మెట్టు మాత్రమే. చతుష్కుమారులైన సనక సునంద నాదులు కూడా ఈ స్థితి నుండి భగవద్భక్తికి ఆకర్షితులై ఉంటిరి. ఈ బ్రహ్మ స్థితి నుండీ ముందుకు పురోగతి చెందనిదే వారు మరలా తిరిగి పతనము చెందే అవకాశము ఉందని శాస్త్రాలు తెలియజేయుచున్నవి. ఎందువలననగా భగవంతుని పాదపద్మాల పట్ల ఆసక్తిని పెంపొందించుకోనంత వరకూ బుద్ధి స్పష్టత లోపిస్తుంది. రాజు యొక్క సేవకుడు సైతమూ రాజప్రాసాదాలను అనుభవించునట్లు భగవంతుని భక్తుడు సైతము భగవంతుని వలే శాశ్వత ఆనందత్వాన్ని, అవ్యయత్వాన్ని, శాశ్వత జీవితాన్ని అనుభవిస్తాడు. కాబట్టి బ్రహ్మము లక్షణాలు భగవద్భక్తుడు పొంది ఉంటాడని అర్థమవుతుంది. ఈ సులభమార్గమే ఈ అధ్యాయమున 22వ శ్లోకము నుండీ చివరి వరకూ వివరింపబడినది.

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతా సూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
గుణత్రయవిభాగయోగో నామ చతుర్ధశోధ్యాయ: ||

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement