Wednesday, May 1, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 3, శ్లోకం 5
05
న హి కశ్చిత్‌ క్షణమపి
జాతు తిష్ఠత్యకర్మకృత్‌ |
కార్యతే హ్యవశ: కర్మ
సర్వ: ప్రకృతిజైర్గుణౖ: ||

తాత్పర్యము : ప్రతి మానవుడును భౌతిక ప్రకృతి వలన తాను పొందినటువంటి గుణము ననుసరించి అవశుడై కర్మయందు ప్రేరింపబడును. కావున ఏదియును చేయకుండ క్షణకాలము కూడా ఎవ్వరును ఉండజాలరు.

భాష్యము : ఆత్మయొక్క స్వభావము ఎల్లప్పుడూ ఏదో ఒకకార్యములో నిమగ్నమగుట. ప్రస్తుతము బద్ధజీవనములో త్రిగుణాలతో సంపర్కములో నుండుట వలన కార్యములు చేసిన కొద్దీ బంధనము ఇంకా పెరుగుచునే ఉండును. కావున శాస్త్రాలలో ఇవ్వబడిన విద్యుక్త ధర్మములను పాటించి పవిత్రీకరణము చెందవలసి ఉన్నది. సన్యాస ధర్మము కూడా అటువంటి పవిత్రీకరణలో భాగమే. చివరకు ఆ విధములైన పవిత్రీకరణ ధర్మములన్నీయును భగవత్సేవకు దారి తీసి జీవికి శాశ్వత ఫలితాన్ని చేకూర్చాల్సి ఉంది. అట్టుకాని యెడల అటువంటి ధర్మాలను అనుసరించుట నిష్పలమే కాగలదు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement