Monday, May 6, 2024

ధర్మం – మర్మం : ఋషిప్రబోధములు (ఆడియోతో…)

మహాభారతం శాంతిపర్వంలోని సుభాషితంపై శ్రీమాన్‌ శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వివరణ..

ఆచారాత్‌ లభతే ఆయు: ఆచారాదీప్సితా: ప్రజా:
ఆచారాత్‌ ధన మక్షయ్యం ఆచారోహంత్య లక్షణమ్‌

ఆచారం వలన ఆయుష్యం లభించును. ఆచారం వలన కోరుకున్న రీతిలో సంతానం లభించును. ఆచారంతో తరగని సంపద చేకూరును, ఆచారము అన్ని దుర్లక్షణాలను నశింపచేయును.

ఆచారాము అనగా నియమబద్ధమైన ప్రవర్తన. ఉదయం లేచిన పిదప ముఖ ప్రక్షాళానాదులు చేసుకొని, పవిత్రమైన జలములో స్నానమాచరించి పరిశుద్ధమైన వస్త్రములు ధరించి తాము నమ్మిన దైవాన్ని తమకు లభించిన సమయంలో ఆరాధించవలెను. పరి శుద్ధమైన వాతావరణంలో మరియు ప్రదేశంలో పరిశుద్ధమైన వారు తయారు చేసి మంచి ఆహారాన్ని రోజుకు రెండు మార్లే స్వీకరించాలి. నిలబడి, నడుస్తూ, మాట్లాడుతూ, కలహిస్తూ కాకుండా చక్కగా కూర్చొని ఆహారం స్వీకరించాలి. ఈవిధంగా నియమపూర్వక ప్రవృత్తి, వస్తుశుద్ధి, వ్యక్తి శుద్ధి, దేహశుద్ధి, పరిసర శుద్ధి, పరిశుద్ధులైన వారితో కలిసుండుట ఆచారము అనబడును. ఇటువంటి ఆచారమును అవలంభించిన వారికి అనారోగ్యమునకు అవకాశం ఉండదు కావున ఆయుష్యము పెరుగును.

సంసారిక జీవ నమును కూడా నియమబద్దముగా గడిపిన వారికి మనసు, బుద్ధి, ఆవేద, ఉద్రేక రహితంగా కోరుకున్న సంతానం లభిస్తుంది. శరీరము, మనసు, బుద్ధి, వాక్కు, ఆచారముతో మన వశములో ఉండును. ఈ విధంగా వశములో ఉన్న ప్రవర్తన కలవారికి తరగని ధనం కూడా లభించును. ఇన్ని లభించినపుడు అవలక్షణాలు ఉండవు కావున ఆచారం అవలక్షణాలను తొలగిస్తుంది.

- Advertisement -

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement