Saturday, May 4, 2024

ఆనందమయం ఆధ్యాత్మికం

”దేహంలో ఉన్నంత కాలం మనకు సందేహాలు తప్పవు. సందేహాల భోషాణమే మానవ జీవితం” అన్నా రో మహనీయుడు. నిజానికి కొన్ని సందేహాలు గొప్పగా ఉంటాయి. కొన్ని సందేహానికి సమాధానమిస్తాయి.
ఉదాహరణకు ”కలడు కలండనెడు వాడు కలడో లేడో?” అని గజేంద్రునికి వచ్చిన సందేహం, ఆర్తితో పిలిస్తే భగవంతుడు తప్పకుండా వస్తాడు, మనల్ని కాపాడతా డు అనే సందేశాన్ని మానవాళికి అందించింది. అదే రకం గా ఈ స్తంభంలో నీ హరి ఉన్నాడా? అనే హరణ్యకశిపుని సందేహం, అచంచలమైన విశ్వాసం కలిగి ఉంటే భగవం తుడు ఎక్కడైనా ఎందులోనైనా ఉంటాడు, దర్శనమిస్తా డనే సందేశం జగతికి పరోక్షంగా అందించింది. అదొక ఆధ్యాత్మిక సదస్సు. ఆ రోజు సదస్సు ఆఖరి రోజు. ఆధ్యా త్మికానికి సంబంధించిన లోతైన ఎన్నో విషయాలను శిష్యులు గురువు గారిని అడుగుతున్నారు. శిష్యుల సందే హాలను గురువుగారు నివృత్తి చేస్తున్నారు.
సనాతన తత్త్వానికి ఆధునికతను జోడించి, నిగూఢ మెన ఆధ్యాత్మిక విషయాలను వివరించటంలో గురువు గారు అందెవేసిన చేయి. వర్తమాన స్థితిగతులకు ఆధ్యా త్మికాన్ని అన్వయించి, విషయాన్ని అందరికీ అర్థమయ్యే రీతిన చెప్పటం గురువుగారి ప్రత్యేకత.
శిష్యుల సందేహాలు, సందేహాలకు గురువుగారి సమాధానాలు జీవిత సత్యాలను తెలుపుతాయి. ”దేవు డు ఎక్కడుంటాడు?” శిష్యుల సందేహం.
”విశ్వాసానికి అవిశ్వాసానికి నడుమ ఊగుతుం టాడు.” ”దేవుడు ఏం చేస్తుంటాడు?” ”ద్వైతం అనిపించేలా ఉంటూ అద్వైతంగా అన్నింటినీ నడిపిస్తూ ఉంటాడు.” అని గురువు గారి సమాధానం.
”దేవుడు ఎలా ఉంటాడు?”
”అన్నీ… అంతా…అంతటా తానై నిలిచి ఉంటాడు.”
”దేవుడికి జీవుడికి ఉన్న సంబంధం ఏమిటి?”
”దేవుడి కోసం జీవుడు తపిస్తాడు. తపన పడతాడు. జీవుడి కోసం దేవుడు తపస్సై పోతాడు.”
ప్రతిరోజూ లాగే ఆ రోజూ ఓ శిష్యుడు ”స్వామీ! ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట ప్రవచనాలు, పురాణ కాల క్షేపా లు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతుంటాయి కదా. వాటి వలన మనకి వచ్చే లాభం ఏమిటి?”
ఈ ప్రశ్న సామాన్యమైనదిగా, సాదాసీదాగా అనిపిం చవచ్చు. తేలికైనదిగా కనిపించవచ్చు. విషయ లోతుల లోనికి వెళ్ళితే, లోతైన గాఢత దాగున్న ప్రశ్న ఇది.
గురువుగారు శిష్యుడిని చూసి చిరునవ్వు నవ్వి, ”వాటన్నింటి వలన వచ్చే లాభాల సంగతి అటుంచు. నువ్వు చెప్పిన ఆ ఆధ్యాత్మిక కార్యక్రమాలే లేవనుకో. సమ యాన్ని గడపటానికి అయినా, నువ్వు ఏదో ఒకటి చేయా లి. ఎక్కడికైనా వెళ్లాలి! ఉదా#హరణకు సినిమాకు వెళ్ళావ నుకుందాం. ప్రవచనానికి/ పురాణ కాలక్షేపానికి రానిచ్చే లా, సినిమాకి టిక్కెట్‌ లేకుండా రానీయరు. టిక్కెట్‌ కొనుక్కోవాలి అంటే కొంత డబ్బు ఖర్చు అవుతుంది. అది మొదటి నష్టం. సినిమాకు వెళ్ళావు కదా! ఖర్మకాలి ఆ సినిమా బాగులేదనుకో. తలనొప్పి వస్తుంది. అప్పుడు ఔషధ సేవనం చేయాలి. అది రెండో నష్టం. అదే ప్రవచన కార్యక్రమానికో/ పురాణ కాలక్షేపానికో వెళ్ళిపోతే, పైన చెప్పుకున్న నష్టాలు కష్టాలు తప్పుతాయి కదా! నష్టాలను తప్పిస్తే లాభమే కదా? అదే ప్రవచనం లేదా పురాణ కాల క్షేపం వలన లాభం. కాదంటావా?” అన్నారు.
ఆధ్యాత్మిక తత్త్వసారాన్ని ఆధునికతను జోడించి సరైన తర్కంతో మేళవింపు చేసి, సందేహాన్ని నివృత్తి చేసిన గురువుగారి ప్రజ్ఞాపాటవానికి, గురువు గారికి పాదా భివందనం చేసాడు శిష్యుడు.
జీవనంలో మిళితమైన చెడునూ అడ్డంకులనూ సాధ్యమైనంత నిర్మూలించుకోడానికి చేసే ప్రయత్నమే ఆధ్యాత్మిక సాధన ముఖ్యోద్దేశం. జీవితాలకు నష్టాలను కలిగించే విషయాలను సాధ్యమైనంత తగ్గించుకోవడమే ఆధ్యాత్మికత మూల సూత్రం. ఆధ్యాత్మిక సారాన్ని ఆధ్యా త్మిక తత్వంతోనే అన్వేషించాలి. ఆనందమయ ఆధ్యాత్మి కాన్ని ఆస్వాదించ గలగాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement