Sunday, April 28, 2024

పరాశక్తి స్వరూపం శ్రీచక్రం

ప్రపంచంలో వున్న కదలిక వెనుక శక్తి నిబిడీకృతమై వుంటుంది. కద లిక అంటే భౌతికమైనది మాత్రమే కాదు, మానసిక చలనం కూడా కదలికే. అందుకే కదలిక శక్తి- ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తిగా మూడు రకాలుగా వుంటుందని మన పురాణాలు పేర్కొన్నాయి.
ఏదైనా పని జరగాలంటే ముందు ఆ పని చేయాలనే కోరిక (ఇచ్ఛ) పుట్టాలి. అదే ఇచ్ఛాశక్తి. కోరిక కలిగాక ఆ పని ఎలా చేయాలో జ్ఞానం కలగాలి. అదే జ్ఞానశక్తి. ఇచ్ఛ, జ్ఞానం రెండూ వున్నాక పని జరగాలి. అదే క్రియాశక్తి.
ఈ ప్రపంచం మొత్తం ఒక కుండగా భావిస్తే దీన్ని సృష్టించేది సృష్టికర్త. ఆయన ‘సృష్టి’ స్పందనను పొందాలంటే ఈ మూడు శక్తుల కలయిక తప్ప దు. అంటే సృష్టి మొత్తం కూడా ఈ మూడు శక్తుల విపరిణామం. అందువల్ల నే, ఈ ప్రపంచంలోని ప్రతి అణువులోనూ, నిరంతర చలనశీలమైన శక్తి అపారరాశిని మనం దర్శించగలుగుతున్నాము. మనకు విజ్ఞానశాస్త్రం ద్వా రా కనిపించేదంతా క్రియాశక్తి రూపాంతరం. దీనివెనుక జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తు లు వున్నాయి. ఈ మూడూ కలిసిన సంపూర్ణశక్తే పరాశక్తి. ఈ జగత్తు మొత్తా నికి పరాశక్తియే తల్లి అని శాస్త్రాలు నిర్ణయించాయి. సాక్షాత్తు జన్మనిచ్చేది తల్లి. తండ్రికాదు. అందుకే శక్తిని జగన్మాతగా దర్శించారు మన మహర్షులు.
అందువల్లనే శంకరాచార్యులవారు ”శివశ్శ్యక్త్యాయుక్తోయది భవతి శక్త: ప్రభవితుం”’ అనే శ్లోకంలో ఆ శక్తిని హరిహర బ్రహ్మాదులంతా ఆరాధన చేస్తున్నారు అని చెప్పారు.
బ్రహ్మలో ఆ పరాశక్తి సృష్టిని కలిగిస్తోంది. విష్ణువులో అదే పరాశక్తి స్థితిని కలిగిస్తోంది. రుద్రుడిలో అదే పరాశక్తి సంహారాన్ని కలిగిస్తోంది. అందుకే, ఆ ముగ్గురూ కూడా ఆ శక్తిమాతనే ఆరాధిస్తున్నారు. అందుకే మనం కూడా ఆ తల్లినే ఆరాధిస్తున్నాము. అయితే, మనం శుద్ధ స్వరూపంలో శక్తిమాతను దర్శించలేము. ఊహించనైనా లేము. అందుకోసమే శక్తిమాత తన మొదటి రూపంగా శ్రీచక్రాన్ని నిర్మించింది. ఆ తర్వాత వివిధ దేవీరూపాలను స్వీకరిం చి మన ఉపాసనకు సౌలభ్యం కల్పించింది. శ్రీచక్రముతో సకల చరాచర జగ త్తునకు నామరూపములకు, పదార్థములకు సమన్వయం కలుగుతున్నది.
పరాశక్తికి శ్రీచక్రానికి ఏమాత్రం భేదం లేదు. శ్రీదేవియే శ్రీచక్రము. శ్రీమాత. శ్రీవిద్య. శ్రీచక్రములు వేరువేరు కాదని, ఈ మూడూ ఒకే పరబ్రహ్మ స్వరూపమని శ్రీలలితా సహస్రనామ స్తోత్రము తెలియచేస్తోంది.

శ్రీచక్ర నిర్మాణం

శ్రీ చక్రం బిందు స్వరూపం. అఖండమైన శక్తికి రూపకల్పన శ్రీచక్రం. గౌరీదేవి నవరత్న శ్రీచక్ర వాసిని. బీజాక్షర స్వరూపిణి. శ్రీచక్ర అధిష్ఠాన దేవత శ్రీ లలితాదేవి. ఆలయాల్లో ప్రధాన దేవతగా ఏ దేవత అయినా శ్రీచక్ర స్థాపన ఆచారంగా వచ్చింది. ‘శ్రీచక్రం’ అంటే విశ్వం. ‘మంత్రము’ అంటే సూక్ష్మరూ పిణి అయిన దేవతా స్వరూపం. ‘లలితా సహస్రనామ స్తోత్రం’ అనే మహా సౌధానికి మూలస్తంభం శ్రీచక్రార్చన.
‘శ్రీచక్రం’ ఒకేవిధంగా వుండదు. అయిదు రకాలుగా వుంటుంది.
1. మేరు 2. సుమేరు 3. భూప్రస్తార, 4. అర్థమేరు, 5. మహామేరు
ఈ అయిదింటి తత్వం ఒకటే. కాకపోతే, వాటిమీద వుండే అక్షరాలు వేర్వేరు, కోణాలు వేర్వేరు. ‘శ్రీచక్రం’ అంటే కేవలం సంపత్తిని, జనాకర్షణని మాత్రమే ప్రసాదించేది కాదు. నివృత్తిని, ప్రవృత్తిని రెంటినీ ప్రసాదిస్తుంది.
శ్లో|| బిందు త్రికోణ వసుకోణ- దశారయుగ్న
మన్వం శ్ర- నగదళ సంయుత – శోడశారం
వృత్తత్రయంచ- ధరణీ సదన త్రయంచ
శ్రీచక్ర మేతదుదితం- పరదేవతాయా:
శ్రీచక్రమందలి తొమ్మిది ఆవరణలు శరీరమందలి తొమ్మిది ద్వారము లకు ప్రతీకలు. శ్రీచక్రమే శరీరము. ప్రాణికోటికి శ్రీచక్రమే కాదు, శ్రీదేవి తనను తానే ప్రతిష్టించుకున్నది. షట్చక్రములపైన సహస్రారమున సహస్రదళ పద్మ మధ్యభాగమున, బిందురూపమున విరాజిల్లుతున్న చైతన్యస్వరూపిణి- యోగేశ్వరులు అంతరాంతరములలోని ఆనంద బిందువును చూసి, ఆనం దించటమే జీవిత పరమావధిగా భావిస్తారు.
బిందు త్రికోణము, అష్టకోణ చక్రము, అంతర్దశారము, బహిర్దశారమ ను దశత్రికోణ చక్రము. చతుర్దశారము, అష్టదళ పద్మము, షోడశదళ పద్మ ము, భూపురము అను తొమ్మిది ఆవరణములతో కూడినది శ్రీచక్రం.
శ్రీచక్రంలో వున్న మొత్తం త్రిభుజాల సంఖ్య 43. మొత్తం పద్మముల సంఖ్య 24. మొత్తము వృత్తముల సంఖ్య 7 (బిందువుతో కలిపి). ఈ శ్రీచక్ర ములోని తొమ్మిది చక్రములను (శివచక్ర, శక్తి చక్రములను) నవయోనులని వ్యవహరిస్తారు. త్రికోణ, అష్టకోణ, దశ కోణ ద్వయము, చతుర్దశ కోణములు ఐదు శక్తి కోణములు. బిందువు, అష్టదళము, షోడశ దళము, చతురస్రము అను నాలుగూ శివచక్రాలు. ఈ చక్రంలోని బహిర్దశార, అంతర్దశారములను కలిపితే శ్రీచక్రము అష్టాచక్రా అవుతుంది.
తొమ్మిది త్రికోణములలో నాలుగు శివాత్మకం. ఐదు శక్త్యాత్మకం. శ్రీ చక్రంలోని నవావరణములు ఆరోహణ క్రమంలో ఇలా ఉంటాయి.
భూపుర త్రయం- త్రైలోక్య మోహన చక్రం
షోడశ దళ పద్మం- సర్వాశా పరిపూర చక్రం
అష్టదళ పద్మం- సర్వ సంక్షోభిణి చక్రం
చతుర్ద శారము- సర్వ సౌభాగ్య చక్రం
బహిర్ద శారము- సర్వార్థ సాధక చక్రం
అంతర్దశారము- సర్వ రక్షాకర చక్రం
అష్ట కోణము- సర్వ రోగహర చక్రం
త్రికోణము- సర్వ సిద్ధిప్రదా చక్రం
బిందువు- సర్వానందమయ చక్రం
ఒక్కొక్క ఆవరణలోని దేవతలను సాక్షాత్కరించుకొనుటకు కొన్ని ప్రత్యేక బీజ మంత్రాలు వున్నాయి. ఇటువంటి శ్రీ చక్రోపాసనను మనువు, చంద్రుడు, కుబేరుడు, అగస్త్యుడు, లోపాముద్ర, అగ్ని, మన్మథుడు, సూర్యు డు, ఇంద్రుడు, శివుడు, స్కంధుడు, దూర్వాసుడు అనే పన్నెండుమంది పన్నెండు శాస్త్ర విధానములుగా ప్రవేశపెట్టినట్లు జ్ఞానార్ణవ తంత్రము తెలి యజేస్తున్నది. శ్రీచక్రంలో 54 స్త్రీలు, 54 పురుష అంతర్భాగాలు ఉంటాయి. మొత్తం 108 పాజిటివ్‌ నెగిటివ్‌ ఎనర్జీ కలిస్తే ఎనర్జీ. శక్తిని ఉత్పత్తి చేసే ప్రాచీన యంత్రం అది. శ్రీచక్రం ఇంట్లో ఉంటే నెగిటివ్‌ ఎనర్జీలను పాజిటివ్‌ ఎనర్జీగా మారుస్తుందని మన పెద్దల విశ్వాసం.

Advertisement

తాజా వార్తలు

Advertisement