Tuesday, May 14, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం

91
ద్వారద్వారములందు( గంచుకిజనవ్రాతంబుదండంబులన్
దోరంతఃస్థలిబగ్గనంబొడుచుచున్దుర్భాషలాడన్మఱిన్
వారి ప్రార్థన చేసి రాజులకు సేవల్సేయగా (బోరుల
క్ష్మీరాజ్యంబునుగోరి నీ పరిజనుల్శ్రీ కాళహస్తీశ్వరా!

ప్రతిపదార్థం:
శ్రీకాళహస్తీశ్వరా!, నీపరిజనుల్ – నీ దాసులు /నీ భక్తులు, లక్ష్మీ రాజ్యంబును – సంపదల వల్ల వచ్చే వైభవాన్ని, కోరి – వాంఛించి, ద్వారద్వారముల – అందున్ – ప్రతిద్వారం వద్ద, కంచుకి జనవ్రాతంబు – ద్వారపాలకుల సమూహం, దండంబులన్ – చేతికర్రలతో/లాఠీలతో, బగ్గు – అనన్ – భగ్గుమని మండేట్టు, దోరంతఃస్థలి (దోః్శ అంతస్థలి) – భుజాల మధ్యభాగమైన గుండెల మీద, పొడుచుచున్ – కొడుతూ, దుర్భాషల్ – ఆడన్ – తిడుతూ ఉండగా, వారెన్ – ఆ కావలివారిని, మఱిన్ – ఇంకా, ప్రార్థన చేసి – వేడుకొని, రాజులకున్ – చక్రవర్తులకి, సేవల్ – చేయగాన్ – దాస్యం చేయటానికి, పోరు – వెళ్లరు.

తాత్పర్యం:
శ్రీకాళహస్తీశ్వరా! నీ సేవకులు (నీ భక్తులు) సంపదల వల్ల వచ్చే వైభవాలని ఆశించి, ప్రతివారి వాకిలి ముందు ఉన్న ద్వారపాలకుల చేతికర్రలతో భగ్గుమని మండేట్టు ఛాతీల మీద కొడుతూ, తిడుతూ ఉంటే – వారినే ఇంకా ప్రాధేయపడుతూ రాజులకి దాస్యం చేయటానికి వెళ్లరు.

విశేషం:
ద్వారపాలకుల ఛీత్కారాలను, దెబ్బలను భరించటం లోకుల పద్ధతి. శివభక్తులది కాదు. వీరు సంపదలనే కోరరు. ఎందుకంటే మోక్షమే వారికి కరతలామలకం కనుక, ఈ సంపదలు వారికి తృణప్రాయాలు.

డాక్టర్ అనంతలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement