Friday, May 3, 2024

శ్రీకాళహస్తీశ్వరా శతకం

83.వేధందిట్టగ రాదు గాని, భువిలో విద్వాంసులంజేయ నే
లా ధీచాతురి( జేసిన గులా మాపాటనే పోక క్షు
ద్బాధాదుల్గలిగింప నేల? యదికృతంబైనదుర్మార్గులన్
ఛీ! ధాత్రీశుల( జేసె( జేయ నేటి కకటా! శ్రీకాళహస్తీశ్వరా!

ప్రతిపదార్థం :
శ్రీకాళహస్తీశ్వరా!, వేధన్ – బ్రహ్మను, తిట్టగరాదు – నిందించ కూడదు, కాని – అయినా, భువిలో – భూలోకంలో, విద్వాంసులన్ – పండితులను, చేయన్ – చేయటం, ఏలా – ఎందుకు?, ధీచాతురిన్ – తన బుద్ధి విశేషం చేత, చేసినన్ -చేసినా (పండితులను సృష్టించినా), ఆపాటనే – అంతమాత్రంతోనే, పోక – పోవక (ఊరకొనక), క్షుత్ – బాధ – ఆదుల్ – ఆకలి, దప్పిక మొదలైన శారీరకబాధలు. కలిగింపన్ – ఏల – కలిగించటం ఎందుకు?, అది – ఆ సృష్టించటం అన్నది, కృత్యంబు – ఐనన్ – చేయవలసిన పని/ విధ్యుక్తధర్మం, అయితే, ధాత్రి – ఈశులన్ – రాజులను, దుర్మార్గులన్ – దుష్ప్రవర్తనకలవారిగా, చేసెన్ – చేసెను, ఛీ! – అది చీదరించుకొన దగినది, అకటా! – అయ్యో!, చేయన్ – అట్లు చేయటం, ఏటికి – ఎందుకు?

తాత్పర్యం:
శ్రీకాళహస్తీశ్వరా! సృష్టికర్త అయిన బ్రహ్మను తిట్టరాదు.(అంటే, ఆయన నిందించదగిన పని చేశాడని అర్థం) బ్రహ్మ భూలోకంలో విద్వాంసుల నెందుకు సృష్టించాలి? తన బుద్ధివిశేషంతో సృష్టించినా, అంతటితో ఊరుకోక వారికి ఆకలి దప్పిక మొదలైన శారీరక బాధల నెందుకు కలిగించాలి? సృష్టించటం తన విధ్యుక్తధర్మం అంటే రాజులని దుష్ప్రవర్తకులనుగా ఎందుకు చేయాలి? అది అసహ్యించుకోదగినది కదా! అట్లా చేయటం ఎందుకు?

విశేషం:
బ్రహ్మసృష్టిలో తనకు కనిపించిన అవకతవకల నేకరవు పెడుతున్నాడు – పండితులకి కూడా ఆకలి దప్పికలని సృష్టించి నందుకు, రాజులని దుర్మార్గవర్తనులుగాచేసినందుకు. ఇది కూడ రాజులను నిందించే పద్యమే.

డాక్టర్ అనంతలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement