Thursday, May 2, 2024

బ్రహ్మ వరాలు

”మునీంద్రా! రాక్షసులు ఏ నియమాలను అనుసరిస్తూ ఎలాంటి తపస్సు చేశారు? వారి తపో విధానాన్ని, నియమ నిష్టలను తెలుపుమని” రాముడు కోరాడు.
”రామా! ఇంద్రియ నిగ్రహంతో కుంభకర్ణుడు ఘోర మైన తపస్సు చేశాడు. వేసవి కాలంలో పంచాగ్ని మధ్యంలో విరాసనుడై తపస్సు చేశాడు. వర్షాకాలంలో వానలో తడుస్తూ తపస్సు చేశాడు. చలికాలంలో నీటిలో మునిగి తపస్సు చేశాడు. కఠోరదీక్షాపరుడై 10వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. విభీష ణుడు సత్త్వగుణ సంపన్నుడై, ధర్మాచరణతో శుచియై 5 వేల ఏండ్ల పాటు ఒంటికాలిపై నిలిచి తపస్సు చేశాడు. మరల 5 వేల ఏండ్లు ఊర్ధ్వబాహుడై తల ఎత్తి పైకి చూస్తూ స్వాధ్యాయపరుడై తపస్సు చేశాడు.
దశకంఠుడు నిరాహారుడై కఠిన నియమవ్రతుడై 10వేల ఏండ్లు తపస్సు చేశాడు. అత్యంత సాహసోపేతుడై వేయి ఏండ్లకు ఒక తలను నరికి అగ్నికి ఆహుతి ఇచ్చాడు. 10 వేల ఏండ్లు ముగిసిన వెంటనే మిగిలిన ఒక్క తలను కూడ ఖండించబోతుండగా బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. దశకంఠుడు సంతోషించి అమరత్వాన్ని ప్రసా దింపుమని కోరాడు. అమరత్వం లభించదు. వేరొక వరం కోరు కొమ్మన్నాడు బ్రహ్మ. ”దేవ, దానవ, దైత్య, యక్ష, రాక్షస, గంధర్వ, గరుడ, కిన్నెర, కింపరుషాది దేవ జాతులచే, మానవులు తప్ప ఇత రులచే నాకు మరణం లేకుండ వరం ప్రసాదింపుము. మానవులు నన్నేమి చేయగలరు?” అని అహంకరించి పలికాడు. బ్రహ్మ అతడు కోరిన వరాన్ని అనుగ్రహించాడు. అగ్నిలో వ్రేల్చిన తొమ్మిది తలల ను మరల అతనికి ప్రసాదించాడు. ‘కామరూపుడవై సంచరింప గలవు’ అన్నాడు.
బ్రహ్మ విభీషణుని చూసి, వరం కోరుమన్నాడు. ”ధర్మ మార్గాన్ని తప్పకుండునట్లు, బ్రహ్మాస్త్రం నాపై ప్రభావం చూపకుం డునట్లు అనుగ్రహింపుము. బ్రహ్మాస్త్రాన్ని ప్రసాదింపుమ”ని విభీషణుడు వరాలు కోరాడు. విభీషణుని ధర్మ పరాయణతకు బ్రహ్మ సంతోషించాడు. విభీషణుడు కోరిన వరాలతో పాటు అమ రత్వాన్ని కూడ ప్రసాదించాడు.
బ్రహ్మ కుంభకర్ణునికి వరాలను ఇవ్వబోతుండగా దేవతలు, ”మహాత్మా! కుంభకర్ణుడు సహజంగానే క్రూరాత్ముడు. క్రూర కర్ముడు. ప్రాణి హింస అతనికి నిత్యకృత్యం! సర్వప్రాణి భోజనుడు. సర్వోన్నత ప్రమాణ దేహుడు. వరాలు లేనప్పుడు ముల్లోకాలకు సింహ స్వప్నం అయ్యాడు. నీ వరాలు కూడ తోడయితే లోకాలకు చేటు తప్పదు. ముల్లోకాలను మ్రింగేస్తాడు. ఇది తథ్యం. వర ప్రసా దం నెపంతో ఇతనిని మోహపూరితుని కావింపు”మని కోరారు. బ్రహ్మ సరస్వతిని స్మరించాడు. కుంభకర్ణుని నోటియందు ప్రవేశిం చమని అన్నాడు. సరస్వతి అతని నోటిని ఆవహించింది. వాగ్దేవి ప్రభావంతో కుంభకర్ణుడు మోహితుడై ‘గాఢనిద్ర’ను వరంగా కోరాడు. అట్లే అని పలికి బ్రహ్మ అంతర్ధానమయ్యాడు. సరస్వతి అదృశ్యమయ్యింది. కుంభకర్ణుని మోహం తొలగింది. ఇలాంటి వరం కోరడమేమిటి? అని కుంభకర్ణుడు చింతించాడు. ఇది దేవ తల పన్నాగమే అని నిజం గ్రహించాడు. దశకంఠుడు, కుంభ కర్ణుడు, విభీషణుడు బ్రహ్మ వర ప్రసాదితులై తండ్రి ఆశ్రమం శ్లేష్మా త్మకం చేరుకున్నారు.”
కుబేరుడు లంకను విడుచుట
తన మనుమలు బ్రహ్మ వర ప్రసాదితులయ్యారని సుమాలి తెలుసుకున్నాడు. అతడు ఉత్సాహపూరితుడై మారీచుడు, ప్రహస్తుడు, విరూపాక్షుడు, మహోదరులనే మంత్రి పుంగవులతో శ్లేష్మాత్మక వనానికి చేరుకున్నాడు. ఆనందభరితుడై రావణుని కౌగి లించుకున్నాడు. అభినందించాడు. ఇప్పుడు విష్ణువు భయం తొలగిపోయింది. పూర్వం భయంతో రసతలానికి పారిపోయిన రాక్షస జాతికి ఇక నీవే ప్రభుడవు! రాక్షసుల స్థావరమైన లంకానగ రాన్ని కుబేరుడు సొంతం చేసుకుని, రాజ్య వైభవాలను అనుభవిస్తు న్నాడు. అతనిని తరిమివేసి లంకను ఆక్రమించుకొందాం అన్నాడు సుమాలి. అన్నను ధిక్కరించడం తగని పని అని భావించి దశకంఠు డు మౌనం వహించాడు. తాత మాటను పట్టించుకోలేదు.
కొంతకాలం గడిచిన తర్వాత సుమాలి ప్రోద్బలంతో ప్రహ స్తుడు దశకంఠుని వద్దకు వచ్చాడు. కుబేరునిపై అతనికి ఉన్న సోదర ప్రేమను, దాయాది విరోధంగా మార్చ తలచుకున్నాడు. అదితి, దితి ఇద్దరూ అక్కా చెల్లెండ్రు. వారి బిడ్డలే సురాసురులు. దాయా దుల మధ్య రగిలిన పగను, దానివల్ల జరిగిన పోరాటాలను, దేవత లు వంచనతో విష్ణువు సాయంతో సాధించిన విజయాలను, రాక్షసు లు పడిన అగచాట్లను ఏకరువు పెట్టాడు. విరోధం పూర్వం నుండి ఉన్నదే అని దశకంఠుడు గ్రహించాడు. వెంటనే ప్రహస్తుని దూతగా కుబేరుని వద్దకు పంపాడు. ప్రహస్తుడు కుబేరుని సన్నిధికి చేరాడు. దశకంఠుని సందేశాన్ని ఇలా తెలిపాడు.
”సోదరా నీవు ధర్మాత్ముడవు కదా! నీది కాని లంకా నగరాన్ని పాలిస్తున్నావు. పూర్వంనుండి మాల్యవంతాది రాక్షసుల నివాస భూమి అయిన లంకను నీ వశంలో ఉంచుకోవడం నీతి కాదు. ధర్మం కాదు. స్నేహభావంతో నీకు సలహా ఇస్తున్నాను లంకను వెంటనే మాకు అప్పగించి, తప్పుకోవడం నీకు శ్రేయస్కరం” అనే దశకంఠుని సందేశాన్ని విని కుబేరుడు ఇలా అన్నాడు.
”ప్రహస్తా! లంకను మా తండ్రి విశ్రవసుని సూచన మేరకు నా నివాసంగా మార్చుకున్నాను. యక్ష రాక్షసులను, సుభిక్షంగా పాలి స్తున్నాను. నేను దశకంఠుడూ ఇరువురమూ సోదరులమే కదా! మనలో మనకు పొరపచ్చాలు ఎందుకు? ఈ రాజ్యాన్ని నాతో పాటు సోదరుడు కూడ అనుభవింపవచ్చు. ఈ విషయాన్ని నా సోదరునికి తెలుపు”మని ప్రతి సందేశం పంపాడు.
కుబేరుడు విశ్రవసుని వద్దకు వెళ్ళాడు. దశకంఠుడు ప్రహస్తు ని ద్వారా తనను హెచ్చరించిన వృత్తాంతాన్ని తెలిపాడు. కుబేరుని మాటలు విని విశ్రవసుడు, ”కుమారా! ఈ విషయం దశకంఠుడు ఇంతకు మునుపే నా వద్ద ప్రస్తావించాడు. నేను మందలించాను. అతడు నా మాటలు లెక్కచేయలేదు. నీవు దౌర్జన్యంగా లంకను ఆక్ర మిస్తే పతనం కాగలవు అని శపించాను. బ్రహ్మ వరప్రసాద గర్వి తుడై ఉన్నాడు కదా! నా శాప వాక్కులు అతని స్వాభిమానాన్ని రెచ్చ గొట్టాయి. కర్తవ్యాకర్తవ్య జ్ఞానహీనుడయ్యాడు. దుష్టునికి దూరం గా ఉండటం మంచిది అని పెద్దలంటారు కదా! కాబట్టి నీవు లంకను విడిచి, కైలాసగిరికి చేరుకోవడం మంచిది” అని విశ్రవసుడు హితవు పలికాడు. కుబేరుడు తండ్రి మాటను గౌరవించి లంకను విడిచి, యక్ష రాక్షసాది జాతులతో కైలాస పర్వతం చేరుకున్నాడు.
ప్రహస్తుడు కుబేరుని పలాయనం దశకంఠునికి తెలిపాడు. చేతికి నెత్తురు అంటకుండ లంక సొంతమయినందుకు దశకంఠు డు ఉప్పొంగిపోయాడు. సగర్వంగా హంగు ఆర్భాటాలతో లంకా నగరంలో ప్రవేశించాడు. లంక సింహాసనాన్ని అధిష్టించాడు.
– -కె. ఓబులేశు, 9052847742

Advertisement

తాజా వార్తలు

Advertisement