Thursday, May 16, 2024

అన్నమయ్య కీర్తనలు : ఎక్కడి మానుషజన్మం

రాగం : బౌళి

ఎక్కడి మానుషజన్మం బెత్తిన ఫలమేమున్నది
నిక్కము నిన్నెనమ్మితి నీచిత్తంబికను || ఎక్కడి ||

మరువను ఆహారంబును మరువను సంసారసుఖము
మరువను ఇంద్రియభోగము మాధవ నీమాయ
మరచెద సుజ్ఞానంబును మరచెద తత్త్వరహస్యము
మరచెద గురువును దైవము మాధవ నీమాయ || ఎక్కడి ||

విడువను పాపము పుణ్యము విడవను నాదుర్గుణములు
విడువను మిక్కిలి యాసలు విష్ణుడ నీమాయ
విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును
విడిచెద నాచారంబును విష్ణుడ నీమాయ || ఎక్కడి ||

తగిలెద బహు లంపటముల తగిలెద బహు బంధంబుల
తగులను మోక్షపు మార్గము తలపున యెంతైనా
అగపడి శ్రీ వేంకటేశ్వర అంతర్యామివై
నగినగి నను నీవేలితి నాకా యీమాయ || ఎక్కడి ||

Advertisement

తాజా వార్తలు

Advertisement