Tuesday, May 21, 2024

చిన్నతంబి సినిమాకి అప్పుడే 32 ఏళ్లా.. ఖుష్భూ

సీనియ‌ర్ న‌టి ఖుష్భూ హీరోయిన్ గా 32ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఆమె హీరోయిన్ గా న‌టించిన ఫ‌స్ట్ చిత్రం చిన్న‌తంబి రిలీజ్ అయి నేటికి 32సంవ‌త్స‌రాలు. తెలుగు, హిందీ, తమిళ్‌ భాషల్లో సుమారు 200కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు న‌టి ఖుష్బూ.. రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. కాగా 1991లో వచ్చిన చిన్నతంబి సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఖుష్బూ. అంతకుముందు కొన్ని సినిమాల్లో చైల్డ్‌ ఆర్టిస్టుగా నటించి మెప్పించింది. చిన్నతంబి సినిమాలో ప్రభు హీరో కాగా , ఖుష్బూ హీరోయిన్‌గా నటించింది. అప్పట్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. తెలుగులోనూ ఈ సినిమాను వెంకటేశ్‌ హీరోగా చంటిగా రీమేక్‌ చేశారు. ఇక్కడ కూడా సంచలన విజయం సాధించింది. కాగా చిన్నతంబి సినిమా విడుదలై ఏప్రిల్ 12కి 32 ఏళ్లు గడిచాయి.

ఈ సందర్భంగా సోషల్‌ మీడియాలో ఎమోషనల్‌ పోస్ట్‌ చేసింది ఖుష్బూ. ‘చిన్నతంబి సినిమా చేసి అప్పుడే 32 ఏళ్లు అయిందంటే అసలు నమ్మలేకపోతున్నా. నాపై కురిపించిన ప్రేమకు ఎప్పుడూ మీ అందరికీ రుణపడి ఉంటా. వాసు, ప్రభు కోసం నా గుండె ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటుంది. మనసులను కదిలించే సంగీతాన్ని అందించిన ఇళయరాజా సర్‌కు.. అలాగే కె.బాలుకి ఎప్పటికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నందిని ఈ సినిమాలో ఖుష్బూ పేరు ప్రతి ఒక్కరి హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయింది. మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు’ అని ఎమోషనల్‌గా రాసుకొచ్చారు..దీంతో పలువురు అభిమానులు, నెటిజన్లు ఆమెకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఖుష్బూ.. ఈ పేరు అప్పట్లో సంచలనం. 90వ దశకంలో తన అందం, అభినయంతో స్టార్‌ హీరోయిన్‌గా క్రేజ్‌ తెచ్చుకుందామె. వెంకటేశ్‌, రజనీకాంత్‌, కమల్‌ హాసన్, ప్రభు, కార్తీక్‌ వంటి స్టార్‌ హీరోలతో కలిసి నటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement