Monday, April 29, 2024

బిజెపి కంటిలో న‌లుసుగా విశాఖ ఉక్కు..

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్ర బీజేపీకి విశాఖ ‘ఉక్కు’ కంట్లో నలుసుగా మారింది. విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ.5వేల కోట్ల నిధుల సమీకరణ కోసం రాష్ట్రీయ ఇస్పాట్‌ నిగమ్‌ లిమిటెడ్‌(ఆర్‌ఐఎన్‌ఎల్‌) బిడ్దర్లు పిలవడంతో బీజేపీపై విమర్శల దాడి పెరిగింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణలో బీజేపీని ప్రధాన దోషిగా చేసేందుకు ఇంటా బయటా జరుగుతున్న ప్రయత్నాలు ఆ పార్టీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ప్రధానంగా విశాఖ స్టీలు ప్లాంట్‌ వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ జోక్యం బీజేపీ నేతలను మరింత ఇబ్బందులకు గురి చేస్తోంది. కార్మికులకు నష్టం లేనిరీతిలో కేంద్రం చర్యలు తీసుకుంటుందని చెప్పే బీజేపీ నేతల ఊరడింపు కంటే..ప్రైవేటీకరణ అడ్డుకుంటామనే విపక్ష పార్టీల ప్రకటనలకే స్టీలు ప్లాంటు ఉద్యోగులు, రాష్ట్ర ప్రజలనుంచి మద్దతు వస్తోంది. పైగా బీఆర్‌ఎస్‌ లక్ష్యంగా ఏపీ బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలు ప్రజలను అంతగా ఆకట్టుకోవడం లేదు. గతంలో స్టీలు ప్లాంట్‌ ఉద్యోగులు, కార్మికులను ఏపీ బీజేపీ నేతలు అనునయించారు. ఇప్పుడు మరోసారి అదే అంశంపై రాష్ట్ర రాజకీయాలు వేడెక్కడం..స్టీలు ప్లాంట్‌ పరిరక్షణ సమితి ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేయడం బీజేపీ నేతలకు మింగుడుపడటం లేదు. రాష్ట్రంలో ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలకు అధికార, విపక్ష పార్టీలు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నారు. రాష్ట్ర బీజేపీ కూడా ఇప్పటికే పలు జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు చేసి ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాలు చేసింది. దక్షిణ ముఖ ద్వారమైన ఏపీలో కాలూనేందుకు 2014 నుంచే బీజేపీ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. 2014 ఎన్నికల్లో టీడీపీతో కలిసి వెళ్లినప్పటికీ..మోడీ ఛరిస్మాతో జనసేనతో కలిసి నడిచేందుకే ఏపీ బీజేపీ మొగ్గు చూపుతోంది. ఇలాంటి తరుణంలో విశాఖ స్టీలు ప్లాంట్‌ వ్యవహారం బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేస్తోంది. పైగా పట్టున్న ఉత్తరాంధ్రలో స్టీలు ప్లాంట్‌ సెంటిమెంట్‌ మరింత ఇబ్బందులకు గురి చేస్తోంది.  కేంద్ర ప్రభుత్వం పైనే భారం మోపేందుకు బీజేపీ నేతలు నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

బిఆర్ ఎస్ కు హ‌క్కు లేద‌న్న మాధ‌వ్…
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల కోసం, స్టీల్‌ ప్లాంట్‌ పరి రక్షణ కోసం మాట్లాడే హక్కు బీఆర్‌ఎస్‌ పార్టీకి లేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిీవీఎన్‌ మాధవ్‌ అన్నారు. మంగళవారంఏర్పా టు- చేసిన మీడియా సమావేశం ఆయన మాట్లాడుతూ, బీఆర్‌ఎస్‌ పార్టీ తెలం గాణలో అరాచక పాలన చేస్తూ, ఇప్పడు ఏపీని ప్రగతిపథంలో నడిపిస్తానంటే నమ్మే పరిస్థితిలో ఇక్కడి ప్రజలు లేరన్నారు. 5 లక్షల కోట్లు- అప్పుల ఉబిలో ఉన్న స్టీల్‌ ప్లాంట్‌ను రక్షిస్తానని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఏపీలో ప్రవేశించడానికే రాష్ట్ర ప్రజలకు మాయ మాటలు చెబుతోందని, తెలంగాణ విభజన సమయంలో కేసిఆర్‌ ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement