Thursday, July 25, 2024

హీరో-హార్లే భాగస్వామ్యంలో మరిన్ని మోటార్‌ సైకిల్స్‌

దేశీయ ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటోకార్ప్‌ అమెరికాకు చెందిన హార్లే డేవిడ్‌సన్‌ భాగస్వామ్యంలో మరిన్ని అమెరికా మోడళ్లు దేశానికి రానున్నాయి. ఈ రెండు కంపెనీల భాగస్వామ్యంలో ప్రస్తుతం మార్కెట్‌లోకి తీసుకు వచ్చిన ఎక్స్‌-440 మోటార్‌ సైకిళ్లకు మంచి ఆదరణ లభిస్తోంది.

దీంతో మరికొన్ని మోడల్స్‌ను తీసుకు వచ్చేందుకు ఈ రెండు కంపెనీలు నిర్ణయించాయి. ప్రస్తుత భాగస్వామ్యాన్ని మరిన్ని సంవత్సరాల పాటు కొనసాగించడంతో పాటు ఇతర దేశాలకు కూడా ఇక్కడ తయారు చేసిన మోటార్‌ సైకిళ్లను ఎగుమతి చేయాలని ఈ రెండు సంస్థలు భావిస్తున్నాయి. త్వరలోనే దీనిపై ఒక సంయుక్త ప్రకటన రానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

దేశీయంగా ప్రీమియం మోటార్‌ సైకిళ్లకు క్రమంగా ఆదరణ పెరుగుతోంది. ప్రస్తుతం ఈ సెగ్మెంట్‌లో దేశీయ కంపెనీ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. దీనికి చెక్‌ పెట్టేందుకు హీరో- హార్లే డెవిడ్‌సన్‌ భాగస్వామ్యంలో ఎక్స్‌-440 మోడల్‌ను తీసుకు వచ్చింది. దీని ధర 2.4 లక్షలుగా నిర్ణయించారు. బజాజ్‌-ట్రయంఫ్‌ భాగస్వామ్యంలో స్పీడ్‌ 400 బైక్‌ ప్రీమియం బైక్‌ సెగ్మెంట్‌లో విడుదల చేశారు.

హార్లే డేవిడ్‌సన్‌ భాగస్వామ్యంలో ఎక్స్‌-440ని తీసుకు వచ్చిన హీరో మోటోకార్ప్‌ తన సొంత వేరియంట్‌ మేవ్రిక్‌ బైక్‌ను తీసుకు వచ్చింది. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో హీరోమోటోకార్ప్‌ కంపెనీ ఈ రెండు మోడల్స్‌లో 15 వేల యూనిట్లను విక్రయించింది. డిమాండ్‌ పెరగడంతో నెలవారీ తయారీ సామర్ధ్యాన్ని 6 నుంచి 10వేల యూనిట్లకు పెంచింది.

హార్లే డేవిడ్‌సన్‌ సొంతంగా భారత్‌లో వాహనాలను విక్రయించింది. డిమాండ్‌ లేకపోవడంతో 20199లో కంపెనీ తన కార్యకలాపాలను నిలిపివేసింది. ప్రధానంగా దిగుమతి సుంకాలు ఎక్కువగా ఉండడంతో దేశీయ మార్కెట్లో వీటి ధర ఎక్కువగా ఉండేది. ఫలితంగా దేశీయ కంపెనీల మోడల్స్‌తో పోటీ పడలేకపోయాయి.

- Advertisement -

తిరిగి భారత్‌లో మార్కెట్‌లో ప్రవేశించేందుకు హీరో మోటోకార్ప్‌తో జత కలిసింది. ఈ ఒప్పందంలో భాగంగా హీరోమోటోకార్ప్‌ దేశీయంగా మోటార్‌ సైకిళ్ల తయారీ, విక్రయం, విడిభాగాల విక్రయం వంటివి చేపడుతుంది. ఈ భాగస్వామ్యంలో వచ్చిన బైక్‌ అమ్మకాలు సంతృప్తి కరంగా ఉండటంతో మరిన్ని మోడల్స్‌ను తీసుకు వచ్చేందుకు ఈ రెండు కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement