Monday, April 29, 2024

చక్కెర ఎగుమతులపై ఆంక్షలు, దేశీయంగా పెరిగిన ధరలు..

దేశ ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపర్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీవ్రతరం చేసింది. మొన్నటికి మొన్న గోధుమల ఎగుమతిపై నిషేధం విధించిన కేంద్రం.. తాజాగా చక్కెర ఎక్స్‌పోర్ట్‌పై కూడా తాత్కాలికంగా నిషేధం విధించే అవకాశాలున్నాయి. దేశీయంగా చక్కెర ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. స్థానికంగా ధరలు అదుపు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తున్నది. 6 ఏళ్ల తరువాత.. భారత్‌ చక్కెర ఎగుమతులను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఈ మేరకు కొన్ని రోజుల పాటు ఆంక్షలు విధించే అవకాశాలున్నాయి. కొన్ని రోజుల క్రితం గోధుమల ఎగుమతులపై కళ్లెం వేయడంతో.. ప్రపంచ వ్యాప్తంగా ధరలు భారీగా పెరిగిపోయాయి. జీ-8 దేశాలు సైతం స్పందించాయి. గోధుమల ఎగుమతులపై విధించిన నిషేధం విషయంలో భారత్‌ మళ్లి ఆలోచించాలని సూచించాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని కొంత వరకు ఆంక్షలు సడలించినా.. ధరలు మాత్రం అదే స్థాయిలో ఉన్నాయి.

నియంత్రించి.. నిషేధం

తాజాగా చక్కెర ధరలు పెరిగిపోతుండటంతో.. ఎగుమతులను నియంత్రించి.. నిషేధం విధించాలని కేంద్రం భావిస్తున్నది. విదేశాలకు ఎగుమతి చేయడంతోనే దేశీయంగా చక్కెర ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆరేళ్ల తరువాత ఎగుమతులను నియంత్రించే నిర్ణయం తీసుకుంది. చక్కెర ఎగుమతుల్లో ప్రపంచ దేశాల్లో భారత్‌ రెండో అతిపెద్ద దేశంగా ఉంటోంది. బ్రెజిల్‌ మొదటి స్థానంలో కొనసాగుతున్నది. భారత్‌లో ఉత్పత్తి చేసే చక్కెర.. ఇండోనేషియా, మలేషియా, దుబాయ్‌, ఆఫ్గనిస్తాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, కొన్ని ఆఫ్రికన్‌ దేశాలకు ఎగుమతి చేస్తుంది. 2018-19లో 38 లక్షల టన్నుల చక్కెరను భారత్‌ విదేశాలకు ఎగుమతి చేసింది. ఆ తరువాతి సంవత్సరం.. 2019-2020లో ఈ సంఖ్య భారీగా పెరిగింది. 59.60 లక్షల టన్నుల చక్కెరను భారత్‌ ఎగుమతి చేసింది.

గతేడాది 70లక్షల టన్నుల ఎగుమతి..

2020-21 ఆర్థిక సంవత్సరంలో నమోదైన చక్కెర ఎగుమతులు 70 లక్షల టన్నులకు చేరుకున్నాయి. ప్రతీ ఏడాది.. చక్కెర ఎగుమతులు పెరుగుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రతీ సంవత్సరం పెరుగుతున్న చక్కెర ఎగుమతులను నియంత్రించాలని కేంద్రం నిర్ణయించింది. ఇలా చేయడంతో.. దేశీయంగా చక్కెర ధరలు తగ్గే అవకాశాలు ఉంటాయని తెలిపింది. ఈ ఏడాది మాత్రం కేవలం 10 లక్షల టన్నుల చక్కెరను మాత్రమే ఎగుమతి చేయాలని నిర్ణయించాలని తెలుస్తున్నది. అక్టోబర్‌లో దేశ వ్యాప్తంగా పండుగలు ప్రారంభం అవుతాయి. దీంతో దేశీయ మార్కెట్‌లో చక్కెరకు భారీగా డిమాండ్‌ పెరుగుతుంది. ఇప్పుడు ఎగుమతులు పెంచితే.. పండుగ సమయంలో డిమాండ్‌ పెరిగి ధరలు ఆకాశాన్ని అంటుకుంటాయనే ముందస్తు ఆలోచనతో కేంద్రం ఈ దిశగా అడుగులు వేస్తున్నది. ఈ ఆంక్షలు సెప్టెంబర్‌లో అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రం చక్కెర ఎగుమతులపై నియంత్రణ విధిస్తోందన్న వార్తలను స్టాక్‌ మార్కెట్‌ను ప్రభావితం చేసింది. ఫలితంగా షుగర్‌ స్టాక్స్‌ భారీగా పడిపోయాయి.

- Advertisement -

షుగర్‌ స్టాక్స్‌ డౌన్‌..

బాంబే స్టాక్స్‌ ఎక్స్ఛేంజీలో అవధ్‌ షుగర్‌ అండ్‌ ఎనర్జీ 11.07 శాతం, ధామ్‌పూర్‌ షుగర్‌ 5 శాతం, బలరామ్‌పూర్‌ చీనీ మిల్స్‌ 9.89 శాతం, ఈఐడీ ప్యారీ 3.42 శాతం, ఉగర్‌ షుగర్‌ 4.99 శాతం, మగధ్‌ షుగర్‌ అండ్‌ ఎనర్జీ 10.72 శాతం మేర షేర్లు క్షీణించాయి. అన్నింటికంటే రేణుకా షుగర్‌ అత్యధికంగా పడిపోయింది. ఈ కంపెనీకి చెందిన షేర్లు ఏకంగా 13.84 శాతం పడిపోయాయి. ఇతర షుగర్‌ కంపెనీలకు చెందిన షేర్లన్నీ కూడా నష్టాల్లోనే ట్రేడ్‌ అయ్యాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులతో అన్ని దేశాలు ఆహారపరంగా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా.. నిత్యవసర సరుకుల ధరలు భారీగా పెరిగాయని చెప్పుకోవచ్చు. సప్లై చైన్‌ దెబ్బతినడంతో కొన్ని ఉత్పత్తులకు డిమాండ్‌ తెగ పెరిగిపోయింది. తమ తమ దేశాల్లో నిత్యవసర సరుకుల ధరలు పెరగకుండా ఆయా దేశాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. మలేషియా జూన్‌ 1 నుంచి కోళ్ల ఎగుమతులను నిలిపివేయనుంది. ఇండోనేషియా ఇటీవల పామాయిల్‌ ఎగుమతులను తాత్కాలికంగా నిషేధించింది. ఇటు భారత్‌ గోధుమల ఎక్స్‌పోర్టు నిలిపివేసింది. సెర్బియా, కజకిస్తాన్‌ ధాన్యం ఎగుమతులపై నిషేధం విధించాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement