Wednesday, March 27, 2024

కామన్వెల్త్ పోటీలే తదుపరి లక్ష్యం.. ఒలింపిక్ కోసం రెట్టింపు కృషి : నికత్ జరీన్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కామన్వెల్త్ పోటీలే తన తదుపరి లక్ష్యమని వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణపతకం సాధించిన నికత్ జరీన్ అన్నారు. పోటీల్లో భారత ప్రతిష్టను రెపరెపలాడించిన నికత్ జరీన్ ఢిల్లీ చేరుకోవడంతో ఆమెను కేంద్ర ప్రభుత్వం సన్మానించింది. ఇండియన్ బాక్సింగ్ అసోసియేషన్ నేతృత్వంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలంగాణ బిడ్డ నికత్ జరీన్‌ను సన్మానించారు. ఆమెతో పాటు కాంస్య పతక విజేతలు మనీష, పర్వీన్‌కు కూడా సన్మానం చేశారు. ఈ కార్యక్రమం అనంతరం నికత్ జరీన్ తెలుగు మీడియాతో మాట్లాడారు. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించడం ఆనందంగా ఉందని అన్నారు. తన తదుపరి లక్ష్యం కామన్వెల్త్ పోటీలని చెప్పిన నికత్, ఒలంపిక్ పతకం సాధించేందుకు రెట్టింపు కృషి చేయాల్సిన అవసరముందని అన్నారు.

ఈ క్రమంలో తనకు ఇంకా చాలా మద్దతు కావాలని ఆమె తెలిపారు. ముస్లిం మహిళగా ఈ క్రీడల్లో రాణించే విషయంలో ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించినట్టు ఆమె వెల్లడించారు. తన తండ్రి కేవలం ఆట పైన దృష్టి పెట్టామన్నారని, రోజూ ఉదయం రెండు గంటలు, సాయంత్రం రెండు గంటల పాటు సాధన చేశానని ఆమె చెప్పారు. తన కుటుంబం ఇచ్చిన ప్రోత్సాహం, స్పాన్సర్ల మద్దతుతో ఇక్కడిదాకా రాగలిగానని నికత్ జరీన్ తెలిపారు. 2014లో తెలంగాణ ప్రభుత్వం తనకు ఆర్థిక సహాయం చేసిందని, ఒలంపిక్స్ కోసం ఆర్థిక సహాయం చేస్తుందని ఆశిస్తున్నానని ఆమె తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement