Wednesday, May 8, 2024

రుణ యాప్‌లపై నియంత్రణ.. మార్గదర్శకాలు జారీ చేసిన ఆర్బీఐ

ఆన్‌లైన్‌ రుణ యాప్‌లు, ఇతర డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ల నుంచి రుణాలు అందిస్తున్న సంస్థలు రుణాలను నేరుగా లబ్దిదారుల బ్యాంక్‌ అకౌంట్లలోనే జమ చేయాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆదేశించింది. రుణం మొత్తాన్ని మూడో వ్యక్తిద్వారా (థర్డ్‌పార్టీ) ద్వారా అందించడానికి వీలులేదని స్పష్టం చేసింది. ఈ సంస్థలు అనుసరించాల్సిన మార్గదర్శలను బుధవారం నాడు ఆర్బీఐ జారీ చేసింది. ఈ రంగంలో జరుగుతున్న రకరకాల మోసాలను అరికట్టే దిశగా ఆర్బీఐ చర్యలు చేపట్టింది. రుణాలు మంజూరు చేసే క్రమంలో ఫీజులు, ఛార్జీలను డిజిటల్‌ లెండింగ్‌ సంస్థలే లెండింగ్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌కు చెల్లించాలని, వినియోగదారుల నుంచి వసూలు చేయవద్దని ఆర్బీఐ ఆదేశించింది.

ఈ సంస్థలు పాటించాల్సిన మార్గదర్శకాలను అత్యంత వివరంగా ఆర్బీఐ పేర్కొంది. మూడో వ్యక్తులు, సంస్థల ద్వారా రుణాలు పంపిణీ చేయడం, వారే రుణాల వసూలుకు ప్రయత్నించడం, రుణ గ్రహిత డేటాను దుర్వినియోగం చేయడం, తప్పుడు మార్గాల్లో రుణాలను అంటగట్టడం, భారీగా వడ్డీ వసూలు చేయడం, రుణాల రికవరీకి అనైతిక పద్ధతులు అనుసరించడం ఇలా అనేక అంశాలపై ఆర్బీఐ వివరమైన నిబంధనలను జారీ చేసింది. డిజిటల్‌ లెడింగ్‌ సంస్థలు, ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా రుణాలు ఇచ్చే వ్యవహారంపై ఆర్బీఐ 2021, జనరవి 13న ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా ఆర్బీఐ మార్గదర్శకాలను జారీ చేసింది. రెగ్యులేటరీ పరిధిలోనే రుణాలను ఇవ్వాలని ఆదేశించింది. ఇలాంటి సంస్థలు నేరుగా ఆర్బీఐ నియంత్రలో ఉన్న సంస్థల నుంచి , చట్టం ద్వారా అనుమతి పొందిన వాటి నుంచే నిధులను సేకరించాల్సి ఉంటుంది. ఈ సంస్థలు రుణాలను నేరుగానే లబ్దిదారుల బ్యాంక్‌ ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో మూడో సంస్థ, వ్యక్తుల ప్రమేయం ఉండేందుకు అవకాశం లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. రుణాలు ఇచ్చే సంస్థలు తమ అకౌంట్‌ నుంచి రుణం తసుకున్న వ్యక్తి బ్యాంక్‌ అకౌంట్‌కు జమ చేయడం, రుణం చెల్లించే విధానంలో కూడా బ్యాంక్‌ అకౌంట్‌ ద్వారానే జరగాలని ఆదేశించింది. రుణం మంజూరు చేసి, ఒప్పందం చేసుకోవడానికి ముందుగానే రుణ గహితకు నిర్ధారించిన ప్రమాణాల ప్రకారం నిబంధనలను వివరిస్తూ ఒక పత్రాన్ని అందించాల్సి ఉంటుంది.

రుణాలు ఇచ్చిన సంస్థలకు, రుణాలు తీసుకున్న వారికి మధ్య ఏదైన వివాదం ఏర్పడితే రుణం తీసుకున్న వారు ఫిర్యాదు చేసిన 30 రోజుల్లోగా దీన్ని పరిష్కరించాల్సి ఉంటుంది. ఈ గడువు దాటితే రుణం తీసుకున్నవారు నేరుగా ఆర్బీఐ ఒంబుట్స్‌మెన్‌కు ఫిర్యాదు చేయవచ్చు. రుణం తీసుకునే వ్యక్తికి సంబంధించి నిబంధనలకు లోబడే సమాచారం సేకరించాల్సి ఉంటుంది. ఈ వివరాలను ఎందుకు సేకరిస్తున్నారో రుణ గ్రహితకు ముందునే వివరించాలి. వారి అనుమతితోనే ఈ సమాచారాన్ని సేకరించాల్సి ఉంటుంది. ఈ సంస్థలు అడిగే ప్రత్యేకమైన, అదనపు డేటాను తిరస్కరించే అధికారం రుణం తీసుకునే వ్యక్తి ఉంటుందని స్పష్టం చేసింది. కమిటీ రికమండ్‌ చేసిన వాటిలో కొన్నింటిపై మరింత పరిశీలన అవసరమని ఆర్బీఐ అభిప్రాయపడింది. కొన్ని అంశాలు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అంశాలు ఉన్నాయని, మరికొన్ని ఆయా భాగస్వాముల అభిప్రాయాలు తీసుకోవాల్సి ఉందని ఆర్బీఐ తెలిపింది. వీటి అమలుకు కావాల్సిన యంత్రాంగం, సాంకేతిక మద్దతు అవసరం అవుతుందని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement