Wednesday, May 8, 2024

తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర..

వాణిజ్య సిలిండర్‌ ధరను పెట్రోలియం సంస్థలు 25.5 రూపాయలు తగ్గించాయి. దీనితో పాటు విమాన ఇంధనం ధరను 4.5 శాతం తగ్గించాయి. తగ్గింపు ధరలు అక్టోబర్‌ 1 నుంచే అమల్లోకి వచ్చాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడంతో ఈ మేరకు చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఢిల్లిలో వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర 1859.50 రూపాయలకు తగ్గింది. కమర్షియల్‌ సిలిండర్‌ ధరను జూన్‌ నుంచి ఆరు సార్లు తగ్గించారు. ఈ ఆరు సార్లు కలిపి ఇప్పటి వరకు వాణిజ్య సిలిండర్‌పై 494.50 రూపాయలు తగ్గించారు. గృహ అవసరాలకు

వినియోగించే సిలిండర్‌ ధరలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. 14.2 కేజీల గృహ అవసరాల సిలిండర్‌ ధర 1053 రూపాయలు ఉంది. విమాన ఇంధనం ధరను 5,527.17 (4.5 శాతం) రూపాయలు తగ్గించారు. తగ్గించిన తరువాత విమాన ఇంధనం ధర కిలో లీటర్‌కు 1,15,520.27 రూపాయలుగా ఉంది. చమురు సంస్థలు వాణిజ్య సిలిండర్‌ ధరలను ప్రతి నెలకు ఒకసారి సమీక్షిస్తుంటాయి. విమాన ఇంధన ధరను ప్రతి 15 రోజులకు సమీక్షిస్తుంటాయి. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా వీటి ధరలను సవరిస్తుంటాయి. ద్రవ్యోల్బణం కట్టడిలో భాగంగా ఆరు నెలలుగా దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement