Sunday, April 28, 2024

డేంజర్‌ బెల్స్‌.. ప్రపంచ ఆర్థిక వృద్ధిరేటు కుదింపు

ఆర్థిక రంగంలో డేంజర్‌ బెల్స్‌ మ్రోగుతున్నాయి.. ప్రపంచం ఆర్ధిక మాంద్యం వైపు వేగంగా అడుగులు వేస్తోంది. మాంద్యానికి సమీపంలోనే ఉన్నామని ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షుడు డేవిడ్‌ మల్‌పాస్‌ హెచ్చరించారు. 2023 లో ప్రపంచ ఆర్ధిక వృద్ధిరేటును బ్యాంక్‌ 3 నుంచి 1.9 శాతానికి కుదించింది. ముంచుకు వస్తున్న ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో పేదలకు మరింత మద్దతు అందించాలని ప్రపంచ దేశాలకు ఆయన పిలుపునిచ్చారు. వాషింగ్టన్‌లో ప్రపంచ బ్యాంక్‌, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థల సంయుక్త వార్షిక సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధి చెందున్న దేశాల్లో ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు, పెట్టుబడుల కోత వంటి సమస్యలు పేద వర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని మల్‌పాల్‌ హెచ్చరించారు. ఇది ప్రపంచ బ్యాంక్‌ ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాల్‌ అన్నారు. దీని పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఒక్కో దేశంలో ఒక్కో తరహా సమస్య ఉందని, వాటికి అనుగుణంగా పరిష్కారాలను కనుగొనే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే కొన్ని దేశాలు వడ్డీరేట్లను పెంచడం ప్రారంభించాయని, మరికొన్ని దేశాలు ఇక పెంచలేని స్థితికి చేరుకున్నాయన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలను కలవరపెడుతున్న మరో సమస్య రుణభారం అని మల్‌పాల్‌ చెప్పారు. భారీ ఎత్తున్న రుణాలు తీసుకోవడమే పెద్ద సమస్య అయితే, దానిపై అధిక వడ్డీలు పరిస్థితిని మరింత జఠిలం చేసిందని అభిప్రాయపడ్డారు.

చాలా దేశాల కరెన్సీలు బలహీనంగా మారడం పెద్ద సవాల్‌గా మారిందన్నారు. దీని వల్ల అప్పుల భారం మరింత పెరుగుతుందన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఐదో రుణ సంక్షోభాన్ని చూస్తున్నామని ఆయన చెప్పారు. ఆర్ధిక మాంద్యం భయాలతోనే అమెరికాలో అనేక ఐటీ కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకునే చర్యలు చేపట్టాయి. కొత్తగా రిక్రూట్‌మంట్లను నిలిపివేశాయి. అమెరికా ఫెడరల్‌ బ్యాంక్‌ ఇప్పటికే పలుమార్లు వడ్డీరేట్లను పెంచింది. మన దేశంలోనూ ఆర్బీఐ మూడు సార్లు వడ్డీరేట్లను సవరించింది. అనేక అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల కేంద్ర బ్యాంక్‌లు సైతం వడ్డీరేట్లను పెంచుతున్నాయి. దీని వల్ల రుణాల వడ్డీరేటు భారీగా పెరుగుతోంది. సామాన్య, మధ్య తరగతిపై వడ్డీల భారం అంతకంతకూ పెరుగుతోంది. మరో వైపు అన్ని దేశాల్లోనూ ద్రవ్యోల్బణంతో అన్ని రకాల నిత్యవసరాల ధరలు పెరుగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement